వెల్డర్‌గా చేరాడు.. జాక్‌పాట్‌తో కోటీశ్వరుడిగా.. | Former SpaceX Welder Got 10 Crore Fortune After Historic IP, Reacts After Becoming Millionaire Says I Never Imagined This | Sakshi
Sakshi News home page

వెల్డర్‌గా చేరాడు.. జాక్‌పాట్‌తో కోటీశ్వరుడిగా..

Jun 15 2026 10:35 AM | Updated on Jun 15 2026 11:35 AM

Former SpaceX Welder Juan Got 10 Crore Fortune After Historic IP

ఉద్యోగంలో భాగంగా కంపెనీ ఇచ్చిన కొన్ని షేర్లు ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయని చెప్పే ఉదాహరణలు కార్పొరేట్ ప్రపంచంలో అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. తాజాగా అమెరికాలో అలాంటి కథే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకప్పుడు గంటకు 28 డాలర్ల వేతనంతో పనిచేసిన స్పేస్‌ఎక్స్ మాజీ వెల్డర్ జువాన్ హెర్నాండెజ్.. కంపెనీ ఇచ్చిన సుమారు 10,000 డాలర్ల (దాదాపు ₹9.5 లక్షలు) స్టాక్ గ్రాంట్ కారణంగా ఇప్పుడు దాదాపు 1.1 మిలియన్ డాలర్ల (సుమారు ₹10 కోట్లు) సంపదకు యజమానిగా మారాడు.

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ స్థాపించిన అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘స్పేస్‌ ఎక్స్‌’ ఇటీవల చరిత్రాత్మక ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ ఐపీఓకు ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన లభించింది. సంస్థ షేర్లు మార్కెట్లో లిస్టింగ్ అయిన తొలి రోజే గణనీయంగా పెరగడంతో ఉద్యోగులు, మాజీ ఉద్యోగుల వద్ద ఉన్న షేర్ల విలువలు అమాంతం ఎగబాకాయి. దీంతో, కొందరి పంట పండినట్టు అయ్యింది.

సాధారణ ఉద్యోగమే అనుకున్నా..
మెక్సికోకు చెందిన జువాన్ హెర్నాండెజ్ 2015లో స్పేస్‌ఎక్స్‌లో వెల్డర్‌గా చేరాడు. అప్పట్లో అతను గంటకు 28 డాలర్ల వేతనం పొందేవాడు. స్పేస్‌ఎక్స్ భవిష్యత్తులో ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రైవేట్ కంపెనీలలో ఒకటిగా ఎదుగుతుందని తాను ఊహించలేదని జువాన్ మీడియాకు తెలిపాడు. ఉద్యోగంలో చేరిన తర్వాత కంపెనీ ఇతర ఉద్యోగుల మాదిరిగానే అతనికి కూడా స్టాక్ ఆప్షన్లు, షేర్ గ్రాంట్లు ఇచ్చింది. అయితే, ఆ సమయంలో వాటి విలువ కేవలం 10,000 డాలర్ల వరకే ఉండేది. సాధారణంగా చాలామంది ఉద్యోగులు చేసేలా వాటిని పట్టించుకోకుండా ఉంచేశానని ఆయన చెప్పారు.

పదేళ్లలో మారిన పరిస్థితి..
గత పదేళ్లలో స్పేస్‌ఎక్స్ అంతరిక్ష రంగంలో అసాధారణ విజయాలు సాధించింది. పునర్వినియోగ రాకెట్లు, ఉపగ్రహ ప్రయోగాలు, స్టార్‌షిప్ ప్రాజెక్టు, స్టార్‌లింక్ సేవలు వంటి కార్యక్రమాలతో సంస్థ విలువ వేగంగా పెరిగింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ విలువ ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంది. తాజాగా జరిగిన ఐపీఓలో పెట్టుబడిదారుల నుంచి అపూర్వ స్పందన రావడంతో షేర్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో జువాన్ వద్ద ఉన్న వేలాది షేర్ల విలువ ఒక్కసారిగా 1 మిలియన్ డాలర్లకు పైగా చేరుకుంది.

వెల్డర్ నుంచి కోటీశ్వరుడిగా..
స్పేస్‌ఎక్స్‌లో వెల్డర్‌గా ప్రారంభమైన జువాన్ కెరీర్ తర్వాత సూపర్వైజర్ స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం ఆయన మరో ఏరోస్పేస్ సంస్థలో పనిచేస్తున్నప్పటికీ, స్పేస్‌ఎక్స్‌లో సంపాదించిన షేర్లే అతనికి జీవితకాల ఆర్థిక భద్రతను కల్పించాయి. ఈ సంపద వచ్చిన తర్వాత కూడా ఉద్యోగం మానేయాలనే ఆలోచన లేదని జువాన్ పేర్కొన్నాడు. డబ్బు వచ్చినంత మాత్రాన జీవితం మారిపోదని, కష్టపడి పనిచేయడం కొనసాగిస్తానని చెప్పాడు. తన పిల్లలకు పెట్టుబడులు, పొదుపు, దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికల విలువను నేర్పించాలనుకుంటున్నానని వెల్లడించాడు.

వేలాది మంది ఉద్యోగులకు జాక్‌పాట్
జువాన్ ఒక్కరే కాదు. స్పేస్‌ఎక్స్ ఐపీఓ వల్ల వేలాది మంది ప్రస్తుత, మాజీ ఉద్యోగులు భారీగా లాభపడ్డారని అంచనా. నివేదికల ప్రకారం.. 4,000 మందికిపైగా ఉద్యోగులు మిలియనీర్లుగా మారినట్లు తెలుస్తోంది. వెల్డర్లు, మెకానిక్‌లు, టెక్నీషియన్లు, ఫ్యాక్టరీ కార్మికులు, ఇంజినీర్లు, మిషన్ ఆపరేటర్లు వంటి వివిధ స్థాయిల ఉద్యోగులు కంపెనీ షేర్ల ద్వారా గణనీయమైన సంపదను సొంతం చేసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement