అస్సాంను ఇటీవల ముంచెత్తిన వరదలు ఒకవైపు వేలాది కుటుంబాలను దారుణంగా దెబ్బతీస్తే మరోవైపు సైబర్ నేరగాళ్లకు, అక్రమార్కులకు కాసులు కురిపించే అవకాశంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. బాధితులను ఆదుకోవాలనే పౌరుల ఉదారతను ఆసరాగా చేసుకుని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా భారీ విరాళాల దందా సాగుతోంది. నిధులు సేకరిస్తున్న ఖాతాల్లో ప్రతి పదింటిలో తొమ్మిది (దాదాపు 90%) వ్యాపార ఖాతాలు సందేహాస్పద రీతిలో ఉన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
తనిఖీల్లో వెల్లడైన అంశాలు
పరిశోధన బృందం విరాళాలు సేకరిస్తున్న 40 ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను సమగ్రంగా పరిశీలించగా అందులో 35 ఖాతాలు ప్రధాన భద్రతా ప్రమాణాల్లో విఫలమయ్యాయి. విరాళాలు కోరుతున్న 40 ఖాతాల్లో 38 ఖాతాలు కేవలం జులైలోనే కొత్తగా ప్రారంభించినవి. వీటి వెనుక ఎలాంటి గుర్తింపు లేదా పూర్వాపరాల రికార్డులు లేవు. 39 ఖాతాలు నమోదు చేసుకున్న స్వచ్ఛంద సంస్థలు లేదా ట్రస్టుల ఖాతాలకు కాకుండా వ్యక్తిగత యూపీఐ ఐడీలకు నిధులు మళ్లించేలా డిజైన్ చేశారు. 36 ఖాతాల్లో అందించిన ఫోన్ నంబర్లు అసలు పనిచేయడం లేదు లేదా సంప్రదించడానికి వీలు లేకుండా ఉన్నాయి.
పాత వీడియోలు.. తప్పుడు ప్రచారాలు
ప్రజల సానుభూతిని సొమ్ము చేసుకునేందుకు ఈ ఖాతాదారులు తీవ్ర మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళన సమయంలో ఉచిత ఆహార పంపిణీకి సంబంధించిన వీడియోలను రీ-ఎడిట్ చేసి అస్సాం వరద బాధితులకు సాయం చేస్తున్నట్లుగా ప్రచారం చేయడం గమనార్హం. మరికొందరు స్థానిక యంత్రాంగం ఉచితంగా పంపిణీ చేస్తున్న సహాయక సామగ్రినే తాము ప్రజల విరాళాలతో కొనుగోలు చేసి ఇస్తున్నట్లు క్లైమ్ చేస్తున్నారని స్థానిక ఇన్‌ఫ్లుయెన్సర్లు ఆరోపిస్తున్నారు.
ఇలాంటి ప్రకృతి విపత్తుల వేళ దాతలు సోషల్ మీడియాలోని ప్రైవేట్ ఖాతాలకు నేరుగా డబ్బులు పంపకూడదు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ముఖ్యమంత్రి సహాయ నిధి లేదా విదేశీ నిధుల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద నమోదైన ప్రామాణిక స్వచ్ఛంద సంస్థల బ్యాంకు ఖాతాల వివరాలను సరిచూసుకున్న తర్వాతే విరాళాలు అందించడం శ్రేయస్కరం.
ఇదీ చదవండి: బ్యాంక్ శాఖల్లో ప్రత్యేక యంత్రాల ఏర్పాటు


