చెట్టు మీద భర్త.. వరదలో కొట్టుకుపోయిన భార్యాపిల్లలు | Man Clings to Tree Watches Wife Daughters Swept Away in Flood | Sakshi
Sakshi News home page

చెట్టు మీద భర్త.. వరదలో కొట్టుకుపోయిన భార్యాపిల్లలు

Aug 1 2026 7:35 AM | Updated on Aug 1 2026 8:02 AM

Man Clings to Tree Watches Wife Daughters Swept Away in Flood

క్షణాల్లో వచ్చిన వరద ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో కారు కొట్టుకుపోతుండగా.. తండ్రి చెట్టును పట్టుకుని బయటపడగలిగాడు. కానీ.. అందులో ఉన్న భార్య, ఇద్దరు కూతుళ్లు మాత్రం అతడి కళ్ల ముందే ప్రవాహంలో కలిసిపోయారు. ఈ విషాద ఘటన ఆ కుటుంబంలో తీరని వేదన మిగిల్చింది.

మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. యవత్మాల్‌ జిల్లాలో వరద ఉధృతికి ఓ ఎస్‌యూవీ వాహనం కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో భార్య, ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు కోల్పోగా.. తండ్రి మాత్రం సమయస్ఫూర్తితో చెట్టును పట్టుకుని బయటపడ్డాడు. అయితే తన కళ్ల ముందే కుటుంబం వరదలో కొట్టుకుపోవడంతో గుండెలు పగిలేలా కన్నీటి పర్యంతం అయ్యాడు.

అహిల్యానగర్‌ జిల్లాలోని లోని ప్రాంతానికి వెళ్తున్న అవినాశ్‌ ఖండారే కుటుంబం గురువారం ఈ ప్రమాదానికి గురైంది. అవినాశ్‌ తన భార్య మాధవి, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న సమయంలో దర్వా ప్రాంతంలోని కుప్తి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తున్నప్పటికీ.. నీటి లోతు, ప్రవాహ తీవ్రతను అంచనా వేయడంలో పొరపాటు జరగడంతో వాహనం ముందుకు కదిలింది. వంతెన దాటే క్రమంలో ఒక్కసారిగా కారు అదుపుతప్పి ఉధృతమైన వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది.

కారు కొట్టుకుపోతున్న సమయంలో అవినాశ్‌ ఖండారే అప్రమత్తమై సమీపంలోని ఓ చెట్టును పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. అయితే కారులో ఉన్న భార్య మాధవి, ఇద్దరు కుమార్తెలను మాత్రం రక్షించలేకపోయాడు. సహాయం కోసం ఆర్తనాదాలు చేసినా.. ఫలితం లేకపోయింది. కాసేపటి తర్వాత వరద ఉధృతి తగ్గగా.. స్థానికులు చెట్టు మీద ఉన్న అవినాశ్‌ను గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు.. శుక్రవారం వరదలో కొట్టుకుపోయిన వాహనాన్ని గుర్తించారు. కారుతో పాటు మాధవి, కుమార్తెల మృతదేహాలను వెలికితీశారు.

మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 13 మంది మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. భారీ వర్షాలతో వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వందలాది కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. పలు జిల్లాలకు రెడ్‌, ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement