మహబూబ్‌నగర్: కర్నూల్ జిల్లా గుత్తిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరికల్ మండలానికి చెందిన ఓ యువకుడు సజీవంగా దహనమైన ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండలంలోని బూడెగానితండాకు చెందిన రవినాయక్ (35)తో పాటు గాజులయ్యతండాకు చెందిన దేఘావత్ జాడోనాయక్, రవినాయక్ కలిసి బుధవారం రాత్రి కారులో కర్నూల్ జిల్లా గుత్తికి వెళ్లారు.
గురువారం తెల్లవారుజామున గుత్తి శివారులో జాతీయ రహదారిపై వెళ్తున్న లారీని వెనక నుంచి వీరి కారు ఢీకొట్టింది. కారులో డీజిల్ డబ్బాలు ఉండటంతో మంటల చెలరేగాయి. గాజులయ్యతండాకు చెందిన జాడోనాయక్, రవినాయక్ కారులో నుంచి బయటకు దూకేయగా.. డ్రైవింగ్ చేస్తున్న బూడెగానితండాకు చెందిన రవినాయక్ అందులో ఇరుక్కుపోయాడు. కారుకు మంటలు తీవ్రంగా వ్యాపించడంతో కారుతో పాటే సజీవంగా దహనమయ్యాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


