జమ్మూ కశ్మీర్‌ సీఎం వివాహం రద్దు!  | JK CM Omar Abdullah and Payal Abdullah Granted Divorce by Supreme Court | Sakshi
Sakshi News home page

జమ్మూ కశ్మీర్‌ సీఎం వివాహం రద్దు! 

Aug 1 2026 6:02 AM | Updated on Aug 1 2026 6:28 AM

JK CM Omar Abdullah and Payal Abdullah Granted Divorce by Supreme Court

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా వివాహాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం అధికారికంగా రద్దు చేసింది. ఒమర్‌తోపాటు భార్య పాయల్‌ల వాదనలు విన్న తరువాత సుప్రీంకోర్టు తుది తీర్పునిస్తూ ‘‘ఇరువురు స్వేచ్ఛను ఎంచుకున్నారు’’అని వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 కింద తమ వివాహాన్ని రద్దు చేయాలని, ఈ మేరకు ఇద్దరూ ఒక అంగీకరానికి వచ్చామని ఒమర్‌ తరఫు న్యాయవాది కపిల్‌ సిబాల్‌ చేసిన వాదనలను జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహన్, జస్టిస్‌ అలోక్‌ ఆరాధేలతో కూడిన బెంచ్‌ సుప్రీంకోర్టు అంగీకరించింది.

 ‘‘ఆర్టికల్‌ 142 కింద దరఖాస్తు ఎప్పుడు నమోదైంది’’అన్న బెంచ్‌ ప్రశ్నకు కపిల్‌ సిబల్‌ ‘‘జూలై 22న’’అని సమాధానమిచ్చారు. పాయల్‌తో తన వివాహం 1994లోనే జరిగినా 2007లో తమిద్దరి మధ్య వైవాహిక సంబంధాలు లేవని ఒమర్‌ అబ్దుల్లా కోర్టుకు గతంలోనే వెల్లడించారు. 2009 నుంచి భార్యభర్తలు ఇద్దరూ విడిగా జీవిస్తున్నారు. 

ఒంటరిని చేయడం, క్రూరత్వాన్ని ప్రదర్శించడం వంటి అంశాల ఆధారంగా పాయల్‌ నుంచి విడాకులు ఇప్పించాలని ఒమర్‌ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అయితే 2016లో ఫ్యామిలీకోర్టు దీన్ని తిరస్కరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఒమర్‌ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. 2023లో ఢిల్లీ హైకోర్టు కూడా ఫ్యామిలీకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ పాయల్‌కు నెలకు రూ.1.5 లక్షలు, సంతానం చదువుల కోసం ఒకొక్కరికి నెలకు రూ.60 వేల చొప్పున చెల్లించాలని ఆదేశించింది. దీంతో ఒమర్‌ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. పాయల్‌ తన స్పందనను తెలపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే జూలై 22న ఒమర్‌ ఆర్టికల్‌ 142 కింద వివాహాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టును అర్థించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement