వీధి జంతువుల వల్ల జరిగేప్రమాదాలకూ పరిహారం!  | SC directs Centre, states to compensate victims of stray cattle accidents | Sakshi
Sakshi News home page

వీధి జంతువుల వల్ల జరిగేప్రమాదాలకూ పరిహారం! 

Aug 1 2026 5:18 AM | Updated on Aug 1 2026 5:18 AM

SC directs Centre, states to compensate victims of stray cattle accidents

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు 

రోడ్డు ప్రమాదాలకు యజమానులే బాధ్యత వహించాలి 

జంతువులకు తప్పనిసరిగా ట్యాగింగ్‌ చేయాలి 

పశువులను వదిలేస్తే షెల్టర్లకు అప్పగించాల్సింది యజమానులే

సాక్షి, న్యూఢిల్లీ: రోడ్లపై వీధి జంతువులు, పశువుల కారణంగా జరుగుతున్న ప్రమాదాలపై సుప్రీంకోర్టు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వీధి జంతువుల వల్ల జరిగే ప్రమాదాల్లో బాధితులకు పరిహారం చెల్లించేలా ఒక సమగ్ర యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. జంతువుల యజమానులే పూర్తి బాధ్యత వహించేలా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్‌ సంజయ్‌ కరోల్, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. 

రాష్ట్ర ప్రభుత్వాలు పశువులకు సంబంధించి చేసిన చట్టాలను తక్షణం, పూర్తిస్థాయిలో అమలు చేయాలని ధర్మాసనం పేర్కొంది. పశువులు, వీధి జంతువుల వల్ల పాదచారులు, వాహనదారులకు జరిగే ప్రమాదాలకు పరిహారం చెల్లించే యంత్రాంగాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన సవరణలు లేదా కొత్త నిబంధనలు రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించింది. పగటి పూట బయటకు వెళ్లిన జంతువులు సాయంత్రానికి తిరిగి తమ నిర్దిష్ట నివాసాలకు చేరుకునేలా చూసుకోవాల్సిన బాధ్యత యజమానులదేనని కోర్టు తేల్చిచెప్పింది. 

ట్యాగింగ్‌ తప్పనిసరి  
దేశవ్యాప్తంగా ఉన్న జంతువులన్నింటికీ విధిగా ట్యాగింగ్‌ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇలా చేయడం ద్వారా వాటిని సులభంగా గుర్తించడంతో పాటు దీర్ఘకాలిక ఆరోగ్య సేవలు, పశువైద్య పరీక్షలు, టీకాలు వేయడం వంటివి పర్యవేక్షించేందుకు వీలవుతుందని అభిప్రాయపడింది. వయసు పైబడిన తర్వాత, లేదా ఆర్థికంగా ఉపయోగపడవని భావించిన జంతువులను రోడ్లపై వదిలేస్తున్న వాస్తవాన్ని కాదనలేమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇలాంటి పరిస్థితుల్లో పశువులను రోడ్లపైకి వదిలేయకుండా ప్రభుత్వ గుర్తింపు పొందిన షెల్టర్లకు సురక్షితంగా తరలించాల్సిన బాధ్యత యజమానులదేనని స్పష్టం చేసింది. 

రూ.29.32 లక్షల పరిహారం కేసు నేపథ్యంలో.. 
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని వీధి ఆంబోతు ఢీకొనడంతో అతడికి తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయాడు. భర్త మృతితో పరిహారం కోరుతూ అతడి భార్య పంజాబ్‌–హరియాణా హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి బెంచ్‌.. మోటారు వాహనాల చట్టం–1988 నిబంధనల ఆధారంగా మృతుడి వయసు, ఆదాయం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని బాధిత కుటుంబానికి రూ.29.32 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. అయితే, ఆర్టికల్‌ 226 కింద వివాదాస్పద వాస్తవాలను తేల్చలేమని పేర్కొంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును పంజాబ్‌–హర్యానా హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కొట్టివేసింది. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన ఈ తీర్పును సవాల్‌ చేస్తూ బాధిత మహిళ సుప్రీంకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ తాజా మార్గదర్శకాలను జారీ చేసింది.  

ప్రతి విభాగానికీ నోడల్‌ అధికారి  
షెల్టర్ల నిర్వాహకులు సైతం జంతువులను స్వీకరించినట్లు రసీదు జారీ చేయాలని, ఆ వివరాలను ట్యాగింగ్‌ డేటాబేస్‌లో నమోదు చేయాలని ధర్మాసనం సూచించింది. జంతువుల ట్యాగింగ్, రికార్డుల డిజిటలైజేషన్, షెల్టర్ల నిర్వహణ సజావుగా సాగేలా పర్యవేక్షించేందుకు ప్రతి కార్పొరేషన్‌ లేదా విభాగంలో ఒక నోడల్‌ అధికారిని నియమించాలని అధికారులకు కోర్టు సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement