కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో తీవ్రమవుతున్న నీటి కొరతను అధిగమించేందుకు ‘బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి పారుదల మండలి’ (బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ) కీలక నిర్ణయం తీసుకుంది. తాగునీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కఠినమైన ఆంక్షలు విధిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తాగునీటిని వాహనాల వాషింగ్‌కు, తోటపని (గార్డెనింగ్), భవన నిర్మాణాలు, రోడ్ల శుభ్రత, ఫౌంటెన్ల నిర్వహణ వంటి ఇతర అవసరాలకు వాడటంపై పూర్తి నిషేధం విధించింది.
రూ.5,000 ఫైన్
బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ చట్టం 1964 లోని సెక్షన్లు 33, 34 ప్రాతిపదికన ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. నిబంధనలను ఉల్లంఘించి తాగునీటిని వ్యాపార లేదా ఇతర అవసరాలకు వాడే వారికి మొదటిసారిగా రూ.5,000 జరిమానా విధిస్తారు. ఒకవేళ ఉల్లంఘన పునరావృతమైతే రూ.5,000 తో పాటు రోజూ అదనంగా రూ.500 వంతున జరిమానా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. మాల్స్, సినిమా హాళ్లు, వినోద కేంద్రాల్లో కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే కావేరీ నీటిని వినియోగించడానికి అనుమతి ఉంటుంది.
శుద్ధి చేసిన నీటినే వాడాలి..
వాహనాల కడగడం, తోటపని వంటి ప్రాథమికేతర అవసరాల కోసం కేవలం శుద్ధి చేసిన రీసైకిల్ నీటిని మాత్రమే వినియోగించాలని బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ చైర్మన్ సూచించారు. జలమండలి సిబ్బంది క్షేత్రస్థాయిలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తారని, ఎవరైనా తాగునీటిని వృథా చేస్తే పౌరులు హెల్ప్‌లైన్ నంబర్ 1916 ద్వారా ఫిర్యాదు చేయవచ్చని విజ్ఞప్తి చేశారు.
పడిపోతున్న భూగర్భజలాలు
వర్షభావ పరిస్థితులు, ఎల్-నినో ప్రభావం వల్ల నగరంలోని వందలాది బోర్‌వెల్స్ ఎండిపోవడంతో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. దాదాపు 1.4 కోట్ల జనాభా కలిగిన ఐటీ కారిడార్‌లో రోజువారీ నీటి అవసరాలకు, సరఫరాకు మధ్య పెద్ద వ్యత్యాసం ఏర్పడింది. ఈ క్రమంలో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యగా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ట్యాంకర్ల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు నీటి ధరలను కూడా ప్రభుత్వం ఇప్పటికే క్రమబద్ధీకరించింది. ప్రతీ చుక్క నీటినీ బాధ్యతాయుతంగా వాడుకోవాలని పౌరులకు జలమండలి పిలుపునిచ్చింది.
ఇదీ చదవండి: బ్యాంక్ శాఖల్లో ప్రత్యేక యంత్రాల ఏర్పాటు


