తాగు నీటి సరఫరాకు మాస్టర్‌ ప్లాన్‌ | Drinking Water Supply Master Plan for Hyd Core Urban Region: CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

తాగు నీటి సరఫరాకు మాస్టర్‌ ప్లాన్‌

Jul 24 2026 6:10 AM | Updated on Jul 24 2026 6:10 AM

Drinking Water Supply Master Plan for Hyd Core Urban Region: CM Revanth Reddy

హైదరాబాద్‌ చుట్టూ ఉన్న తాగు నీటి వనరులను అనుసంధానం చేయాలి 

వాటర్‌బోర్డుపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: క్యూర్‌ (కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ) పరిధిలో తాగు నీటి సరఫరాకు సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీతోపాటు విలీన మున్సిపాలిటీల్లోనూ తాగు నీటి సరఫరాలో ఏకరూపత ఉండాలన్నారు. రానున్న 50 ఏళ్ల అవసరాలకు తగినట్లు మాస్టర్‌ ప్లాన్‌ ఉండాలని సూచించారు.

 హైదరాబాద్‌ మహా నగర తాగునీటి సరఫరా, సీవరేజీ బోర్డు పరిధిలోని పనులపై ముఖ్యమంత్రి ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో గురువారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం వల్ల తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. హైదరాబాద్‌ చుట్టూ ఉన్న తాగు నీటి వనరులను అనుసంధానించాలన్నారు. ఏదేని కారణంతో ఒక చోటి నుంచి నీరు సరఫరా కాకపోయినా మరో చోటి నుంచి వచ్చేలా ఆయా ప్రాంతాలకు సరఫరా చేసేందుకు అనుసంధానత దోహదపడుతుందన్నారు. 

రోజు విడిచి రోజు ఇవ్వాల్సిందే.. 
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏళ్లుగా పలు ప్రాంతాల్లో మూడునాలుగు రోజులకోసారి తాగు నీరు సరఫరా చేస్తున్నారని, ఇక ముందు ఆ పరిస్థితి ఉండకూడదని సీఎం రేవంత్‌ చెప్పారు. ఆయా ప్రాంతాలకు రోజు విడిచి రోజు నీరు సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులు ఆదేశించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న తాగు నీటి సరఫరా పనులను ఏడాదిన్నరలోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఎస్టీపీల నిర్మాణ పనులపై ఆరా తీసిన ఆయన.. వాటి నిర్మాణాన్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలన్నారు. ఎక్కడైనా న్యాయపరమైన సమస్యలుంటే త్వరగా పరిష్కరించాలని సూచించారు.

తాగు నీటి సరఫరాకు సంబంధించిన పనులు, ఎస్టీపీల నిర్మాణ పనుల ప్రగతిపై ప్రతి నెలా తనకు నివేదిక సమరి్పంచాలన్నారు. పనుల పురోగతి తెలుసుకునేందుకు డ్యాష్‌ బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో పరిశ్రమలు, వివిధ నిర్మాణ పనుల్లో గ్రే వాటర్‌ (వినియోగార్హమైన మురుగునీరు) వాడేలా నిబంధనలు రూపొందించి అమలు చేయాలని పేర్కొన్నారు. సమీక్షలో ఎంఏయూడీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జయేశ్‌రంజన్, సీఎం సెక్రటరీ మాణిక్‌ రాజ్, జలమండలి ఎండీ అశోక్‌ రెడ్డి, జేఎండీ మయాంక్‌ మిట్టల్‌ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement