అక్రమంగా ‘ఎగిరొస్తున్న’ చైనా డ్రోన్లు! | Chinese drone smuggling hub at Shamshabad airport | Sakshi
Sakshi News home page

అక్రమంగా ‘ఎగిరొస్తున్న’ చైనా డ్రోన్లు!

Jul 24 2026 4:41 AM | Updated on Jul 24 2026 4:41 AM

Chinese drone smuggling hub at Shamshabad airport

శంషాబాద్‌ విమానాశ్రయం కేంద్రంగా స్మగ్లింగ్‌ 

వచ్చే వాటిలో డీజేఐ కంపెనీకి చేసినవే అత్యధికం 

గతేడాది 214 పట్టివేత, ఈ ఏడాది ఇప్పటికి 18 

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయం కేంద్రంగా డ్రోన్ల స్మగ్లింగ్‌ వ్యవస్థీకృతంగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు, లైసెన్సులు లేని వాళ్లకు విక్రయించడానికి కొన్ని ముఠాలు పని చేస్తున్నాయి. ఈ దందాపై దృష్టి పెట్టిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ), కస్టమ్స్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. గత ఏడాది ఎయిర్‌పోర్టులో 12 కేసుల్లో 214 డ్రోన్లు స్వాధీనం కాగా.. ఈ ఏడాది కాస్త జోరు తగ్గినప్పటికీ 10 మంది వద్ద 18 డ్రోన్లు చిక్కాయి. 

ఇది వ్యవస్థీకృతంగా సాగుతోందని భావించి అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ అక్రమ దందాను అధికారులు కేవలం పన్ను ఎగ్గొట్టడానికి సంబంధించిన ఉల్లంఘనగా చూడట్లేదు. ‘స్మగ్లింగ్‌ ఇన్‌ ఇండియా రిపోర్ట్‌–2024–25’లో చైనా నుంచి వస్తున్న డ్రోన్లు నిఘా కోసం, మాదకద్రవ్యాలు, ఆయుధాలు, ఇతర నిషేధిత వస్తువుల రవాణాకు ఉపయోగించే అవకాశం ఉందని పేర్కొంది. 

యథాతథంగా తీసుకురావడం నిషేధం 
ఒక్క చైనానే కాదు ఏ దేశం నుంచీ డ్రోన్‌ను యథాతథంగా తీసుకురావడంపై నిషేధం అమలులో ఉంది. కేవలం విడిభాగాలను మాత్రమే దిగుమతి చేసుకుని ఇక్కడి యూనిట్లలో వాటిని అసెంబుల్‌ చేయాల్సి ఉంది. ఇక్కడి వారికి ఉపాధి కల్పించాలన్నది ఈ నిబంధనలో కనిపిస్తున్న అంశమైనా... గూఢచర్యం, గోప్యతను నిరోధించడమే ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. 

వినియోగానికి సిద్ధంగా ఉన్న డ్రోన్లలో ఆయా దేశాలు ఏఏ సాంకేతిక పరిజ్ఞానం వాడారనేది తెలిసే అవకాశం లేదు. మరోపక్క చైనాకు చెందిన డీజేఐ కంపెనీ ఇలా ప్రపంచంలోని అనేక దేశాలకు పంపిస్తున్న డ్రోన్లలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీని ద్వారా ఇక్కడ ఆ డ్రోన్‌ చిత్రీకరిస్తున్న ప్రతి దృశ్యాన్ని ఆ దేశానికి పంపిస్తుందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.  

స్మగ్లింగ్‌తో అనర్హుల చేతుల్లోకీ... 
డ్రోన్‌ను ఎగురవేయాలంటే కచ్చితంగా డ్రోన్‌ పైలెట్‌ శిక్షణ తీసుకుని, లైసెన్సు పొందాల్సి ఉంటుంది. అన్ని అనుమతులతో డ్రోన్‌ను దిగుమతి చేసుకోవాలంటే కచ్చితంగా లైసెన్స్‌ కలిగి ఉండాలి. ఈ నేపథ్యంలోనే ఇలా తీసుకొస్తున్న డ్రోన్లను స్మగ్లర్లు.. లైసెన్స్‌ లేని వారికి విక్రయిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీనివల్ల కొన్ని సందర్భాల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరిస్తున్నారు. ఇలా డ్రోన్ల దిగుమతులపై ఆంక్షలతోనే సమాంతర బ్లాక్‌ మార్కెట్‌ విస్తరిస్తోందని అభిప్రాయపడుతున్నారు. ఇటీవల స్మగ్లింగ్‌ అవుతున్న డ్రోన్లలో ఎక్కువ భాగం చైనాలో తయారైన డీజేఐ మోడళ్లే ఉంటున్నాయి. ఇదే అత్యంత ఆందోళన కలిగించే అంశమని అధికారులు పేర్కొంటున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement