వర్షాభావం ఉన్న అత్యంత సున్నిత ప్రాంతాల గుర్తింపు
23 జిల్లాల్లో లోటు వర్షపాతం... అందులో 39 మండలాల్లో తీవ్ర వర్షాభావం
వానాకాలంలో సాగు విస్తీర్ణం పడిపోయే ప్రమాదం
వరి సాగు సగానికి పైగా తగ్గే అవకాశం
32 లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల కార్యాచరణ
గ్రామం వారీగా ప్రత్యేక పర్యవేక్షణకు సర్కారు సిద్ధం
పలు పంటలకు ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వాలని ఆలోచన
రైతు వేదికల ద్వారా ప్రత్యామ్నాయ పంటల విత్తనాల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావం తెలంగాణలో మరింత తీవ్రమయ్యే సంకేతాల నేపథ్యంలో అత్యంత ప్రభావానికి గురయ్యే 892 గ్రామాలను ప్రభుత్వం గుర్తించింది. ఈ గ్రామాల్లో వర్షాభావం, భూగర్భ జలాల క్షీణత, సాగునీటి కొరత, పంటల నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. గ్రామ స్థాయిలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించడం, నీటి లభ్యతపై నిరంతర సమాచారం అందించడం, విత్తనాల సరఫరా, సూక్ష్మ సేద్యం, పంటల యాజమాన్యంపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. మిగతా 261 మండలాల్లో సాధారణ స్థాయిలోనే వర్షపాతం ఉంటుందని లెక్కలు వేసింది.
23 జిల్లాల్లో వర్షాభావం.. 360 మండలాల్లో లోటు
రాష్ట్రంలోని 23 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. మొత్తం 621 మండలాల్లో 360 మండలాలు వర్షాభావ పరిస్థితుల్లో ఉండగా, 39 మండలాల్లో తీవ్ర వర్షాభావం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా సాధారణంతో పోలిస్తే 24 శాతం వర్షపాతం లోటు నమోదైంది. మేడ్చల్–మల్కాజిగిరి, హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, యాదాద్రి భువనగిరి, జనగామ, కరీంనగర్ జిల్లాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది.ఎల్‌నినో ప్రభావంతో ఈ వానాకాలంలో మొత్తం సాగు విస్తీర్ణం 1.39 కోట్ల ఎకరాల నుంచి 1.07 కోట్ల ఎకరాలకు పడిపోతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
అంటే 23.12 శాతం తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉంది. అత్యధిక ప్రభావం వరిపైనే పడనుంది. గత ఏడాది 69.89 లక్షల ఎకరాల్లో సాగైన వరి ఈసారి 38.51 లక్షల ఎకరాలకు పరిమితం కావచ్చని అంచనా వేశారు. అంటే దాదాపు 31.38 లక్షల ఎకరాలు తగ్గనున్నాయి. వరి తగ్గే ప్రాంతాల్లో రైతులను ఇతర పంటల వైపు మళ్లించేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందించింది. మొత్తం 32.20 లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఖమ్మంలోనే అత్యధిక ప్రభావిత గ్రామాలు
రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 892 గ్రామాల్లో అత్యధికంగా ఖ మ్మం జిల్లాలో 189 గ్రామాలు ఉన్నాయి. ఆ తర్వాత కుము రం భీం–ఆసిఫాబాద్ జిల్లాలో 151, వనపర్తిలో 89, మహ బూబాబాద్‌లో 72, జనగామలో 72, హనుమకొండలో 69 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో వర్షపాతం, భూగర్భ జలాలు, పంటల పరిస్థితిపై ప్రతిరోజూ పర్యవేక్షణ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైన చోట ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను వెంటనే మళ్లించాలని అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు.
ఇతర పంటల సాగు లక్ష్యం..
వరికి బదులు మొక్కజొన్న 9.23 లక్షల ఎకరాలు, కంది 8.69 లక్షల ఎకరాలు, కూరగాయలు 1.16 లక్షల ఎకరాలలో సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకొంది. మినుము, పెసర, జొన్న, చిరుధాన్యాలను మరింత విస్తరించాలని నిర్ణయించింది. అలాగే పొద్దుతిరుగుడు, ఆముదం, నూనెగింజల పంటలు, ఉద్యాన పంటలకు ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వాలని కూడా భావిస్తోంది. నీటి అవసరం తక్కువగా ఉండే పంటల వైపు రైతులను మళ్లించేందుకు జిల్లా వారీ లక్ష్యాలను కూడా నిర్ణయించారు.
విత్తనాలు.. డ్రిప్.. గ్రామాల్లోనే పంపిణీ
ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాలను తెలంగాణ స్టేట్ సీడ్స్, జాతీయ విత్తన సంస్థ, ప్రైవేటు సంస్థల ద్వారా సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైతే రైతు వేదికలను విత్తనాల పంపిణీ కేంద్రాలుగా వినియోగించనుంది. సూక్ష్మ సేద్యాన్ని విస్తరించేందుకు డ్రిప్, స్ప్రింక్లర్ల సరఫరా, సబ్సిడీలు, రుణాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.
అత్యంత ప్రమాద గ్రామాల్లో గ్రామస్థాయి అధికారుల ద్వారా రైతులకు వాతావరణ హెచ్చరికలు, నీటి లభ్యత, పంటల యాజమాన్యంపై ప్రతిరోజూ సమాచారం అందించనున్నారు. భూగర్భ జలాల పర్యవేక్షణ, వర్షపు నీటి సంరక్షణ, చెరువుల పూడికతీత, ఫార్మ్‌పాండ్లు, చెక్‌డ్యాంల నిర్మాణం, నేల తేమ సంరక్షణ, పశుగ్రాసం, పశువైద్య సేవలు, జిల్లా–మండల స్థాయి కంట్రోల్‌రూముల ఏర్పాటు వంటి చర్యలను అమలు చేయాలని నిర్ణయించారు. వ్యవసాయం, ఉద్యాన, నీటిపారుదల, భూగర్భజలాలు, గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంతో పనిచేయనున్నాయి.


