న్యూఢిల్లీ: నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థుల కోసం నాగాలాండ్‌కు చెందిన ఒక వ్యక్తి చేసిన వినూత్నసహాయం సోషల్ మీడియాలో పలువురి హృదయాలను గెలుచుకుంది. ఏకంగా 150 పిజాలు ఆర్డర్ చేసి, ఆకలిగా ఉన్నవారికి ఇవ్వండి అంటూ మానవత్వాన్ని చాటుకున్న వైనంగా విశేషంగా నిలుస్తోంది.
నాగాలాండ్‌కు చెందిన 'ఝా-లౌ' (Zha-Lhou) అనే వ్యక్తి సుమారు 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఊరి నుంచే డొమినోస్ యాప్ ద్వారా 150 "చీజ్ బర్స్ట్" (Cheese Burst) పిజాలను ఆర్డర్ చేసి నేరుగా జంతర్ మంతర్‌కే డెలివరీ చేయించారు. జులై 22న కొరియన్ స్వీట్ చిల్లీ, ఫార్మ్‌హౌస్ రకాలకు చెందిన పిజాలకు మొత్తం బిల్లు రూ. 67,734.18 అయింది. మరో రూ. 5,000 విలువైన బిస్కెట్లను కూడా ఆర్డర్ చేశారు.
పిజాలు డెలివరీ చేయడానికి వచ్చిన డెలివరీ బాయ్ ఈ ఆర్డర్ ఎవరికి ఇవ్వాలి? అని ఫోన్ చేసి అడగ్గా, అక్కడ ఇంకా ఆహారం తినకుండా ఆకలితో ఉన్న విద్యార్థులు ఎవరైనా సరే, వారికి ఇచ్చేయండి అని ఝా-లౌ చెప్పారు.
అంతేకాదు ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించడం వైరల్‌గా మారింది. "నేను నాగాలాండ్‌లో ఉన్నాను, వేలాది మంది విద్యార్థులు మంచి భవిష్యత్తు, న్యాయమైన విద్యా వ్యవస్థ కోసం జంతర్ మంతర్ వద్ద పోరాడుతున్నారు. ప్రత్యక్షంగా అక్కడ ఉండలేకపోయాను, కాబట్టి నా వంతుగా నేను చేయగలిగిన చిన్న సహాయం ఇది" అని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ (@adiespoems) ఖాతాలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించేదాకా, చర్చల ప్రసక్తే లేదు : రాహుల్ గాంధీ
అంతేకాకుండా, ప్రశంసల కోసం తాను ఈ పోస్ట్ పెట్టలేదని, ఇతరులకు కూడా తమకు తోచిన రీతిలో సహాయం చేసేందుకు ప్రేరణగా ఉంటుందని మాత్రమే షేర్ చేశానని తెలిపారు. ఆ తర్వాత విద్యార్థుల కోసం మరో రూ. 5,000 విలువైన బిస్కెట్లను కూడా ఆర్డర్ చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి: ఐఫోన్ రాలేదు, ఆయిల్ వచ్చింది.. కట్ చేస్తే రూ. 1.81 లక్ష


