ఓవైపు చర్చలు.. మరోవైపు పార్లమెంట్‌ స్ట్రీట్‌లో హైటెన్షన్‌ | CJP Protest: Agitators Stand Firm as Centre Pushes for Talks | Sakshi
Sakshi News home page

ఓవైపు చర్చలు.. మరోవైపు పార్లమెంట్‌ స్ట్రీట్‌లో హైటెన్షన్‌

Jul 24 2026 1:24 PM | Updated on Jul 24 2026 1:48 PM

CJP Protest: Agitators Stand Firm as Centre Pushes for Talks

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని పార్లమెంట్‌ స్ట్రీట్‌ మరోసారి ఉద్రిక్తంగా మారింది. కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా.. తమ ప్రధాన డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన విరమించేది లేదని శుక్రవారం సీజేపీ చెబుతోంది. 

నిరసనకారులపై కేసులు తప్పవని, జాతీయ భద్రతా చట్టం (NSA) ప్రయోగిస్తామని, పాస్‌పోర్టులు సీజ్‌ చేస్తామని.. అఖరికి అరెస్టులు చేస్తామని హెచ్చరికలు వచ్చినప్పటికీ.. ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. విద్యా వ్యవస్థలో మార్పులు, తమపై జరిగిన పోలీసుల చర్యలపై బాధ్యులపై చర్యలు, ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ తరుణంలో కేంద్రంతో సీజేపీ ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది.

కేంద్రం ప్రయత్నాలు
మరోవైపు ఆందోళనను ముగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. సీజేపీ ప్రతినిధులతో ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియాలో రెండో దఫా చర్చలు జరుగుతున్నాయి. సీజేపీ తరఫున ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు.. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లు భేటీ అయ్యారు. ఎలాగైనా ఆందోళనలు విరమింపజేయాలని వాళ్లు ప్రయత్నిస్తున్నారు. అయితే సీజేపీ మాత్రం తమ ప్రధాన డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఈ విషయాన్ని ప్రతినిధులు చర్చలకు వెళ్లే ముందు మీడియాకు స్పష్టం చేశారు. ‘‘మా డిమాండ్లకు కట్టుబడి ఉన్నాం. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందే. మాపై లాఠీ చార్జి చేసింది పోలీసులు కాదు.. ఆ ముసుగులో ఉన్న గూండాలు. వాళ్లకు శిక్ష పడాల్సిందే. అవసరమైతే ఈ విషయంలో కోర్టుకు వెళ్తాం. మా డిమాండ్లు నెరవేరే దాకా పోరాటం ఆపం’’ అని ఆ ఇద్దరు ప్రకటించారు. దీంతో చర్చలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో అనే ఉత్కంఠ నెలకొంది.

పార్లమెంట్‌ వైపు వెళ్లేందుకు యత్నం.. పోలీసుల అప్రమత్తం
ఇదిలా ఉండగా.. శుక్రవారం మధ్యాహ్నాం జంతర్‌ మంతర్‌ నుంచి కొందరు పార్లమెంట్‌ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పార్లమెంట్‌ స్ట్రీట్‌ ప్రాంతంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. శాంతియుతంగా నిరసన తెలియజేయాలని పోలీసులు ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా బలగాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి.

కేబినెట్‌ భేటీ
అటు చర్చలు.. ఇటు ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ప్రధాని మోదీ నేతృత్వంలో కేబినెట్‌ సమావేశం జరుగుతోంది. పేపర్‌ లీకుల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పిన ప్రధాని మోదీ.. అందుకు అవసరమైన చర్యలకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించారు. విచారణకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ఏర్పాటుతో పాటు కఠిన శిక్షలతో చట్టం అమలయ్యేలా సంస్కరణల రూపకల్పన దిశగా ఈ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం దీనిపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

వాంగ్‌చుక్‌ దీక్ష విరమించినా.. పోరాటం కొనసాగింపు
ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ నిరాహార దీక్షను విరమించిన తర్వాత కూడా ఉద్యమం కొనసాగుతుందని సీజేపీ నేతలు తెలిపారు. వ్యక్తుల దీక్షతో సంబంధం లేకుండా.. తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. కేంద్రంతో చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. ముందుగా ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా ప్రధాన డిమాండ్‌
సీజేపీ తమ ప్రధాన ఎజెండాను స్పష్టం చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తోంది. నీట్‌ సహా పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న వివాదాలు, విద్యార్థుల ఆందోళనలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. మంత్రి రాజీనామా తర్వాతే విద్యా సంస్కరణలు, ఆందోళనకారులపై లాఠీచార్జి చేసిన అధికారులపై చర్యలు వంటి అంశాలపై చర్చిస్తామని సీజేపీ పేర్కొంది.

ఒకవైపు ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని చూస్తుండగా.. మరోవైపు సీజేపీ మాత్రం తమ డిమాండ్ల సాధన వరకు పోరాటం కొనసాగిస్తామని చెబుతోంది. దీంతో పార్లమెంట్‌ స్ట్రీట్‌లో కొనసాగుతున్న ఈ నిరసన దేశవ్యాప్తంగా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్రం–సీజేపీ మధ్య జరగనున్న చర్చల ఫలితంపైనే తదుపరి పరిణామాలు ఆధారపడి ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement