తమిళనాడు: సేలం కొండలాంపట్టి ప్రాంతానికి చెందిన మణికండన్ (39) అనే వ్యక్తి కిరాణా దుకాణం నడుపుతున్నాడు. ఇతను పలువురు మహిళలను రహస్యంగా అశ్లీల వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడనే ఆరోపణలపై గతంలో అరెస్ట్ అయ్యాడు. ఇతని మొబైల్ ఫోన్‌లో సుమారు 8,000 అశ్లీల చిత్రాలు, వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పొల్లాచ్చి తరహాలో సేలంలోనూ ఇలాంటి దారుణం జరిగిందని రాజకీయ పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ కేసును సీబీ–సీఐడీకి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కేసులో అరెస్ట్ అయిన మణికండన్, గత నెల 16వ తేదీన కోర్టు నుండి బెయిల్‌పై విడుదలయ్యాడు. జైలు నుండి బయటకు వచ్చిన కేవలం ఒక వారంలోనే, మంగళం మహిళా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ 27 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు యువతి తన ఫిర్యాదులో, మణికండన్ తనను రహస్యంగా అశ్లీల ఫొటోలు, వీడియోలు తీశాడని, వాటిని చూపించి తనతో లొంగిపోవాలని లేదంటే భర్తకు పంపిస్తానని బెదిరిస్తున్నాడని పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన ఇన్‌స్పెక్టర్ కవిత మణికండన్‌ను అరెస్ట్ చేశారు.


