ఆకాశంలో పైలట్లకు అస్వస్థత | Pilots feel sick in the sky | Sakshi
Sakshi News home page

ఆకాశంలో పైలట్లకు అస్వస్థత

Jul 24 2026 4:35 AM | Updated on Jul 24 2026 4:35 AM

Pilots feel sick in the sky

హైదరాబాద్‌–లండన్‌ బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌  విమానంలో ఘటన 

ప్రధాన పైలట్‌కు ఆక్సిజన్‌ అందని వైనం.. ఫుడ్‌ పాయిజన్‌గా అనుమానం 

శంషాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఈ నెల 20న లండన్‌కు బయలుదేరిన ఓ బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో ముగ్గురు పైలట్లు అనుమానిత ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు 30 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా ప్రధాన పైలట్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని.. ఓ దశలో అతనికి ఆక్సిజన్‌ అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూడా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 

ఈ కథనాల ప్రకారం.. 19న రాత్రి శంషాబాద్‌లో విమానం లేఓవర్‌ ఉండటంతో పైలట్లు  విశ్రాంతి తీసుకొని 20న ఉదయం వారు బస చేసిన హోటల్‌లోని క్లబ్‌ లాంజ్‌లో అల్పాహారం చేశారు. అనంతరం ఓ బయటి కంపెనీ హోటల్‌కు సరఫరా చేసిన వాటర్‌ బాటిళ్లలోని నీటిని తాగారు. అనంతరం ప్రయాణికులను ఎక్కించుకొని శంషాబాద్‌ నుంచి టేకాఫ్‌ అయ్యాక అస్వస్థతకు గురయ్యారు. 

ప్రధాన పైలట్‌ విమానం నడపలేని స్థితికి చేరుకోవడంతో మిగిలిన ఇద్దరు పైలట్లు అస్వస్థతతో బాధపడుతున్నప్పటికీ విమానాన్ని క్షేమంగా లండన్‌లోని హీత్రూ విమానాశ్రయానికి చేర్చారు. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ పేర్కొంది. అయితే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని ప్రముఖ హోటల్‌లో ఆ పైలట్లు బసచేయలేదని అక్కడి అధికారి ‘సాక్షి’కి తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement