క్రీడలు మిమ్మల్ని మార్చేస్తాయ్‌! | Sports will change you | Sakshi
Sakshi News home page

క్రీడలు మిమ్మల్ని మార్చేస్తాయ్‌!

Jul 24 2026 4:51 AM | Updated on Jul 24 2026 4:50 AM

Sports will change you

జీవక్రియ, ఆహారపు అలవాట్లపైనా ప్రభావం 

వెల్లడించిన ఐసీఎమ్‌ఆర్‌–ఎన్‌ఐఎన్‌ అధ్యయనం 

సాక్షి, హైదరాబాద్‌/లాలాపేట: దీర్ఘకాలికంగా తీసుకునే వివిధ రకాల క్రీడా శిక్షణలు మానవ శరీర నిర్మాణం, జీవక్రియ, రక్త ప్రసరణ వ్యవస్థ, ఆహారపు అలవాట్లు, పేగుల్లోని సూక్ష్మజీవుల వ్యవస్థపై విభిన్న ప్రభావాలను చూపుతాయని హైదరాబాద్‌లోని ఐసీఎమ్‌ఆర్‌–జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్తలు నిరూపించారు. ఈ పరిశోధన వివరాలు ఫ్రాంటియర్స్‌ ఇన్‌ న్యూట్రిషన్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. క్రీడాకారుల ఆరోగ్యం, వారి ఆటతీరును మెరుగుపరచడానికి ప్రత్యేక పోషకాహార ప్రణాళికలను రూపొందించడానికి ఈ ఫలితాలు ఎంతో కీలకమైన ఆధారాలను అందిస్తున్నాయి. 

ఇలా పరిశోధన.. 
ఈ శాస్త్రీయ అధ్యయనం కోసం హైదరాబాద్‌లోని వివిధ క్రీడా కేంద్రాల నుంచి 18–35 సంవత్సరాల వయస్సు గల 80 మంది ఆరోగ్యకరమైన పురుషులను ఎంపిక చేశారు. వీరిలో 27 మంది దీర్ఘకాలిక శారీరక శ్రమ చేసే క్రీడాకారులు (మారథాన్‌ రన్నర్లు, సైక్లిస్టులు, ఈతగాళ్లు), 29 మంది కండరాల బలాన్ని పెంచే క్రీడాకారులు (వెయిట్‌లిఫ్టర్లు), అలాగే శారీరక శ్రమ తక్కువగా ఉండే 24 మంది సాధారణ వ్యక్తులు ఉన్నారు. 

ఈ క్రీడాకారులందరూ కనీసం ఐదు సంవత్సరాలుగా క్రమబద్ధమైన శిక్షణ పొందుతూ, వారానికి కనీసం ఐదు సార్లు (కనీసం 8 గంటలు) కఠినమైన శిక్షణలో పాల్గొన్నవారే. అధునాతన ఎక్స్‌–రే స్కాన్‌ పరీక్షలు, జీవక్రియ కొలతలు, రక్త పరీక్షలు, పేగు సూక్ష్మజీవుల విశ్లేషణల ద్వారా వీరి శారీరక ప్రొఫైల్‌ను శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. 

ఎవరి శరీరం ఎలా మారిందంటే
దీర్ఘకాలిక శ్రమ చేసే క్రీడాకారులు: వీరు చాలా సన్నగా ఉంటారు. విశ్రాంతి సమ యంలో వీరిలో కొవ్వు కరిగే ప్రక్రియ ఎక్కువగా జరుగుతుంది. రక్తంలో ఆక్సిజన్‌ రవాణాను మెరుగుపరిచే లక్షణాలు వీరిలో ఎక్కువగా కనిపించాయి. 

శరీర బలాన్ని పెంచే క్రీడాకారులు: వీరిలో కండరాల ద్రవ్యరాశి, ఎముకల ఖనిజ సాంద్రత చాలా ఎక్కువగా ఉన్నాయి. శక్తి ఆధారిత క్రీడల అవసరాలకు అనుగుణంగా వీరిలో విశ్రాంతి జీవక్రియ రేటు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. 

పేగు సూక్ష్మజీవులలో మార్పులు: సాధారణ వ్యక్తులతో పోలిస్తే క్రీడాకారుల పేగుల్లో ప్రోటీన్, కొవ్వు పదార్థాల జీవక్రియకు సహాయపడే మేలు చేసే బ్యాక్టీరియా ఎక్కు వగా ఉన్నట్లు గుర్తించారు. శారీరక శ్రమ లేని వ్యక్తులలో ‘లాక్టోబాసిల్లస్‌’బ్యాక్టీరియా స్థాయిలు ఎక్కువగా కనిపించాయి.

సానుకూల ప్రభావం..
క్రమం తప్పకుండా చేసే దీర్ఘకాలిక శారీరక శ్రమ అనేది శరీర నిర్మాణం, జీవక్రియ, ఎముకల ఆరోగ్యం, పేగు సూక్ష్మజీవులపై ఒకేసారి సానుకూల ప్రభావం చూపుతుందని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ కె.వెంకటేష్‌ తెలిపారు. వివిధ రకాల క్రీడల శారీరక అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక పోషకాహారం, శిక్షణ వ్యూహాలను రూపొందించడం ఎంత ముఖ్యమో ఈ అధ్యయనం స్పష్టం చేస్తోందని జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ భారతి కులకర్ణి పేర్కొన్నారు. ఈ మార్పులను అర్థం చేసుకోవడం ద్వారా క్రీడాకారుల ఆటతీరును మెరుగుపరచడానికి, వారు గాయాల నుంచి త్వరగా కోలుకోవడానికి, వారి దీర్ఘకాలిక ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడానికి సాధ్యమవుతుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement