పోస్టులన్నీ దాదాపుగా పదోన్నతుల ద్వారానే భర్తీ..
టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ తాజా నిర్ణయం.. ఉత్తర్వుల జారీ
డిగ్రీ ప్రిన్సిపల్, గ్రేడ్ –2 ప్రిన్సిపల్ పోస్టులు ఇక 100% పదోన్నతులతోనే భర్తీ
ఇతర పోస్టుల్లోనూ గణనీయంగా డీఆర్ కోటా తగ్గింపు
గురుకుల ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు తీవ్ర నిరాశ
సాక్షి, హైదరాబాద్: గురుకుల ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) భారీ షాక్ ఇచి్చంది. కీలక ఉద్యోగాల భర్తీని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ (డీఆర్–నేరుగా భర్తీ) కేటగిరీ నుంచి తొలగించింది. కేవలం పదోన్నతుల ద్వారానే వీటిని భర్తీ చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా ఇతర పోస్టుల్లోనూ పదోన్నతుల కోటాను భారీగా పెంచేసింది.
ఈ మేరకు గురుకుల ఉద్యోగాల భర్తీ నిబంధనలను సవరిస్తూ టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ తాజాగా స్టాండింగ్ ఆర్డర్స్ జారీ చేసింది. గత నెలలో జరిగిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో ఈ అంశాలపై చర్చించిన సభ్యులు ఆరు రకాల ఉద్యోగ కేటగిరీల్లో డీఆర్ కోటా తగ్గించేలా ఎజెండాలోని 19వ అంశాన్ని ఆమోదించా రు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సొసైటీ తాజాగా విడుదల చేసింది.
డీఆర్ నుంచి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్, గ్రేడ్–2 ప్రిన్సిపల్ తొలగింపు
గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాలు దాదాపు అన్నింటినీ నిర్దేశించిన కోటా మేరకు డీఆర్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) 2018లో ఏర్పాటు కాగా.. అప్పట్లోనే కొన్ని ఉద్యోగ కేటగిరీల్లో డీఆర్ కోటా తగ్గించారు. అది తీవ్ర వివాదాస్పదంగా మారింది. కానీ ఆ తర్వాత ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు వెలువడడంతో అభ్యర్థులు వాటికి సన్నద్ధమయ్యారు. అయితే తాజాగా డీఆర్ కేటగిరీ నుంచి కొన్ని కేటగిరీలను ఎస్సీ గురుకుల సొసైటీ తొలగించింది.
డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ పోస్టులతో పాటు గ్రేడ్–2 ప్రిన్సిపల్ పోస్టులను డీఆర్ నుంచి తప్పించింది. గతంలో డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ పోస్టులను 30 శాతం పదోన్నతులు, 70 శాతం డీఆర్ పద్ధతిలో భర్తీ చేస్తుండగా.. తాజాగా 100 శాతం పదోన్నతుల ద్వారానే భర్తీ చేయనున్నారు. అదేవిధంగా గ్రేడ్–2 ప్రిన్సిపల్ పోస్టులను 70 శాతం పదోన్నతులు, 30 శాతం డీఆర్ పద్ధతిలో భర్తీ చేస్తుండగా... ఇప్పుడు వీటిని కూడా 100 శాతం పదోన్నతుల ద్వారానే భర్తీ చేయనున్నారు.
మిగతా పోస్టుల భర్తీ ఇలా..
» డిగ్రీ లెక్చరర్ (డీఎల్) పోస్టులను ఇప్పటివరకు 30 శాతం పదోన్నతులు, 70 శాతం డీఆర్ ద్వారా భర్తీ చేస్తుండగా... ఇకపై 70 శాతం పదోన్నతులు, 30 శాతం డీఆర్ ద్వారా భర్తీ చేస్తారు.
» జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టులను ఇప్పటివరకు 50 శాతం పదోన్నతులు, 50 శాతం డీఆర్ ద్వారా భర్తీ చేస్తుండగా... ఇకపై 70 శాతం పదోన్నతులు, 30 శాతం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు.
» పోస్ట్రుగాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ఫిజికల్ డైరెక్టర్ గ్రేడ్–2 పోస్టులు గతంలో 50:50 నిష్పత్తిలో భర్తీ చేస్తుండగా... ఇకపై 70 శాతం ప్రమోషన్లు, 30 శాతం డీఆర్ పద్దతిలో భర్తీ చేస్తారు.
» డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ పోస్టులను డిగ్రీ లెక్చరర్ల సీనియార్టీ జాబితా ఆధారంగా పదోన్నతులు కల్పించి భర్తీ చేస్తారు.
» డిగ్రీ లెక్చరర్ పోస్టులకు జూనియర్ లెక్చరర్ సీనియార్టీ జాబితా ఆధారంగా పదోన్నతులు కల్పిస్తారు. జూనియర్ లెక్చరర్ పోస్టుల్లో పీజీటీ సీనియార్టీ జాబితాను పరిగణించి పదోన్నతి ఇస్తారు. అదేవిధంగా పీజీటీ పోస్టులను టీజీటీ సీనియార్టీ జాబితా ఆధారంగా, ఫిజికల్ డైరెక్టర్ గ్రేడ్–2 పోస్టులను పీఈటీ సీనియార్టీ ఆధారంగా పదోన్నతి కల్పిస్తారు.
అందరూ పాటిస్తే నియామకాల్లో భారీ కోత
సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీలు పలు అంశాలు, నిబంధనల్లో ఎస్సీ గురుకుల సొసైటీని అనుసరిస్తాయి. అత్యధిక విద్యా సంస్థలతో ముందు వరుసలో ఉండి ఎన్నో సంస్కరణలకు కీలకంగా పనిచేసిన ఎస్సీ గురుకుల సొసైటీ.. తాజాగా సర్వీసు నిబంధనల్లో మార్పులు చేసి తీవ్ర గందరగోళానికి గురిచేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇవే నిబంధనలను ఇతర గురుకుల సొసైటీలు అనుసరిస్తే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో ఉద్యోగాల సంఖ్య భారీగా తగ్గిపోతుందని అంటున్నారు. ప్రస్తుతం గురుకుల సొసైటీల్లో దాదాపు 10 వేల ఖాళీలు ఉన్నట్లు అంచనా కాగా, ఎస్సీ గురుకుల సొసైటీ నిబంధనలు ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకుల సొసైటీలు కూడా అన్వయించుకుంటే దాదాపు 6 వేల ఉద్యోగాలు డీఆర్ కేటగిరీ నుంచి తొలగిపోయే అవకాశం ఉన్నట్లు సొసైటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


