ఉన్నత చదువులకోసం విదేశాలకు ఎగిరిపోవడం, వేల డాలర్లు సంపాదిస్తూ అక్కడే సెటిల్ అయిపోవడం సర్వసాధారణం. అలాగే వృద్ధులైన తల్లి దండ్రులను సైతం పట్టించుకోకుండా, వారిని వృద్ధాశ్రమాల్లో చేర్పించడం లాంటి హృదయవిదారకమైన కథనాలను చాలా చదివాం. కానీ విదేశాల్లోని సౌకర్యవంతమైన జీవితం కంటే, తల్లిదండ్రులకు భౌతికంగా దగ్గరగా ఉండటమే ముఖ్యం అని భావించి, కెనడా నుంచి బెంగళూరుకు తిరిగి వచ్చిన కొడుకు గురించి విన్నారా?పదండి వివరాలు తెలుసుకుందాం ఈ కథనంలో.
కెనడాలో ఉన్నత ఉద్యోగాన్ని వీడి, వయోవృద్ధులైన తన తల్లిదండ్రులను చూసుకునేందుకు భారత్‌కు తిరిగి వచ్చేశారు టెకీ రమేష్ ఎన్.ఎన్. ఈయన ప్రస్తుతం బెంగళూరులోని 'కోర్‌సెంట్రిక్' (Corcentric) ఐటీ సంస్థలో ఇంజనీరింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. వేల కిలోమీటర్లు దూరంలో ఉంటూ వీడియో కాల్స్ ద్వారా చూస్తూ కాలం గడపడం కంటే, కుటుంబంతో రోజూ గడిపే క్షణాలు ఎంతో విలువైనవని, కుటుంబంతో గడిపే సమయాన్ని ఎప్పటికీ వాయిదా వేయలేమని ఆయన తన లింక్డ్‌ఇన్ (LinkedIn) పోస్ట్‌లో పంచుకున్నారు. దీంతో ఇది సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది.
విదేశాలలోని సౌకర్యాలు, ఊహించదగిన జీవితం వదులుకోవడం, ఇక్కడి మౌలిక వసతులకు మళ్లీ అలవాటు పడటం కొంత కష్టంగా అనిపించినా, కుటుంబం ఇచ్చే తృప్తి ముందు అవేవీ పెద్ద కష్టంగా అనిపించలేదని రమేష్ చెప్పుకొచ్చారు. అలాగే భారత్‌కు రావడం కెరీర్‌కు ఎటువంటి ఆటంకం కలిగించలేదని, పైగా బెంగళూరులోని టెక్నాలజీ, స్టార్టప్ వాతావరణం, ప్రతిభా వంతులైన నెట్‌వర్క్ తనకు మరింత ఉత్తేజాన్నిచ్చాయని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలి
ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు విశేషంగా స్పందించారు. విదేశాల్లో జీవితం, సంపాదన కాదు, మనం కుటుంబంతో పెంచుకునే అనుబంధాలే నిజమైన విజయానికి నిర్వచనమని నెటిజన్లు వ్యాఖ్యానించారు. మొదటి ఏడాది సర్దుబాటు కావడం కష్టంగా ఉన్నప్పటికీ, ఆ తర్వాత ఇక్కడి జీవితంతో చాలా ప్రశాంతత లభించిందని 2015లో అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన మరొక టెకీ స్పందించడం విశేషం.
ఇదీ చదవండి: ఉద్యోగిని పెర్‌ఫామెన్స్ బాలేదని పెయిడ్ లీవ్ : కంపెనీకి భారీ క్రేజ్
10 వేల మెట్లు, నలుగురు మనుషులు : భారీ కాయుడి డోలీ వీడియో వైరల్


