నీట్ మంటలు.. కేంద్రానికి రాహుల్ గాంధీ ఐదు డిమాండ్ల అస్త్రం | Rahul Gandhi Detained During NEET Protest, Raises Five Key Demands Before Centre, Watch Video Inside | Sakshi
Sakshi News home page

నీట్ మంటలు.. కేంద్రానికి రాహుల్ గాంధీ ఐదు డిమాండ్ల అస్త్రం

Jul 22 2026 9:08 AM | Updated on Jul 22 2026 10:10 AM

NEET Effect Rahul Gandhi Five Demands To The Centre

నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం, విద్యార్థులపై పోలీసుల చర్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ఢిల్లీలో భారీ నిరసన చేపట్టింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికార నివాసం లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి అదుపు తప్పకుండా ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వివిధ ప్రాంతాలకు తరలించారు. అనంతరం మంగళవారం రాత్రి వారిని విడుదల చేశారు.

రాహుల్ గాంధీని ఛత్రసాల్ స్టేడియానికి తరలించగా, ప్రియాంక గాంధీని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ప్రియాంకను పరామర్శించేందుకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో రాహుల్, ప్రియాంకతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలను పోలీసులు విడుదల చేశారు. ఈ సందర్బంగా నిర్బంధంలో ఉన్న సమయంలో రాహుల్ గాంధీ వీడియో సందేశం విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ముందు ఐదు కీలక డిమాండ్లు ఉంచారు.

కీలక డిమాండ్లు..
👉కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, 
👉విద్యార్థులపై లాఠీచార్జి చేసిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, 
👉విద్యార్థులపై నమోదైన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 
👉అలాగే విద్యార్థులపై జరిగిన చర్యలకు ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి క్షమాపణ చెప్పాలని, 
👉నీట్ పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్‌లో తక్షణమే చర్చ నిర్వహించాలని, 
👉దేశ విద్యా వ్యవస్థతో పాటు పోటీ పరీక్షల నిర్వహణలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని కోరారు.

దేశ విద్యా వ్యవస్థపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ..‘భారత్‌లో విద్యా వ్యవస్థ ఎందుకు కుప్పకూలుతోంది? ప్రశ్నపత్రాలు ఎందుకు వరుసగా లీకవుతున్నాయి? విద్య ఎందుకు అంత ఖరీదుగా మారింది? పిల్లలను చదివించడానికి కుటుంబాలు ఎందుకు అప్పుల పాలవుతున్నాయి? ఇవి లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు అడుగుతున్న సహజమైన ప్రశ్నలు. ఈ ప్రశ్నలు అడగడంలో ఎలాంటి తప్పు లేదు’ అని వ్యాఖ్యానించారు. బుధవారం లోక్‌సభ, రాజ్యసభల్లో ఈ అంశంపై సమగ్ర చర్చ జరగాలని ప్రతిపక్ష పార్టీలన్నీ కోరుతున్నాయని తెలిపారు. విద్యార్థుల కోసం పోరాడుతున్న ప్రతీ ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

మరోవైపు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని స్పష్టంగా తెలిపినా, కాంగ్రెస్ విద్యార్థుల సమస్యలకు పరిష్కారం వెతకడం కంటే రాజకీయ ప్రదర్శనకే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తు కంటే రాజకీయ లబ్ధే రాహుల్ గాంధీ లక్ష్యంగా కనిపిస్తోందని ఆయన 'ఎక్స్'లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement