తగ్గేదే లేదు.. కేంద్రానికి CJP అల్టిమేటం | Delhi Jantar Mantar CJP Day 3 Protests Live Updates, Latest News Headlines And Breaking Developments | Sakshi
Sakshi News home page

తగ్గేదే లేదు.. కేంద్రానికి CJP అల్టిమేటం

Jul 22 2026 9:21 AM | Updated on Jul 22 2026 2:45 PM

Delhi Jantar Mantar CJP Day 3 Protests Live Updates

నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంపై కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనలు ఢిల్లీలో ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. సోమవారం పార్లమెంట్‌ ముట్టడి సమయంలో, అలాగే మంగళవారం చోటుచేసుకున్న ఘర్షణల అనంతరం పోలీసులు జంతర్‌ మంతర్‌ వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు, వేదికను తొలగించారు. అయితే బుధవారం ఉదయం నుంచి నిరసనకారులు మళ్లీ అక్కడకు చేరుకుని ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు భారీగా పోలీసులు, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ బలగాలను మోహరించారు.

లేటెస్ట్‌ అప్‌డేట్స్‌:

ఢిల్లీ జంతర్‌మంతర్‌ దగ్గర హైటెన్షన్‌

  • భారీగా తరలివస్తున్న యువత
  • పార్లమెంట్‌ వైపు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
     

అభిజీత్‌ దీప్కే కీలక వ్యాఖ్యలు

  • ప్రభుత్వం చర్చలకు రావాలంటే తమ వద్దకే రావాలని CJP వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే స్పష్టం చేశారు.
  • ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధమేనని, కానీ తమ షరతులను అంగీకరించాలని తెలిపారు.
  • ప్రభుత్వ అహంకారం తగ్గాలని డిమాండ్‌ చేశారు.
  • NEET పేపర్‌ లీక్‌ ఆరోపణలపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌పై వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.
  • చర్చలు తటస్థ ప్రదేశంలో లేదంటే జంతర్‌ మంతర్‌లో జరగొచ్చని CJP ప్రతినిధి ఆశుతోష్‌ రంకా తెలిపారు.
  • ప్రభుత్వం తమతో చర్చలు జరుపుతూనే మరోవైపు విద్యార్థులపై పోలీసు చర్యలకు దిగిందని CJP ఆరోపించింది.
  • తమ ప్రతినిధులను జేపీ నడ్డా నివాసంలో గంటల తరబడి కూర్చోబెట్టి సమయం వృథా చేశారని అభిజీత్‌ దీప్కే ఆరోపించారు.
  • చర్చలకు పిలిచి మరోవైపు లాఠీఛార్జ్‌, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారని విమర్శించారు.
  • జూలై 20 పార్లమెంట్‌ మార్చ్‌ సందర్భంగా పోలీసులు బలప్రయోగం చేశారని CJP ఆరోపించింది.
  • మరోవైపు, నిరసనకారులు చట్టాన్ని ఉల్లంఘించడంతోనే చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు.
  • NEET అంశంపై CJP–ప్రభుత్వం మధ్య రెండో విడత చర్చలు కొనసాగుతున్నాయి.

నాలుగు నినాదాలే చేద్దాం: సీజేపీ 

  • జంతర్‌ మంతర్‌లో CJP ప్రతినిధి ఆశుతోష్‌ రంకా కీలక వ్యాఖ్యలు.
  • ఆందోళనల్లో నాలుగు నినాదాలకే పరిమితం కావాలని పిలుపు.
  • ‘‘భారత్‌ మాతా కీ జై, ఇంక్విలాబ్‌ జిందాబాద్‌, జై భీమ్‌, ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలి’’ అంటూ నినాదాలు చేయాలని సూచన.
  • ప్రతికూల నినాదాలతో ఉద్యమంపై తప్పుడు కథనం సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణ.
  • ఎలాంటి నెగెటివ్‌ స్లోగన్స్‌ను సహించబోమని స్పష్టం చేశారు.

స్పీకర్‌ను కలిసిన ధర్మేంద్ర ప్రధాన్‌

  • NEET అంశంపై పార్లమెంట్‌లో చర్చకు ప్రతిపక్షాల ఒత్తిడి
  • ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని ఉభయ సభల్లో డిమాండ్‌
  • రాజీనామాకు పట్టుబడుతున్న కాక్రోచ్‌ జనతా పార్టీ.. విపక్షాలు
  • ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం
  • లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 
  • భేటీపై సర్వత్రా ఉత్కంఠ

CJP నిరసనలు.. తాజా పరిణామాలు

  • విద్యార్థుల ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని DMK ఎంపీ తిరుచ్చి శివ ఆరోపించారు.
  • NEET వ్యతిరేక నిరసనల్లో విద్యార్థులపై బలప్రయోగం జరిగిందని విమర్శించారు.
  • సోనమ్‌ వాంగ్‌చుక్‌ నిరాహార దీక్షను 20 రోజులకు పైగా కొనసాగించేందుకు అనుమతించారని గుర్తుచేశారు.
  • ప్రభుత్వానికి మానవతా దృక్పథం లేదని DMK ఎంపీ ఆరోపించారు.
  • విద్యార్థుల పోరాటం ఆగదని, వారు తమ డిమాండ్ల కోసం కొనసాగుతారని వ్యాఖ్యానించారు.
  • ఢిల్లీలో భద్రతా కారణాలతో మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది.
  • రాజీవ్‌ చౌక్‌, ఐటీవో, మండీ హౌస్‌ సహా 16 మెట్రో స్టేషన్లు తదుపరి ఆదేశాల వరకు మూసివేశారు.

జంతర్‌ మంతర్‌ పోలీస్‌ యాక్షన్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

👉 ‘సమయం వృథా చేయొద్దు’
జంతర్‌ మంతర్‌ వద్ద విద్యార్థులపై పోలీసుల దాడి ఆరోపణలపై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. “మా సమయం, మీ సమయం వృథా చేయొద్దు” అని న్యాయవాదికి సూచించింది. 

👉 వీడియోలు చూడబోమన్న సీజేఐ
పోలీసుల చర్యకు సంబంధించిన వీడియోలను పరిశీలించాలని కోరగా.. “మేము ఎలాంటి వీడియోలు చూడాలనుకోవడం లేదు” అని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ తెలిపారు.

👉 పార్లమెంట్‌ మార్చ్‌ సమయంలో ఉద్రిక్తత
నీట్‌ పేపర్‌ లీక్‌పై CJP చేపట్టిన నిరసనల్లో భాగంగా పార్లమెంట్‌ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

👉 లాఠీఛార్జ్‌ చేశారంటూ ఆరోపణలు
విద్యార్థులపై పోలీసులు అధిక బలప్రయోగం చేశారని CJP ఆరోపించింది. పలువురు గాయపడ్డారని తెలిపింది.

👉 ఢిల్లీ హైకోర్టులోనూ పిటిషన్‌
పోలీసుల చర్యపై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.

👉 ‘కోర్టును ఇందులోకి లాగొద్దు’
పిటిషనర్‌కు ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం సూచన చేసింది. కేసును బుధవారం విచారణకు లిస్ట్‌ చేసింది. విచారణ జరగాల్సి ఉంది.

👉 నిరసనలు కొనసాగుతున్నాయి
జంతర్‌ మంతర్‌ వద్ద CJP ఆందోళనలు కొనసాగుతుండగా.. భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

CJP హెచ్చరిక.. ఢిల్లీకి లక్షల మంది వస్తారు

  • NEET పేపర్ లీక్‌ ఆరోపణలపై ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని CJP హెచ్చరిక.
  • జూలై 20న జరిగిన నిరసన కేవలం ‘‘ట్రైలర్‌ మాత్రమే’’ అని CJP జాతీయ అధికార ప్రతినిధి ఆశుతోష్‌ రంకా వ్యాఖ్య.
  • ప్రభుత్వం డిమాండ్లు అంగీకరించకపోతే లక్షలాది మంది ఢిల్లీకి తరలివస్తారని హెచ్చరిక.
  • స్వాతంత్ర్యం తర్వాత దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఉద్యమమని రంకా పేర్కొన్నారు.
  • ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని, లేదంటే భారీ స్థాయిలో నిరసనలు తప్పవని వ్యాఖ్య.
  • జూలై 20 మార్చ్‌ పోలీసుల జోక్యం వరకు శాంతియుతంగానే సాగిందని ఆరోపణ.
  • ఆందోళనకారులను హింసాత్మకులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని విమర్శ.
  • పోలీసులు విద్యార్థులపై బలప్రయోగం చేయడంతోనే ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.
  • 31 రోజులుగా శాంతియుతంగా నిరసనలు కొనసాగుతున్నాయని తెలిపారు.
  • మహాత్మా గాంధీ, బీఆర్‌ అంబేడ్కర్‌ సిద్ధాంతాల ఆధారంగా ఉద్యమం సాగుతోందని చెప్పారు.

CJP–ప్రభుత్వం రెండో దఫా చర్చలు నేడు

  • NEET-UG 2026 పేపర్ లీక్‌ వివాదంపై కొనసాగుతున్న CJP ఆందోళనలు.
  • నేడు మధ్యాహ్నం 12 గంటలకు CJP–కేంద్ర ప్రభుత్వం మధ్య రెండో విడత చర్చలు.
  • జూలై 20న తొలిసారి CJP ప్రతినిధులు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ.
  • ప్రభుత్వానికి మూడు ప్రధాన డిమాండ్లతో వినతిపత్రం సమర్పించిన CJP.
  • కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను ఎలాంటి ఆంక్షలు లేకుండా విడుదల చేయాలని డిమాండ్.
  • విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేదా తొలగింపు కోరిన CJP.
  • NEET పేపర్ లీక్‌తో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్.
  • తొలి చర్చల్లో డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం.

CJP ఆందోళనకు TMC మద్దతు

  • CJP చేపట్టిన నిరసనలకు మద్దతు ప్రకటించిన TMC ఎంపీ కల్యాణ్ బెనర్జీ.
  • విద్యార్థుల ఆందోళనపై కేంద్ర ప్రభుత్వ స్పందన దురదృష్టకరమని వ్యాఖ్య.
  • ‘‘విద్యార్థుల మాట వినకపోతే ఇంకెవరి మాట వింటారు?’’ అని ప్రశ్న.
  • ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిపై విమర్శలు చేసిన బెనర్జీ.
  • పార్లమెంట్‌ వెలుపల మీడియాతో మాట్లాడుతూ తన అభిప్రాయం వెల్లడించారు.
  • నిరసనల్లో భద్రతా సిబ్బంది, జర్నలిస్టులపై దాడుల ఆరోపణలపై ప్రశ్నించగా అసహనం వ్యక్తం చేశారు.

జంతర్‌ మంతర్‌ పోలీస్‌ చర్యలపై ఢిల్లీ హైకోర్టులో విచారణ

  • జంతర్‌ మంతర్‌లో విద్యార్థులు, ఆందోళనకారులపై పోలీసుల చర్యను సవాల్‌ చేస్తూ పిటిషన్‌.
  • ఈ పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది.
  • జూలై 18న సోనమ్‌ వాంగ్‌చుక్‌ను నిరసన స్థలం నుంచి తరలించిన ఘటనపై అభ్యంతరం.
  • పోలీస్‌ ఆపరేషన్‌పై స్వతంత్ర దర్యాప్తు చేయాలని పిటిషన్‌లో విజ్ఞప్తి.
  • ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, బాడీ కెమెరా రికార్డులు భద్రపరచాలని కోరారు.
  • శాంతియుత నిరసన హక్కును కాపాడేందుకు మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి.
  • భవిష్యత్‌లో నిరసనకారులపై విచక్షణారహిత పోలీస్‌ చర్యలను అడ్డుకోవాలని కోర్టును కోరారు.

CJP నిరసనలు.. 10 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు

  • ఢిల్లీలో CJP నిరసనలకు సంబంధించి మొత్తం 10 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
  • న్యూఢిల్లీ పరిధిలోని పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదు కాగా.. పార్లమెంట్‌ స్ట్రీట్‌ పీఎస్‌లో 4, కన్నాట్‌ ప్లేస్‌లో 3 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.
  • మండీర్‌ మార్గ్‌, బరాఖంబా రోడ్‌, కర్తవ్య పథ్‌ పోలీస్‌ స్టేషన్లలో ఒక్కొక్క కేసు నమోదు చేశారు.
  • నిరసనల సమయంలో హింస, రాళ్ల దాడి, విధ్వంసం, పోలీసుల విధులకు ఆటంకం వంటి అంశాలపై కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.
  • అనుమతి లేకుండా డ్రోన్‌ ఎగురవేయడం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, పోలీసులపై దాడి అంశాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
  • హింస ముందస్తు ప్రణాళికలో భాగమా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
  • ఘటనలకు సంబంధించిన 250కిపైగా వీడియోలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

👉 పార్లమెంట్‌లో చర్చకు సిద్ధం: కేంద్రం
నీట్‌ పేపర్‌ లీక్‌ అంశంపై పార్లమెంట్‌లో విస్తృత చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. విద్యార్థులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశాయి.

👉 ‘ఘోర పాపం’ అన్న ప్రధాని మోదీ
నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. యువత భవిష్యత్‌తో ఆడుకోవడం ‘ఘోర పాపం’ అని వ్యాఖ్యానించినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

👉ఆయన రాజీనామా చేయాల్సిందే!
నీట్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామా చేయాల్సిందేనని కాక్రోచ్‌లు పట్టుబడుతున్నాయి. ఆ తర్వాతే ఆందోళనలను విరమిస్తామని సీజేపీ ప్రతినిధులు తేల్చి చెబుతున్నారు. అయితే.. ఈ విషయంలో కేంద్రం నుంచి సానుకూల సంకేతాలేవీ కనిపించడం లేదు. తొలిరోజు నిరసనల సందర్భంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసిన నిరసనకారుల ప్రతినిధులు డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించినప్పటికీ.. ఇప్పటిదాకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పైగా తప్పు చేసినవాళ్లను జైల్లో పెట్టామని ప్రధాని మోదీ అంటుండగా.. చర్చలకు ప్రభుత్వం సిద్ధమంటూ ధర్మేంద్ర ప్రదాన్‌ విపక్షాలకు స్పష్టం చేశారు. 

👉జంతర్‌ మంతర్‌లో మళ్లీ భారీగా చేరిన నిరసనకారులు
వర్షం కురుస్తున్నప్పటికీ CJP కార్యకర్తలు జంతర్‌ మంతర్‌లో నిరసనలు కొనసాగిస్తున్నారు. మంగళవారంతో పోలిస్తే బుధవారం ఉదయం ఆందోళనకారుల సంఖ్య పెరిగినట్లు సమాచారం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను కొనసాగిస్తున్నారు.

👉 CJP నేత వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అంటూ ఆరోపణ
CJP ప్రతినిధి సౌరవ్‌ దాస్‌ తన వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందని ఆరోపించారు. తమ నిరసనల నేపథ్యంలోనే డిజిటల్‌ ఆంక్షలు విధిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటికే తమ సంస్థకు చెందిన పలు సోషల్‌ మీడియా ఖాతాలు, వ్యవస్థాపకుడికి సంబంధించిన ఖాతాలు బ్లాక్‌ లేదా సస్పెండ్‌ అయ్యాయని CJP ఆరోపిస్తోంది.

👉 పోలీసులపై రాళ్ల దాడి.. కేసు నమోదు
మంగళవారం రాత్రి ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌ ప్రాంతంలో పోలీసులు, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ సిబ్బందిపై రాళ్ల దాడి జరిగిన ఘటనపై కేసు నమోదైంది. గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

👉 RAF వాహనంపై దాడి
కన్నాట్‌ ప్లేస్‌లో గుంపును చెదరగొట్టే క్రమంలో ఆందోళనకారులు రాళ్లు రువ్వినట్లు పోలీసులు తెలిపారు. RAF‌కు చెందిన వజ్ర వాహనాన్ని లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు సంయమనం పాటించారని అధికారులు తెలిపారు.

👉 రాహుల్‌ గాంధీ నిరసన.. ప్రధాని నివాసం వద్ద ఉద్రిక్తత
జంతర్‌ మంతర్‌ ఆందోళనకు దూరంగా ఉన్నారంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. కాంగ్రెస్‌ ఎంపీలతో కలిసి రాహుల్‌ గాంధీ ప్రధాని నివాసం వైపు నిరసనకు వెళ్లారు. పోలీసులు అడ్డుకుని రాహుల్‌ గాంధీతో పాటు పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత వారిని విడుదల చేశారు.

👉భద్రత కట్టుదిట్టం
జంతర్‌ మంతర్‌, పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను మరింత పెంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement