చర్చల్లో ట్విస్ట్‌! కేంద్రానికి CJP కొత్త కండిషన్‌ | Nadda Must Come to Jantar Mantar: CJP Sets Conditions for Talks with Centre | Sakshi
Sakshi News home page

చర్చల్లో ట్విస్ట్‌! కేంద్రానికి CJP కొత్త కండిషన్‌

Jul 22 2026 1:32 PM | Updated on Jul 22 2026 1:40 PM

Nadda Must Come to Jantar Mantar: CJP Sets Conditions for Talks with Centre

న్యూఢిల్లీ: నీట్‌ ఆందోళనల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్రంతో చర్చలకు తాము సిద్ధమేనని చెబుతూనే.. కాక్రోచ్‌ జనతా పార్టీ కొత్త కండిషన్‌ పెట్టింది. తాము వాళ్ల దగ్గరకు వెళ్లబోమని.. చర్చలకు ప్రభుత్వమే ముందుకు రావాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే స్పష్టం చేశారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా జంతర్‌ మంతర్‌కు వచ్చి చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు.

“ప్రభుత్వం చర్చలు జరపాలనుకుంటే మా వద్దకే రావాలి. మా షరతులకు అంగీకరించాలి” అని అభిజీత్‌ దీప్కే పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలని, అహంకారాన్ని పక్కన పెట్టాలని డిమాండ్‌ చేశారు. నీట్‌ పేపర్‌ లీక్‌ ఆరోపణలపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని CJP తేల్చిచెప్పింది. తమ ప్రధాన డిమాండ్‌ నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపింది.

జంతర్‌ మంతర్‌లోనే, లేకుంటే..
సీజేపీ ప్రతినిధి ఆశుతోష్‌ రంకా మాట్లాడుతూ.. చర్చలు జరపాలంటే తటస్థ ప్రదేశంలో లేదా జంతర్‌ మంతర్‌లోనే నిర్వహించాలని అన్నారు. తమ డిమాండ్ల విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. ఇటీవల కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో జరిగిన చర్చలపై కూడా సీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ ప్రతినిధులను నడ్డా నివాసంలో గంటల తరబడి కూర్చోబెట్టి సమయం వృథా చేశారని అభిజీత్‌ దీప్కే ఆరోపించారు.

చర్చలకు సిద్ధమన్న కేంద్రం
మరోవైపు, నిరసనకారులు చర్చలకు వస్తే ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. అయితే చర్చల విషయంలో బాధ్యతను ప్రభుత్వం నిరసనకారులపైనే ఉంచినట్లు తెలుస్తోంది.

జూలై 20న CJP చేపట్టిన పార్లమెంట్‌ మార్చ్‌ సందర్భంగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పోలీసులు బలప్రయోగం చేశారని CJP ఆరోపించగా.. నిబంధనలు ఉల్లంఘించడంతోనే చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆ సమయంలోనే జేపీ నడ్డాను కలిసిన సీజేపీ ప్రతినిధులు.. మూడు డిమాండ్లతో వినతి పత్రం సమర్పించారు. వాటిని పరిశీలించి నిర్ణయం తెలియజేస్తామని చెప్పిన కేంద్రం.. ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో సీజేపీ–కేంద్ర ప్రభుత్వం మధ్య రెండో దఫా చర్చల అంశం కీలకంగా మారింది. ఎవరు ముందడుగు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement