ఆందోళనలు కాదు.. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇలా చేయండి: రాజ్‌నాథ్‌ | Rajnath Singh slams manufactured anger amid NEET protests | Sakshi
Sakshi News home page

ఆందోళనలు కాదు.. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇలా చేయండి: రాజ్‌నాథ్‌

Jul 22 2026 4:05 PM | Updated on Jul 22 2026 5:09 PM

 Rajnath Singh slams manufactured anger amid NEET protests

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం దేశ యువతను "రాజకీయ సాధనంగా" వాడుకుంటున్నాయని ఆరోపించారు.

ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సహా పలు సంఘాలు చేపట్టిన నిరసనలపై రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ.. "ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మన దేశ విద్యార్థులు, యువతను రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ సాధనంగా వాడాలని కొందరు ప్రయత్నించడం అత్యంత దురదృష్టకరం. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో మా ప్రభుత్వం విద్యార్థులు, యువత ఆశయాలు నెరవేర్చడానికీ, వారి సంక్షేమానికీ పూర్తి నిబద్ధతతో పని చేస్తోంది" అని అన్నారు.

"మన విద్యార్థుల ప్రతి ఆందోళనను వినడం, పరిష్కరించడం మా బాధ్యత. భారత యువత చైతన్యవంతులు, పరిణతి ఉన్నవారు, వివేకం ఉన్నవారు. ఇలాంటి తప్పుదారి పట్టించే ప్రయత్నాలను వారు అర్థం చేసుకుంటారని, అభివృద్ధి, ప్రగతి, దేశ నిర్మాణం దిశగా అడుగులు వేస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది" అని తెలిపారు.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని ఇండి కూటమి సృష్టించిన రాజకీయ పరిస్థితిగా రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు. "ఎవరికీ అన్యాయం జరగకుండా చూడటానికి, ముఖ్యంగా విద్యార్థులు, యువతకు న్యాయం జరిగేలా చూడటానికి మేము పూర్తి నిబద్ధతతో ఉన్నాం. కొందరు ప్రతిపక్ష నేతలు విద్యార్థుల్లో కృత్రిమంగా సృష్టిస్తున్న ఆగ్రహం, అసంతృప్తి ప్రజలను, ముఖ్యంగా పిల్లలు, యువతను తప్పుదారి పట్టించే విఫల ప్రయత్నం అని నేను భావిస్తున్నాను. యువత భావోద్వేగాలు, ఆందోళనల పట్ల మేము పూర్తి సున్నితత్వంతో ఉన్నాం. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతి అంశంపై అర్థవంతమైన చర్చకు ప్రభుత్వం సిద్ధమని పలుసార్లు స్పష్టం చేసింది" అని చెప్పారు.

పార్లమెంట్‌లో ప్రభుత్వ దృష్టికి తీసుకురండి  
వీధుల్లో ఆందోళనలు చేయడం కంటే పార్లమెంట్‌లో చర్చలో పాల్గొనడం మంచిందని ప్రతిపక్షాలకు సూచించారు. "ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశాలు చర్చించాల్సిన స్థలం పార్లమెంట్. అక్కడ ప్రతిపక్షాలకు తమ అభిప్రాయాలు వెల్లడించే పూర్తి స్వేచ్ఛ ఉంది. సమస్యలను పార్లమెంట్‌లో కాకుండా వీధుల్లో పరిష్కరించాలని ప్రతిపక్షాలు ప్రయత్నించడం సరైంది కాదని నేను భావిస్తున్నాను" అని అన్నారు.

ప్రతిపక్షాలు సభ సజావుగా జరిగేలా సహకరించాలని రాజ్‌నాథ్‌ సింగ్‌ కోరారు. "ప్రతిపక్షాలు నిజంగా చిత్తశుద్ధితో ఉంటే, కొనసాగుతున్న వర్షాకాల సమావేశాల నిర్వహణకు ఆటంకం కలిగించకుండా, చర్చించాలనుకున్న అంశాలన్నింటినీ పార్లమెంట్‌లో ప్రస్తావించి సభ, ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి" అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement