ఢిల్లీలో విద్యార్థుల ఉద్యమంపై టీమిండియా స్టార్లు ఇంతవరకు స్పందించలేదు. అయితే, భారత టీ20 జట్టు మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సతీమణి దేవిశా శెట్టి, టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేషన్ మాత్రం సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
దేవిశా, సంజనా వైఖరి పట్ల నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కాగా నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆందోళనలు మరింత ఉధృతం చేసిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేపట్టిన ‘చలో సంసద్’ ర్యాలీ హింసాత్మకంగా మారింది. విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సంజన ఇలా...
ఈ నేపథ్యంలో సంజనా గణేషన్ స్పందిస్తూ.. ‘‘నిరసనకు దూరంగా ఉన్న ఆరేళ్ల పసి ప్రాణానికి టియర్ గ్యాస్ వల్ల ఇబ్బంది కలిగినప్పుడు.. ఎవరికైనా సరే ఇది ఇబ్బందిని కలిగిస్తుంది కదా!..

చిన్నారులు టియర్ గ్యాస్ బారిన పడటాన్ని ప్రజాస్వామ్యంలో సాధారణ విషయంగా మార్చకండి. తమను రక్షించడం కోసమని రక్షణ పేరుతో భయపెట్టడాన్ని ఏ పౌరుడు కూడా కోరుకోడు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. సంజనకు పలువురు నెటిజన్లు మద్దతుగా నిలుస్తూ పోలీసుల వైఖరిని ప్రశ్నిస్తున్నారు.
పోరాటాలు చేయండి అంటూనే...
ఇక దేవిశా శెట్టి మాత్రం మరింత తీవ్రంగా, కాస్త భిన్నంగా స్పందించింది. ‘‘ఇది స్పాన్సర్ చేసిందే అనుకోండి. రాజకీయ ఉద్దేశాలు ఉన్న పోస్టు అనుకోండి. మీరు దీనికి ఏ పేరు పెట్టినా నిజం మాత్రం మారదు. భారతీయ యువత అగ్నిపంథాను ఎంచుకుంది. సవాళ్లకు ఎదురు నిల్చుంది.
పోలీసులు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. పరిస్థితులను చక్కదిద్దాలి. ప్రభుత్వం కూడా వారి సమస్యకు గల కారణం ఏమిటో తెలుసుకునేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వాన్ని విమర్శించండి. ప్రధానిని ప్రశ్నించండి.
రాజకీయాలకు వ్యతిరేకంగా గళమెత్తండి. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమాలు నడపండి. ఓటుతో సమాధానం చెప్పండి. దానినే ప్రజాస్వామ్యం అంటారు. పబ్లిక్ ప్రాపర్టీ అంటే ప్రభుత్వ ఆస్తులు కావు.

ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తారా?
మీరు ధ్వంసం చేసిన ప్రతీ బస్సు, విరగొట్టిన ప్రతీ బారికేడ్, తగలబెట్టిన ప్రతీ వాహనం, మీరు నాశనం చేసిన రోడ్డు.. ఇలా ప్రతీదీ భారత పన్ను చెల్లింపుదారుల నుంచి వచ్చిన డబ్బు ద్వారా నిర్మితమైనవి. ఇందులో మీరు కూడా ఉంటారు.
ఏదేమైనా హింస అనేది ఎప్పుడూ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. మీరు రాళ్లు విసిరినపుడు, పోలీసులపై దాడి చేసినపుడు.. బారికేడ్లను తోసుకుని వెళ్తూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉంటే దీనిని ఎవరూ నిరసన అనరు. మీరు చట్టాన్ని అతిక్రమిస్తున్నారు’’ అని పేర్కొంది. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు దేవిశాను విమర్శిస్తున్నారు.
ఆస్తుల కంటే ప్రాణాలు విలువైనవి కాదా?
‘ఓవైపు విద్యార్థులు ప్రాణాలకు తెగించి న్యాయం కోసం పోరాడుతుంటే.. మీరేమో మీ భర్తను తిరిగి టీమిండియాలోకి చేర్చాలనే ఉద్దేశంతో రాజ్యానికి వంతపాడుతున్నారు. మీరన్నది నిజమే. ప్రభుత్వ ఆస్తుల్ని నష్టపరిచే హక్కు ఎవరికీ లేదు.
మరి ఆస్తుల కంటే ప్రాణాలు మరింత విలువైనవి కదా! పేపర్ లీకేజీ వ్యవహారంతో బలవన్మరణాలకు పాల్పడిన విద్యార్థులకు మద్దతుగా మీరు ఏనాడైనా రాజ్యాన్ని ప్రశ్నించారా? ఇప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మన వరకూ వస్తేనే ఏదైనా అర్థమవుతుంది’ అని విరుచుకుపడుతున్నారు. మరికొందరేమో దేవిశా సరిగ్గా చెప్పిందంటూ సమర్థిస్తున్నారు.


