వైభవ్ సూర్యవంశీ (PC: BCCI X)
వరుస బ్యాటింగ్ వైఫల్యాలపై టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ స్పందించాడు. గత నాలుగు నెలల కాలంలో తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశానన్నాడు. అయితే, క్రికెట్‌లో ఇవన్నీ భాగమేనని.. జట్టు ప్రయోజనాల కోసం తాను ఎల్లప్పుడూ వందశాతం కష్టపడతానని స్పష్టం చేశాడు.
కాగా ఐపీఎల్, భారత్ అండర్-19 జట్టు తరఫున విధ్వంసకర బ్యాటింగ్‌తో దుమ్ములేపిన వైభవ్ సూర్యవంశీ.. పదిహేనేళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తద్వారా అత్యంత పిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన భారత తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.
భారీ అంచనాల నడుమ
ఈ పరిణామాల నేపథ్యంలో భారీ అంచనాల నడుమ ఇంగ్లండ్‌తో రెండో టీ20 సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన వైభవ్.. పూర్తిగా విఫలమయ్యాడు. ఓపెనర్‌గా సంజూ శాంసన్ స్థానాన్ని భర్తీ చేసిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ మూడు మ్యాచ్‌లలో వరుసగా 14, 13 , 15 పరుగులు మాత్రమే చేశాడు.
ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ ఆట తీరుపై విమర్శలు వచ్చాయి. దీంతో ఇంగ్లండ్‌తో ఐదో టీ20లో ఈ బిహారీ పిల్లాడిని తప్పించి.. మళ్లీ సంజూనే ఆడించింది మేనేజ్‌మెంట్. ఇక ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ చేతిలో భారత్ 4-0తో క్లీన్‌స్వీప్ అయింది.
అయితే, జింబాబ్వేతో తాజాగా మరో టీ20 సిరీస్‌ను గురువారం నుంచి మొదలుపెట్టనుంది. ఈ క్రమంలో సంజూ శాంసన్‌ను జట్టు నుంచి తప్పించిన యాజమాన్యం.. అభిషేక్ శర్మకు జోడీగా జింబాబ్వే సిరీస్‌కు వైభవ్‌ను ఎంపిక చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ..
వంద శాతం కష్టపడతాను
‘‘గడిచిన నాలుగు నెలల కాలంలో నేను ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాను. క్రికెట్‌లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అయితే, ఆటను మెరుగుపరచుకునే ప్రక్రియపై మాత్రమే నేను దృష్టి పెట్టాను. జట్టు కోసం వందకు వంద శాతం కష్టపడతాను’’ అని వైభవ్ సూర్యవంశీ తెలిపాడు.
అదే విధంగా.. ‘‘కోచ్‌లు, ఇతర సిబ్బంది నాకు మార్గదర్శనం చేస్తున్నారు. ప్రాక్టీస్ సమయంలో నాకేం కావాలో అన్నీ సమకూరుస్తున్నారు. అంతా బాగుంది. ఈ అనుభూతి గొప్పగా అనిపిస్తోంది. రోజురోజుకీ ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతోంది.
ఈ పిచ్‌లపై నాకు అవగాహన ఉంది
ఇక జింబాబ్వేతో టీ20 సిరీస్ జరిగే హరారే స్పోర్ట్స్ క్లబ్ నా మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇక్కడే నాలుగు నెలల క్రితం అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లో మేము గెలిచాం. అప్పుడు యువ జట్టు తరఫున.. ఇప్పుడు టీమిండియా తరఫున ఇదే గ్రౌండ్‌లో ఆడటం గొప్పగా ఉంది.
ఈ పిచ్‌లపై నాకు అవగాహన ఉంది. కాబట్టి జట్టు గెలుపులో నా వంతు కృషి చేస్తాను’’ అని వైభవ్ సూర్యవంశీ పేర్కొన్నాడు. కాగా అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లో వైభవ్ ఇంగ్లండ్ మీద 80 బంతుల్లోనే 175 పరుగులు సాధించాడు. తద్వారా భారత్ ప్రపంచకప్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు.


