కోహ్లి- రోహిత్ (PC: BCCI X)
వన్డే వరల్డ్‌కప్ విజేత, భారత మాజీ క్రికెటర్ మదన్ లాల్ టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మకు అండగా నిలిచాడు. దమ్ముంటే అతడిని జట్టు నుంచి తప్పించాలంటూ సెలక్టర్లకు సవాల్ విసిరాడు. కాగా రోహిత్ శర్మ భవితవ్యం గురించి గత కొంతకాలంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఇదే చివరి మ్యాచ్ అంటూ..
వన్డే వరల్డ్‌కప్-2027 నాటికి రోహిత్ 40వ వసంతంలో అడుగుపెడతాడు. వయసు రీత్యా ఫిట్‌నెస్ సమస్యల వల్ల అతడు జట్టుకు భారం అవుతాడనే అభిప్రాయాలు వ్యక్తంగా.. పది కిలోలకు పైగా బరువు తగ్గి స్లిమ్, ఫిట్‌గా మారాడు హిట్‌మ్యాన్. అయినప్పటికీ అతడి రిటైర్మెంట్‌పై ఊహాగానాలు ఆగలేదు.
తాజాగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఆదివారం లార్డ్స్ మ్యాచ్ రోహిత్ కెరీర్‌లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ అనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, ఈ మ్యాచ్‌లో శతక్కొట్టి (138) మరీ విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు రోహిత్. అంతేకాదు.. ఆ తర్వాత రిటైర్మెంట్ వార్తలపై స్వయంగా స్పందించాడు.

ఆడినంత కాలం ఇలాగే..
‘నేను అరంగేట్రం చేసినప్పటి నుంచీ ఇలాంటి చర్చలు, విమర్శలు వస్తూనే ఉన్నాయి. నేను ఆడినంత కాలం ఇవి కొనసాగుతూనే ఉంటాయి. అందుకే వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గ్రౌండ్‌లో నేను ఏం చేస్తున్నాననేదే నాకు ముఖ్యం. జట్టు విజయానికి నా వంతు కృషి చేయడంపైనే నా దృష్టి. ఈ చర్చలు సాగనివ్వండి లేకపోతే మజా ఏముంటుంది.
నా పని మైదానం లోపల... వారి పని బయట’ అని రోహిత్ తనదైన శైలిలో స్పందించాడు. ఈ క్రమంలో మదన్ లాల్ సైతం హిట్‌మ్యాన్‌కు మద్దతుగా నిలిచాడు. ‘‘నేడో.. రేపో.. ప్రతీ ఒక్క ఆటగాడు ఏదో ఒకరోజు రిటైర్ అవ్వాల్సిందే. అయితే, రోహిత్ శర్మ ఇప్పుడు అద్భుతంగా ఆడుతున్నాడు. అతడు ఇంకా ఆడాలనుకుంటే ఆడనివ్వండి.
ఒకవేళ దమ్ము, ధైర్యం ఉంటే
సెలక్టర్లకు ఒకవేళ దమ్ము, ధైర్యం ఉంటే అతడిని తప్పించి ముందుకు సాగండి చూద్దాం. ప్రస్తుతం అతడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇలాంటపుడు అతడి విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అంతేగానీ.. అతడి దగ్గరకు వెళ్లి.. ‘నువ్వు మా దీర్ఘకాలిక, వన్డే వరల్డ్‌కప్ ప్రణాళికల్లో గానీ లేవు’ అని అన్నారనుకోండి.
అప్పుడు అతడు.. ‘ఏం.. ఎందుకు మీ ప్లాన్‌లో నేను లేను. నేను పరుగులు రాబడుతున్నా కదా!.. మరి నన్నెలా పక్కనపెడతారు’ అని అడుగుతాడు. అలా అడిగే హక్కు అతడికి ఉంది’’ అని మదన్ లాల్ సెలక్టర్లకు సవాల్ విసిరాడు.
కాగా ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు గుడ్‌బై చెప్పిన రోహిత్ వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. టీమిండియాకు కెప్టెన్‌గా రెండు ఐసీసీ టైటిళ్లు అందించిన ఘనత అతడిది. టీ20 ప్రపంచకప్- 2024, చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియాను విజేతగా నిలిపాడు.


