సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో గల బాండి బీచ్‌లో గత ఏడాది జరిగిన కాల్పుల ఘటనలో ప్రాణాలను లెక్కచేయకుండా 20 మంది ప్రాణాలను కాపాడిన హైదరాబాద్‌కు చెందిన క్యాబ్ డ్రైవర్ రహ్మత్ పాషాకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అరుదైన గుర్తింపును అందించింది. ఆయన సాహసాన్ని గుర్తించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం శాశ్వత నివాస హోదా (పీఆర్) మంజూరు చేసింది. త్వరలోనే ఆయన భార్య, ముగ్గురు పిల్లలు కూడా సిడ్నీకి వెళ్లనున్నారు.
2025 డిసెంబర్‌లో సిడ్నీలోని బాండి బీచ్‌లో జరిగిన ఉగ్రదాడిలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో అక్కడ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న 37 ఏళ్ల రహ్మత్ పాషా తూటాల వర్షాన్ని సైతం లెక్కచేయకుండా క్షతగాత్రులను రక్షించి, అంబులెన్స్‌లకు చేర్చారు. మానవతా దృక్పథంతో బాధితులకు అండగా నిలిచారు. ఈ సాహసానికి గుర్తింపుగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆయనకు పీఆర్ ప్రకటించడమే కాకుండా, ఆ ఘటన రోజు ఆయన ధరించిన టోపీని సిడ్నీ మ్యూజియంలో ప్రదర్శించాలని నిర్ణయించింది.
అంతేకాకుండా పలు సాహస పురస్కారాలకు కూడా ఆయనను నామినేట్ చేసింది. ఉబర్ సంస్థతో పాటు పలువురు ఆయన సేవలను ప్రశంసించారు. అయితే, ఆ ఘటన తాలూకు భయానక దృశ్యాలు తనను ఇంకా వెంటాడుతున్నాయని, తాను తీవ్రమైన మానసిక వేదన ఎదుర్కొంటున్నానని రహ్మత్ పాషా ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే: నవీన్ పట్నాయక్


