breaking news
Bondi Beach Incident
-
అహ్మద్.. అసలైన హీరో
సిడ్నీ: సిడ్నీ బీచ్‌లో అమాయక యూదులపై ఇష్టారీతిగా తుపాకీ గుళ్ల వర్షం కురిపిస్తున్న ఉగ్రవాది సాజిద్‌ను సాహసోపేతంగా నిలువరించిన 43 ఏళ్ల అహ్మద్–అల్–అహ్మద్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ధైర్యసాహసాలతో సాజిద్ చేతుల్లోంచి తుపాకీ లాక్కుని పలువురి ప్రాణాలను అహ్మద్ కాపాడారంటూ అతడిని జనం వేనోళ్ల పొగుడుతున్నారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఒక్క ఉదుటున సాజిద్పైకి దూకిన వైనం వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో అతని ధైర్యసాహసాల గురించే ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు.కాపాడే క్రమంలో కన్నుమూశాడని చెప్పు...దాడి జరిగినప్పుడు ఆదివారం ఉదయం అదే బాండీ బీచ్‌లో అహ్మద్ తన స్నేహితుడితో కలిసి రోడ్డు పక్కన కాఫీ తాగుతున్నాడు. ఉగ్రవాది సాజిద్ అక్కడివారిని పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపుతుంటే అహ్మద్ హతాశుడయ్యాడు. వెంటనే తేరుకుని ఎలాగైనా సాజిద్‌ను అడ్డుకుందామని నిశ్చయించుకున్నాడు. పక్కనే ఉన్న స్నేహితుడితో.. ‘‘ వాడిని అడ్డుకునేందుకు వెళ్తున్నా. ఒకవేళ చనిపోతానేమో. నా కుటుంబాన్ని చూసుకో. అహ్మద్ ఎలా చనిపోయాడని నా వాళ్లు అడిగితే ప్రజల్ని కాపాడేందుకు వెళ్లి ప్రాణాలు అర్పించాడని చెప్పు’’ అని అనేసి వెంటనే రంగంలోకి దూకాడు. కారు చాటుగా దాక్కుంటూ నెమ్మదిగా సాజిద్ వద్దకు చేరుకుని వెంటనే అతడి చేతిలోని పెద్దరైఫిల్ను పెనుగులాట తర్వాత లాక్కున్నాడు. సాజిద్‌కు రైఫిల్‌ను గురిపెట్టి అక్కడి నుంచి దూరంగా వెళ్లేలా చూశాడు. తర్వాత రైఫిల్‌ను కిందపెట్టేశాడు. అయితే దూరంగా ఉండి కాల్చుతున్న సాజిద్ కొడుకు నవీద్ ఇదంతా చూసి అహ్మద్ పైకి కాల్పులు జరపడం మొదలెట్టాడు. దీంతో పక్కన చెట్టుకు పెట్టిన రైఫిల్‌ను మళ్లీ చేతుల్లోకి తీసుకుని ప్రతిదాడి చేయబోయాడు. అయితే అప్పటికే టెలిస్కోపిక్గా సూటిగా కాలుస్తున్న నవీద్ బుల్లెట్ల ధాటికి అహ్మద్ నిలవలేకపోయాడు. నవీద్ పేల్చిన బుల్లెట్లు అహ్మద్ భుజం, చేయి, అరచేతిలోకి దూసుకెళ్లాయి. ఆలోపు పోలీసులు రంగప్రవేశం చేయడంతో అహ్మద్ ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటికే రక్తమోడుతున్న అహ్మద్‌ను పోలీసులు హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. న్యూసౌత్‌వేల్స్ అగ్రనేత క్రిస్ మిన్స్సహా పలువురు నేతలు, ఉన్నతాధికారులు అహ్మద్‌ను ఆస్పత్రిలో పరామర్శించారు.గతంలో సైన్యంలో పనిచేసిన అహ్మద్!అహ్మద్ స్వస్థలం సిరియాలోని ఇడ్లిబ్ పట్టణం. 2006లో శరణార్థిగా ఆస్ట్రేలియాకు వచ్చాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. ఇటీవలే ఇతన తల్లిదండ్రులు సైతం సిరియా నుంచి ఇతని వద్దకు వచ్చేశారు. అహ్మద్ సిడ్నీ సమీప సదర్లాండ్లో సొంతంగా పండ్ల వ్యాపారం చేస్తున్నారు. అహ్మద్ గతంలో సైన్యంలో పనిచేసినట్లు వార్తలొచ్చాయి. అయితే సిరియాలోని అసద్ అల్ బషీర్ ప్రభుత్వంలోనా లేదంటే ఆస్ట్రేలియాలో సేవలందించారా అనేది తెలియాల్సి ఉంది. ప్రాణాలు ఎదురొడ్డి పలువురిని కాపాడిన అహ్మద్ ఇప్పుడు ఆస్పత్రిపాలవడంతో చికిత్స ఖర్చుల కోసం పలువురు దాతలు ముందుకొచ్చారు. ఆన్లైన్లో గోఫండ్‌మీ క్యాంపెయిన్ మొదలెట్టారు. ఇప్పటికే దాదాపు రూ. 8.61 కోట్లు విరాళాల రూపంలో వచ్చాయి. ‘‘సైన్యంలో చేసిన నా కుమారుడికి ప్రాణాల విలువ తెలుసు. అందుకే కాపాడేందుకు ఒక్క నిమిషం కూడా ఆలస్యంచేయకుండా పరుగెత్తాడు’’ అని అహ్మద్ తండ్రి మొహమ్మద్ ఫతే అన్నారు. -
అక్కడే లాక్ అయిపోయాం: బాండీ బీచ్ ఘటనపై మైకేల్ వాన్
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఆస్ట్రేలియాలో తనకు ఎదురైన భయంకరమైన అనుభవాన్ని పంచుకున్నాడు. తాను కూడా బాండీ బీచ్‌కు వెళ్లాలనుకున్నానని.. అయితే, రెస్టారెంట్ నిర్వాహకుల అప్రమత్తతే తనను కాపాడిందని పేర్కొన్నాడు. తాను, తన కుటుంబం ప్రస్తుతం సురక్షితంగా ఉన్నామని తెలిపాడు.కాగా బాండీ బీచ్‌లో కాల్పుల మోతతో ఆస్ట్రేలియా ఆదివారం ఉలిక్కి పడింది. ఇద్దరు ముష్కరులు తుపాకీలు చేతబట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సంప్రదాయ హనుక్కా వేడుకలో పాల్గొంటున్న యూదులుపై కాల్పులకు తెగబడి దాదాపుగా పదహారు మందిని పొట్టనబెట్టుకున్నారు.తండ్రీ-కొడుకులేఈ ఘటనలో ఇద్దరు పోలీసులు సహా 38 మంది గాయపడగా.. ఇది ముమ్మాటికీ ఉగ్రవాద దాడేనని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ ఘాతుకానికి పాల్పడిన ముష్కరులు తండ్రీ-కొడుకులే కావడం గమనార్హం. వీరు పాకిస్తాన్ నుంచి వలస వచ్చి ఆస్ట్రేలియాలో ఉంటున్నారు.పండ్ల వ్యాపారి ధైర్యంమరోవైపు.. వీరిద్దరు ఉన్మాద చర్యకు పాల్పడుతుండగా అహ్మద్ అనే పండ్ల వ్యాపారి ధైర్యం ప్రదర్శించి ఓ ఉగ్రవాదిని చెట్టు వెనుక నుంచి పట్టుకుని.. అతడికే గన్ గురిపెట్టి తరిమేశాడు. ఇంతలో మరో ఉగ్రవాది అతడిపై కాల్పులు జరుపగా అహ్మద్ కుప్పకూలిపోయాడు. ఏదేమైనా అహ్మద్ లేకుంటే మరికొంత మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయేవారే!ఆ శబ్దాలు వినిఈ పరిణామాలపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ మైకేల్ వాన్ తాజాగా స్పందించాడు. బాండీ బీచ్‌లో కాల్పులు జరిపిన సమయంలో తాను అక్కడికి దగ్గర్లోనే ఉన్నానని తెలిపాడు. ‘‘తొలుత ఆ శబ్దాలు విని షార్క్ దాడి చేసిందేమో అనుకున్నాము. అయితే, కాసేపటి తర్వాత చెవులు రిక్కించి వినగా.. అది ఇంకేదో శబ్దమని అర్థమైంది.అపుడు నేను నా కుటుంబంతో కలిసి దగ్గర్లోని ఓ రెస్టారెంట్లో ఉన్నాను. మేము ఆర్డర్ చేసిన పదార్థాల కోసం వేచి ఉన్నాము. ఇంతలో నాకు ఫోన్ కాల్ రావడంతో బయటకు వెళ్లి మాట్లాడుతున్నా.అప్పుడు ఓ బౌన్సర్ తన చేతిలో తుపాకీ పట్టుకుని నా వైపు వేగంగా దూసుకువచ్చాడు. వెంటనే లోపలికి వెళ్లాలని నన్ను హెచ్చరించాడు. బయట జరుగుతున్న దాడి గురించి మాకు అప్పుడే తెలిసింది. సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. బీచ్‌లో చాలా మందిని బంధించారని కొంతమంది అన్నారు.లోపలి నుంచి తాళం వేశారుసిడ్నీ, ఆస్ట్రేలియా వ్యాప్తంగా ఇలాంటి దాడులు ప్లాన్ చేశారనే చర్చ నడుస్తోంది. మేమున్న రెస్టారెంట్ తలుపులన్నింటికి లోపలి నుంచి తాళం వేశారు. బయట పరిస్థితి చక్కబడిందని తెలిసిన తర్వాతే మమ్మల్ని పంపించారు. రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది వరకు మేము అక్కడే లాక్ అయిపోయాం.నా జీవితంలో ఇంతటి భయంకర అనుభవాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదు. నాతో పాటు నా భార్య, సోదరి, నా ఇద్దరు కుమార్తెలు, వారి స్నేహితురాలు ఇలా.. అందరం అక్కడే ఉన్నాము. పిల్లలు భయపడకుండా నాలో భయాన్ని అణిచిపెట్టుకుంటూ వారికి ధైర్యం చెప్పాను. వారి గురించే నా ఆందోళన, భయం. బయట ఉన్నవారి పరిస్థితి గురించి కూడా బాధేసింది.బీచ్‌కు వెళ్లాలని మేము అనుకున్నాము. అక్కడే నా కుమారుడు క్రికెట్ ఆడుతూ.. పరుగులు తీస్తుంటే చూశాము. పబ్, రెస్టారెంట్ కాకుండా మా తదుపరి గమ్యం అదే అయి ఉండేది’’ అని ది టెలిగ్రాఫ్‌నకు రాసిన కాలమ్‌లో మైకేల్ వాన్ పేర్కొన్నాడు.ఆ హీరోకి మనమంతా రుణపడి ఉండాలిఇక ఎక్స్ వేదికగానూ ఇదే విషయంపై స్పందిస్తూ.. ‘‘బాండీ ఘటన సమయంలో మేము రెస్టారెంట్లో లాక్ అయిపోయి ఉన్నాము. ఇప్పుడు సురక్షితంగా ఇంటికి చేరుకున్నాము. ఎమర్జెన్సీ సర్వీస్ వారికి ధన్యవాదాలు.అదే విధంగా.. ఉగ్రవాదిని అడ్డుకుని ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఆ హీరోకి మనమంతా రుణపడి ఉండాలి. ఈ ఘటనతో ప్రభావితమైన ప్రతి ఒక్కరికి నా సానుభూతి’’ అని మైకేల్ వాన్ పోస్ట్ పెట్టాడు. కాగా ఆసీస్- ఇంగ్లండ్ మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్ కామెంట్రీ కోసం వాన్ ఆస్ట్రేలియాకు వెళ్లాడు.చదవండి: ‘గోట్ టూర్’ చీఫ్ ఆర్గనైజర్ జైలుకు! -
తండ్రీకొడుకుల పనే
సిడ్నీ: ప్రశాంత ఆస్ట్రేలియాలో రక్తపుటేరులు పారించింది పాక్ జాతీయులైన తండ్రీకొడుకులని తేలింది. ఇద్దరు సాయుధులు ఆదివారం సిడ్నీలోని బాండీ బీచ్‌ను ఆనుకుని ఉన్న చిన్న పార్క్‌లో వేడుకల్లో మునిగిపోయిన యూదులపైకి తుపాకీ గుళ్ల వర్షం కురిపించి 15 మందిని పొట్టనబెట్టుకున్న విషయం తెల్సిందే. కాల్పులు జరిపిన ఆగంతకుల్లో ఒకరిని ఆదివారమే నవీద్ అక్రమ్గా గుర్తించగా మరో ఆగంతకుడు నవీద్ తండ్రి, 50 ఏళ్ల పండ్ల వ్యాపారి సాజిద్ అక్రమ్ అని న్యూ సౌత్‌వేల్స్ పోలీసులు సోమవారం వెల్లడించారు. సాజిద్‌ను పోలీసులు ఆదివారం ఘటనాస్థలిలోనే అంతంచేయగా నవీద్‌కు బుల్లెట్ గాయాలవడంతో ఆస్పత్రిలో చేర్పించి ప్రశ్నిస్తున్నామని న్యూ సౌత్‌వేల్స్ పోలీస్ కమిషనర్ మాల్ లాన్యన్ చెప్పారు. సోదాల్లో నవీద్‌కు చెందిన డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ క్రికెట్ టీమ్ జెర్సీ ధరించినట్లుగా కార్డ్‌పై ఫొటోలో కన్పిస్తోంది. కార్డ్ ప్రకారం నవీద్ ఆస్ట్రేలియాలోనే 2001 ఆగస్ట్ 12న జన్మించారు. దీంతో నవీద్‌కు ఆస్ట్రేలియా పౌరసత్వం లభించినట్లు తెలుస్తోంది. తండ్రి సాజిద్ విద్యార్థి వీసాతో పాకిస్తాన్ నుంచి 1998లో ఆస్ట్రేలియాకు వచ్చాడు. 2001లో ఆ వీసాను పార్ట్నర్ వీసాగా మార్చుకున్నాడు. తర్వాత దానిని ‘రెసిడెంట్ రిటర్న్’ వీసాగా మార్చుకున్నాడని ఆస్ట్రేలియా హోం శాఖ మంత్రి టోనీ బుర్కీ సోమవారం వెల్లడించారు. గతంలో ఇచ్చిన వీసా గడువు ముగిసేలోపే ఆస్ట్రేలియాను వీడినా లేదా ఆస్ట్రేలియాకు ఆవల ఉన్నప్పుడు వీసా గడువు ముగిసిన పక్షంలో అలాంటి వాళ్లకు తిరిగి ఆస్ట్రేలి యాలోకి అడుగుపెట్టాక ‘రెసిడెంట్ రిటర్న్’ వీసా జారీచేస్తారు. ఆ వీసాతో ప్రస్తుతం సాజిద్ ఆస్ట్రేలియాలో ఉంటూ పండ్ల వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆస్ట్రేలి యాకు వచ్చిన ఇన్నేళ్లలో సాజిద్ మూడు సార్లు మాత్రమే దేశం దాటాడు. గతంలో నిఘా పరిధిలో ఉన్నా..యువ నవీద్‌పై గతంలో కొన్ని నెలలపాటు ఆస్ట్రేలియా నిఘా వర్గాలు ఓ కన్నేసి ఉంచాయి. ఐఎస్ఐఎస్ అంతర్జాతీయ ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో 2019 అక్టోబర్‌లో తొలిసారిగా నవీద్‌పై ఆస్ట్రేలియా నిఘా వర్గాలు నిఘా పెట్టాయి. ఉగ్రవాదంతో సంబంధమున్న ఇద్దరికీ జైలుశిక్ష పడింది. వీళ్లతో నవీద్‌కు సంబంధం ఉన్నట్లు అప్పట్లో పోలీసులు గుర్తించారు. దీంతో ఇతను సైతం ఉగ్రవాద భావజాలానికి ప్రభావితుడయ్యాడా లేదా అని తెల్సుకునేందుకు 2019 ఏడాదిలో దాదాపు ఆరునెలలపాటు అతని కదలికలపై ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్(ఏఎస్‌ఐవో) అధికారులు నిఘా పెట్టారు. అయితే తనపై నిఘా ఉందని ముందే పసిగట్టిన నవీద్ ఏళ్ల తరబడి ఎలాంటి ఉగ్రవాద సంబంధ కార్యకలాపాల్లో పాలుపంచుకోకుండా మంచివాడిలా నటించాడు. దీంతో వేర్పాటువాద లక్షణాలు, ప్రవర్తన ఇతడిలో లేవని భావించి నవీద్‌ను నిఘా వర్గాలు సీరియస్‌గా తీసుకోలేదు. అదను చూసి ఆదివారం ఇలా దుశ్చర్యకు పాల్పడటంతో ఆస్ట్రేలియా నిఘా వ్యవస్థలో లోటుపాట్లపై మరోసారి సమీక్ష అవసరమనే వాదనలు మొదలయ్యాయి. రెండు నెలల క్రితం నవీద్‌ను మేస్త్రీ పని నుంచి ఒక సంస్థ తొలగించింది. ఆ సంస్థ ఇటీవల దివాలా తీయడంతో వ్యయనియంత్రణ చర్యల్లో భాగంగా నవీద్‌ను విధుల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. 🚨 Here’s a full 10 minute video of the terrorist attack that happened today in Bondi beach Australia. How utterly terrifying pic.twitter.com/KNr8Xo6lRU— Queen Natalie (@TheNorfolkLion) December 14, 2025


