ఆస్ట్రేలియా సిడ్నీలోని బోండీ బీచ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఘాతుకానికి పాల్పడింది తండ్రీకొడుకుల పనే అని దర్యాప్తు బృందాలు గుర్తించాయి. నిందితులు సాజిద్ అక్రమ్ (50), అతడి కుమారుడు నవీద్ అక్రమ్ (24) కాల్పులకు తెగబడినట్లు న్యూ సౌత్ వేల్స్ పోలీసులు తేల్చారు.
ఆదివారం సిడ్నీలోని బోండీ బీచ్‌లో ఉత్సవం నిర్వహించుకుంటున్న యూదులపై ఇద్దరు ఉగ్రవాదులు సాజిద్, నవీద్ కాల్పులకు తెగబడ్డారు. తండ్రీ కొడుకులు మృగాల్లాగా విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. అసోసియేట్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. ఈ దుర్ఘటనలో 15 మంది మరణించారు. సుమారు 40 మంది గాయపడ్డారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో సాజిద్ మృతి చెందాడు.
న్యూ సౌత్ వేల్స్ కమిషనర్ మాల్ లానియన్ వెల్లడించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి. దాడి చేసిన వారు తండ్రి–కొడుకులు. తండ్రి సాజిద్ అక్కడికక్కడే పోలీసుల కాల్పుల్లో మృతి చెందగా.. 24 ఏళ్ల కుమారుడు నావీద్ అక్ఱమ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనా స్థలం నుంచి రెండు ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైజ్‌లు (IEDs) స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు.
అర్ధరాత్రి బోన్నిరిగ్, క్యాంప్సీ ప్రాంతాల్లోని పలు చోట్ల తనిఖీలు జరిపాం. సాజిద్‌కి గన్ లైసెన్స్ ఉంది. ఏకంగా ఆరు తుపాకులు కొన్నాడు. అవే ఈ దాడిలో ఆ తండ్రీ కొడుకులు ఉపయోగించారు. అయితే వాళ్ల నేపథ్యాలు ఏంటన్నదానిపై మాత్రం పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. సమగ్ర దర్యాప్తు తర్వాత వాళ్ల వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే..
దాడి సమయంలో ఘటనా స్థలం నుంచి కరడుగట్టిన ఉగ్రసంస్థ ఐసిస్ జెండా కనుగొన్నట్లు ప్రచారం జరిగింది. అయితే దీనిపై స్పందించేందుకు పోలీసులు నిరాకరించారు. దాడి వెనుక ఉద్దేశం ఏంటో తేలాల్సి ఉందని అంటున్నారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ప్రార్థనా మందిరాలు, యూదు సమాజానికి చెందిన ప్రదేశాల్లో అదనపు భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
అహ్మద్ లేకుంటేనా..
ఈ ఘటనలో స్థానికంగా పండ్ల దుకాణం నడిపే అహ్మద్ తన ప్రాణాలకు తెగించాడు. బీచ్‌లో ముష్కరులు కాల్పులు జరుపుతుండగా.. చెట్టు చాటు నుంచి బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న ఓ ఉగ్రవాదిని గట్టిగా పట్టుకొని, తుపాకీను లాక్కొని అతడికే గురిపెట్టాడు. అహ్మద్‌ను గమనించిన మరో మరో ఉగ్రవాది కాల్పులు ప్రారంభించారు. దాంతో అహ్మద్ గాయాలపాలై కుప్పకూలిపోయాడు.
పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. అహ్మద్ సాహసోపేతంగా వ్యవహరించిన దృశ్యం ఆస్ట్రేలియా టీవీ చానళ్లలో ప్రసారమైంది. అతడు ధైర్యంగా అడుగు ముందుకు వేయకపోతే ఉగ్రవాదుల కాల్పుల్లో మరికొందరు మరణించేవారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. రియల్ హీరో అహ్మద్ అంటూ జనం ప్రశంసిస్తున్నారు. మరోవైపు.. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరు పోలీసులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
🚨 Here’s a full 10 minute video of the terrorist attack that happened today in Bondi beach Australia.
How utterly terrifying pic.twitter.com/KNr8Xo6lRU— Queen Natalie (@TheNorfolkLion) December 14, 2025


