కెన్యా పర్యావరణ ఉద్యమకారిణి ప్రపంచ రికార్డు
నైరోబీ: కెన్యా పర్యావరణ ఉద్యమకారిణి ట్రంఫెనా ముతోని ప్రపంచ రికార్డు సృష్టించారు. నిద్రాహారాలు మాని 72 గంటలపాటు ఒక చెట్టును కౌగిలించుకుని ఉండిపోయారు. గతంలో 48 గంటల పాటు చెట్టును కౌగిలించుకుని తాను సృష్టించిన రికార్డును తానే బద్దలు కొట్టారు. నౌరీ పట్టణంలోని ఓ ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలో చెట్టును ఆమె ఇందుకు ఎంచుకున్నారు.
అడవుల నరికివేత, మృగాల హత్యలకు నిరసనగా, యువతకు పర్యావరణ సంరక్షణ విలువను తెలపడానికి ఆమె ఈ కార్యక్రమం చేపట్టారు. ఆమె నిరసనకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందన వచి్చంది. చాలా మంది ఆమెకు మద్దతుగా నిలిచారు. ఒకానొక దశలో ఆమె నిద్రలోకి జారుకోగా.. మద్దతుదారులు మేల్కొలిపారు. కొందరైతే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పరిశీలకులకు ఆమె ఫీజు చెల్లించడానికి ముందుకొచ్చారు.
ఈ సమయంలో ఆమె నలుపు, ఆకుపచ్చ, ఎరుపు, నీలం రంగుల్లో ఉన్న ఊలు టీషర్ట్‌ను ధరించారు. నలుపు ఆఫ్రికన్ శక్తని, ఆకుపచ్చ అడవులకు, ఆశకు ప్రతిరూమని, ఇక ఎరుపు ప్రతిఘటనకు, నీలం నీటికి గుర్తని.. చెప్పారు. వాతావరణ మార్పులు, అడవుల నరికివేత వల్ల కలిగే ప్రమాదం గురించి అవగాహన పెంచడమే తన నిరసన లక్ష్యమని చెప్పారు. తక్కువ కార్బన్ ఉద్గారాలను విడుదల చేసే తమ దేశాలు.. వాతావరణ మార్పుల వల్ల కలిగే ప్రభావాలను ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తోందని ఆఫ్రికన్ దేశాలు ఆరోపిస్తున్నాయి.


