చెట్టును కావలించుకుని ఉండి ప్రపంచ రికార్డు స్థాపించింది. కెన్యాలో అడవుల నరికివేతపై అందరి దృష్టి పడేలా ఆమె ఈ నిరసన తెలియచేసింది. ప్రజలు ఆమె మద్దతుకు తండోప తండాలుగా కదిలి వచ్చారు. కెన్యాలోని న్యారీ కౌంటీలో పర్యావరణ కార్యకర్త ట్రంఫెనా ముతోని నాలుగు రోజుల క్రితం ఒక చెట్టును పట్టుకుని నిలబడిపోయింది. 72 గంటల పాటు ఆ చెట్టును వదలకుండా ఉంది. నిద్రపోలేదు. విశ్రాంతి తీసుకోలేదు. కాలకృత్యాల కోసం కూడా అతి తక్కువ సమయమే తీసుకుంది.
ఒక దశలో వాటి అవసరమే రాలేదు. 72గంటల పాటు ఆమె చేస్తున్న నిరసనను ఆన్‌లైన్‌లో సోషల్ మీడియాలో జనం చూశారు. చాలామంది నేరుగా వచ్చి చూశారు. మరెంతో మంది దశలు దశలుగా చూస్తూ ఉండిపోయారు. ఆరోగ్య కార్యకర్తలు దగ్గరే ఉండి ఆమె ఆరోగ్యాన్ని గమనిస్తూ వచ్చారు. జనం చప్పట్లతో ఆమెను ఉత్సాహపరిచి 72 గంటల తర్వాత నిరసనను ముగించేలా చూశారు. ముతోని గతంలో కూడా ఇలాగే 48 గంటల పాటు చెట్టును కావలించుకుని ఉండిపోయి రికార్డు స్థాపించింది.
ఇప్పుడు తన రికార్డును తానే బ్రేక్ చేసింది. ఇది గిన్నెస్ రికార్డు అని పరిశీలకులు భావిస్తున్నారు. ‘నేను ఈ పని ప్రచారం కోసమో, డబ్బు కోసమో చేయడం లేదు. నాలాంటి యువతీ యువకులు పర్యావరణ సంరక్షణ అవసరాన్ని తెలుసుకోవాలని చేస్తున్నాను. నన్ను చూసి ఏ మూల ఏ ఒక్కరైనా ఒక్క చెట్టు నాటినా నా నిరసనలోని ప్రతి సెకండ్ సద్వినియోగం అయినట్టే భావిస్తాను’ అని నిరసన ముగించాక ముతోని మీడియాతో అంది.
ఈ 72 గంటలలో ఒక రాత్రి భారీగా వాన పడింది. అయినా ముతోని చలించలేదు. చెట్టును కరుచుకుని ఉండిపోయింది. ఆమె దృఢ నిరసనకు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో స్పందన వచ్చింది. కెన్యాలో అడవుల నరికివేత మాత్రమే కాదు మృగాల సంహారం కూడా సాగుతూ ఉన్న దరిమిలా ఈ నిరసన ఏ మార్పుకు కారణమవుతుందో చూడాలి.
(చదవండి: మట్టితో... ఫేస్‌మాస్క్‌లు)


