మట్టితో... ఫేస్‌మాస్క్‌లు | Traditional Mask Making Culture of Majuli | Sakshi
Sakshi News home page

మట్టితో... ఫేస్‌మాస్క్‌లు

Dec 14 2025 1:13 PM | Updated on Dec 14 2025 1:13 PM

Traditional Mask Making Culture of Majuli

సినిమాల్లో మనకు కనిపించే నటులు మేకప్‌తో సదరు పాత్ర ఆహార్యం ఉట్టిపడేలా తయారవుతుంటారు. ముఖ్యంగా ముఖ కవళికలే ఆ పాత్రను నడిపిస్తాయి. ఇప్పుడంటే మేకప్‌ టెక్నాలజీ అందుబాటులో ఉంది కానీ... కొన్నేళ్ల క్రితం కేవలం మొహాలకు మాస్కులు వేసుకుని నాటకాల్లో నటించే వారు. అలాంటి మాస్కులకు అస్సాంలోని మాజూలీ ప్రసిద్ధిగాంచింది. శ్రీమంత శంకరదేవుల వైష్ణవ సంప్రదాయం ఆధారంగా అభివృద్ధి చెందిన సంప్రదాయ మాస్క్‌లు ప్రసిద్ధికెక్కాయి. ఈ మాస్కుల తయారీ కళ 16వ శతాబ్దం నుంచి మనుగడలో ఉందని చరిత్ర చెబుతోంది. 

వారసత్వ కళగా ఉన్న ఈ ప్రాంతాల్లోని కొన్ని కుటుంబాలకు ఏఎస్‌ఆర్‌ఎల్‌ఎం వారధిగా నిలిచింది. మైక్రో ఎంటర్‌ప్రైజ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (ఎంఈడీపీ)లో భాగంగా కళాకారులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఉపాధిబాట పట్టించింది. వారి వారసత్వ కళను ప్రోత్సహించి వాటిని మార్కెటింగ్‌ చేసేందుకు ఏర్పాటు చేసింది. కళాకారుల కుటుంబాల్లోని మహిళలతో స్వయం సహాయక సంఘం(ఎస్‌హెచ్‌జీ)గా ఏర్పాటు చేసింది. పదిహేను మంది ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. 

ఇలా రెండు బృందాలు ఈ మాస్కులను తయారు చేస్తున్నాయి. సహజసిద్ధ రంగులతో తయారు చేసే ఈ మాస్కులను బహిరంగ మార్కెట్‌కు తరలించి విక్రయించడమే కాకుండా ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డిజిటల్‌ మార్కెట్‌లోకి సైతం అడుగుపెట్టింది. వీటికి గతేడాది మార్చిలో జీఐ ట్యాగింగ్‌(భౌగోళిక గుర్తింపు)ను ప్రభుత్వం ఇచ్చింది.

సహజసిద్ధ సరుకుతో...
అస్సాం రాష్ట్రంలోని మాజూలీ ద్వీపంలోని కళాకారులు ఈ ఫేస్‌ మాస్కులను తయారు చేస్తున్నారు. వెదురు కర్ర ముక్కలు, బ్రహ్మపుత్ర నదీలో లభించే బంక మట్టి, ఆవుపేడ, జూట్, పేపర్, కాటన్‌తో ఈ మాస్కులు తయారు చేస్తారు. ముందుగా తయారు చేసే ముఖ ఆకృతిని వెదురు ముక్కలతో ఫ్రేమ్‌ మాదిరి తయారు చేసి వాటికి బంకమట్టి, ఎండిన ఆవుపేడ పొడి కలిపిన మిశ్రమంతో ఆ ఫ్రేమ్‌పైన పూతలా అద్దుతారు. ఈ ప్రక్రియలో జూట్, పేపర్, కాటన్‌ను అనువైన రీతిలో వినియోగిస్తారు. ఈ నమూనా పూర్తిగా ఎండిన తర్వాత వాటికి అవసరమైన రంగులు అద్దుతారు. 

ప్రస్తుతం సూరత్‌ నుంచి దిగుమతి చేసుకునే రంగులను వినియోగిస్తున్నారు. సహజసిద్ధమైన రంగుల వినియోగం ఖరీదవుతుందని, త్వరలో ఈ రంగులను స్థానికంగా తయారు చేసిన తర్వాత పూర్తిస్థాయిలో వీటినే వినియోగిస్తామని వాటిని తయారు చేస్తున్న మహిళలు చెబుతున్నారు. ఈ మాస్కులు మూడు రకాల పరిమాణంలో ఉంటాయి. 

మొదటి రకం కేవలం మొహాన్ని మాత్రమే కవర్‌ చేస్తుండగా... రెండో రకం నటుడి శరీరంలో మెజార్టీ భాగాన్ని కవర్‌ చేస్తుంది. మూడో రకం మాత్రం అవసరానికి అనుగుణంగా వాటిని తయారు చేస్తారు. ఈ కళను పరిరక్షించి ఆధునీకరించేందుకు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్‌ హేమ్‌చంద్ర గోస్వామి కృషి చేశారు. ప్రస్తుతం వీటిని నాటకాల్లో మాత్రమే వినియోగించకుండా పర్యాటకుల జ్ఞాపికలుగానూ, అలంకరణ వస్తువులగానూ వినియోగిస్తున్నారు.

మార్కెట్‌లో ఇలా...
కళాకారులు తయారు చేసే మాస్కులపైనే ఆదాయం ఆధారపడి ఉంటుంది. ఒక్కో మాస్కుపైన రూ.100 పెట్టుబడి పెడితే చాలు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. మహిళలు తయారు చేసే ఒక్కో మాస్కు కనీస ధర రూ.200 నుంచి ప్రారంభమవుతుంది. ఫేస్‌ మాస్క్‌ పరిమాణం ఆధారంగా వీటి ధర రూ.3వేల వరకు ఉంటుంది. 

ఈ మాస్కుల తయారీ ద్వారా మహిళా సంఘానికి నెలకు కనీసం రూ.50 వేల ఆదాయం లభిస్తోంది. ప్రస్తుతం ఈ తయారీ ప్రక్రియ ప్రారంభదశలో ఉండగా... రానున్న ఏడాదిలో ఆర్థిక స్థితి భారీగా వృద్ధి సాధిస్తుందని, ఈమేరకు వ్యూహాత్మక కార్యాచరణ రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. 
మాజూలీ నుంచి
– చిలుకూరి అయ్యప్ప, సాక్షి, 

(చదవండి: 'స్త్రీ' నిర్వచనం ఇదా..? ఎలాన్‌మస్క్‌పై నెటిజన్లు ఫైర్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement