సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో అస్సాంకు చెందిన నలుగురు ఆటగాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆ నలుగురు ప్లేయర్లను అమిత్ సిన్హా, ఇషాన్ అహ్మద్, అమన్ త్రిపాఠి, అభిషేక్ ఠాకుర్‌లగా అస్సాం క్రికెట్ అసోసియేషన్ (ACA) గుర్తించింది.
దీంతో వారిపై ఏసీఎ సస్పెన్షన్ వేటు వేసింది. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 8 వరకు లక్నోలో జరిగిన లీగ్ మ్యాచ్‌లలో ఈ నలుగురు.. సహచర ఆటగాళ్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారంట. ఈ విషయాన్ని అస్సాం క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సనాతన్ దాస్ ధ్రువీకరించారు.
దర్యాప్తు పూర్తయ్యే వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ నలుగురిపై గువహతిలోని క్రైమ్ బ్రాంచ్‌లో ఎఫ్‌ఐఆర్ కూడా నమైంది. ఈ విషయంపై బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం ఇప్పటికే ప్రాథమిక విచారణ చేపట్టినట్లు సమాచారం.
సస్పెండ్ అయిన వారిలో అభిషేక్ ఠాకూర్.. ఈ ఏడాది రంజీ సీజన్‌లో అస్సాం తరపున రెండు మ్యాచ్‌లు ఆడారు. మిగితా ప్లేయర్లు దేశీయ క్రికెట్‌లో వివిధ స్థాయిల్లో అస్సాంకు ప్రాతినిధ్యం వహించారు. టీమిండియా క్రికెటర్ రియాన్ పరాగ్ సైతం అస్సాంకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: మెస్సీ కోసం హానీమూన్ మానుకున్న జంట


