వర్గీకరణ మ్యాచ్‌లో స్పెయిన్ చేతిలో ఓటమ
మహిళల జూనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నీ
సాంటియాగో (చిలీ): మహిళల జూనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు పదో స్థానంతో ముగించింది. శుక్రవారం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో జ్యోతి సింగ్ సారథ్యంలోని భారత జట్టు 1–2 గోల్స్ తేడాతో స్పెయిన్ చేతిలో పరాజయం పాలైంది. భారత్ తరఫున కనిక సివాచ్ (41వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించగా... స్పెయిన్ తరఫున నటాలియా విలనోవా (16వ నిమిషంలో), ఎస్తెర్ కనాలెస్ (36వ నిమిషంలో) చెరో గోల్ కొట్టారు.
మ్యాచ్ తొలి క్వార్టర్‌లో ఇరు జట్ల ప్లేయర్లు హోరాహోరీగా పోరాడినా... ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. రెండో క్వార్టర్ ఆరంభంలోనే నటాలియా గోల్ చేయడంతో స్పెయిన్ జట్టు ఆధిక్యంలోకి వెళ్లింది. భారత జట్టు నుంచి కొన్ని చక్కటి ప్రయత్నాలు కనిపించినా... ఫినిషింగ్ లోపం కారణంగా అవి గోల్స్‌గా మారలేకపోయాయి.
మూడో క్వార్టర్‌లో సోనమ్ చక్కటి గోల్ సాధించినా... స్పెయిన్ వీడియో రిఫరల్ ద్వారా ఆ గోల్ నిబంధనలకు విరుద్ధమని తేల్చింది. ఈ క్రమంలోనే స్పెయిన్ మరో గోల్‌తో ఆధిక్యాన్ని మరింత పెంచుకోగా... కాసేపటికి కనిక పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి భారత్ ఖాతా తెరిచింది. ఇక ఆఖరి క్వార్టర్‌లో స్పెయిన్ ఆధిక్యాన్ని కాపాడుకోగా... భారత జట్టు మరో గోల్ సాధించలేక ఓటమి వైపు నిలిచింది.


