వాళ్లకు చెడు అలవాట్లు.. నా భర్త ఎలాంటివాడంటే: జడేజా భార్య | Ravindra Jadeja wife Rivaba Shocking claim involving India players | Sakshi
Sakshi News home page

వాళ్లకు చెడు అలవాట్లు.. నా భర్త ఎలాంటివాడంటే: జడేజా భార్య

Dec 12 2025 3:46 PM | Updated on Dec 12 2025 4:36 PM

Ravindra Jadeja wife Rivaba Shocking claim involving India players

టీమిండియా ఆల్‌ ఫార్మాట్‌ ఆల్‌రౌండర్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు రవీంద్ర జడేజా. టీ20 ప్రపంచకప్‌-2024లో భారత్‌ చాంపియన్‌గా నిలిచిన తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన జడ్డూ.. ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్నాడు.

స్వదేశంలో సౌతాఫ్రికాతో టెస్టు, వన్డే సిరీస్‌ (IND vs SA)లు ముగించుకున్న జడేజా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. జడ్డూ భార్య, గుజరాత్‌ మంత్రి రివాబా సోలంకి (Rivaba) తన భర్తను ప్రశంసించే క్రమంలో టీమిండియాను ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి.

ఇంటికి దూరంగా ఉన్నా 
క్రికెటర్‌గా ఉన్న తన భర్త విదేశాలకు వెళ్లడం సహజమని.. అయితే, జట్టులోని మిగతా అందరిలా తన భర్త కాదని తెలిపారు. ఎక్కడున్నా నైతిక విలువలు కోల్పోడంటూ రివాబా వ్యాఖ్యానించారు. ఆయనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని.. పన్నెండు ఏళ్లు ఇంటికి దూరంగా ఉన్నా తన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదని చెప్పుకొచ్చారు.

ద్వారకలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న రివాబా తన భర్త రవీంద్ర జడేజా (Ravindra Jadeja) గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నా భర్త.. క్రికెటర్‌ రవీంద్ర జడేజా.. లండన్‌, దుబాయ్‌, ఆస్ట్రేలియా అంటూ ఆట నిమిత్తం వివిధ దేశాలు తిరగాల్సి వస్తుంది. అయినప్పటికీ ఆయన ఎలాంటి చెడు వ్యసనాలకు ఆకర్షితుడు కాలేదు.

వాళ్లు ఎన్నో దుర్గుణాలు కలిగి ఉంటారు
ఆయనకు తన బాధ్యతలు ఏమిటో తెలుసు. కానీ మిగతా జట్టంతా అలా కాదు. వాళ్లు ఎన్నో దుర్గుణాలు కలిగి ఉంటారు. అయినా వారిపై ఎవరూ ఎలాంటి ఆంక్షలు విధించలేరు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అదే విధంగా.. ‘‘నా భర్త పన్నెండు ఏళ్లు ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చింది. కావాలంటే ఆయన ఎలాంటి చెడ్డ పనైనా చేసి ఉండవచ్చు. కానీ నైతిక విలువలు అంటే ఏమిటో ఆయనకు బాగా తెలుసు’’ అంటూ జడ్డూపై రివాబా ప్రశంసలు కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌కాగా.. రివాబా వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.

భర్తను మెచ్చుకోవడంలో తప్పు లేదు.. కానీ
తన భర్తను మెచ్చుకోవడంలో తప్పు లేదని.. అయితే, అందుకోసం మిగతా అందరి ఆటగాళ్ల వ్యక్తిత్వాలను కించపరచడం సరికాదని టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రిగా బాధ్యతాయుత పదవిలో ఉన్న వారు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

కాగా సాధారణ కుటుంబం నుంచి వచ్చిన జడేజా క్రికెటర్‌గా అత్యుత్తమ స్థాయికి ఎదగడంలో అతడి తల్లి పాత్ర కీలకం. ఈ విషయాన్ని జడ్డూనే స్వయంగా అనేక సందర్భాల్లో చెప్పాడు. ఇక తన అక్క కూడా తన విజయానికి బాటలు వేసిన వారిలో ఒకరని గతంలో ప్రశంసించాడు.

కుటుంబంలో విభేదాలు?
ఇదిలా ఉంటే.. జడ్డూ తండ్రి, అక్క కాంగ్రెస్‌ పార్టీలో ఉండగా.. భార్య రివాబా బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. రివాబా వచ్చిన తర్వాత జడ్డూ తమను పూర్తిగా దూరం పెట్టాడని అతడి తండ్రి ఆరోపించగా.. జడ్డూ మాత్రం భార్యకు మద్దతు తెలిపాడు.

ఒకవైపు మాటలు మాత్రమే విని ఇంటర్వ్యూ చేయడం సరికాదని.. తన భార్యను తప్పుబట్టే విధంగా వ్యవహరిస్తే ఎవరినీ సహించబోనని మీడియాకు వార్నింగ్‌ ఇచ్చాడు జడ్డూ. కాగా జడేజా అక్కకు రివాబా స్నేహితురాలు. ఈ క్రమంలోనే జడ్డూ- రివాబాలకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి బాటలు వేసింది. వీరికి కుమార్తె నిధ్యానా ఉంది.

చదవండి: దురభిమానం.. నైతిక విలువలు పాతరేస్తున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement