ముల్లాన్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 51 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. తొలి టీ20లో టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే.
రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (46 బంతుల్లో 90; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో డొనోవన్ ఫెరియెరా (16 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (12 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.
సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో రీజా హెండ్రిక్స్ 8, కెప్టెన్ మార్క్రమ్ 29, బ్రెవిస్ 14 పరుగులకు ఔటయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2, అక్షర్ పటేల్ ఓ వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా ఆది నుంచి తడబడింది. సఫారీ బౌలర్లు తలో చేయి వేయడంతో 19.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. ఓట్నీల్ బార్ట్‌మన్ 4, ఎంగిడి, జన్సెన్, సిపాంమ్లా తలో 2 వికెట్లు తీసి టీమిండియాను కుప్పకూల్చారు.
భారత ఇన్నింగ్స్‌లో తిలక్ వర్మ (62) ఒంటరిపోరాటం చేశాడు. మిగతా బ్యాటర్లలో జితేశ్ శర్మ 27, అక్షర్ పటేల్ 21, హార్దిక్ 20, అభిషేక్ శర్మ 17, సూర్యకుమార్ 5, అర్షదీప్ 4, దూబే ఒక పరుగు చేశారు. శుభ్‌మన్ గిల్, వరుణ్ చక్రవర్తి డకౌటయ్యారు.
ఛేదనలో ఆదిలోనే చేతులెత్తేసిన టీమిండియా 19.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటై పరాజయంపాలైంది. సౌతాఫ్రికా తరఫున బ్యాటింగ్‌లో డికాక్ (90), బౌలింగ్‌లో ఓట్నీల్ బార్ట్‌మన్ (4-0-24-4) చెలరేగారు. భారత ఇన్నింగ్స్‌లో తిలక్ వర్మ (62) ఒంటరిపోరాటం చేశాడు. ఈ సిరీస్‌లోని మూడో టీ20 ధర్మశాల వేదికగా డిసెంబర్ 14న జరుగనుంది.
చదవండి: చరిత్ర సృష్టించిన క్వింటన్ డికాక్.. తొందరపాటు చర్యతో..


