భారత టీ20 జట్టు ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్ మరోసారి విఫలమయ్యాడు. సౌతాఫ్రికాతో రెండో టీ20లో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో గిల్‌తో పాటు టీమిండియా యాజమాన్యంపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సంజూకు ఓపెనర్‌గా మొండిచేయి
ఆసియా కప్-2025 టీ20 టోర్నీతో భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో రీఎంట్రీ ఇచ్చాడు గిల్ (Shubman Gill). దీంతో అభిషేక్ శర్మ (Abhishek Sharma)కు విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా కొనసాగుతున్న సంజూ శాంసన్ (Sanju Samson)ను మేనేజ్‌మెంట్ పక్కనపెట్టింది. వరుస మ్యాచ్‌లలో గిల్ విఫలమవుతున్నా.. భవిష్య కెప్టెన్ అనే ఒక్క కారణంతో అతడిని కొనసాగిస్తోంది.
ఈసారి గోల్డెన్ డక్
తాజాగా స్వదేశంలో టీ20 సిరీస్‌లోనూ సంజూకు ఓపెనర్‌గా మొండిచేయి చూపి.. యథావిధిగా గిల్‌కు పెద్దపీట వేసింది. అయితే, కటక్ వేదికగా తొలి టీ20లో రెండు బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులకే నిష్క్రమించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తాజాగా గురువారం నాటి మ్యాచ్‌లో ముల్లన్‌పూర్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు.
వరుసగా వైఫల్యాలు
సఫారీలు విధించిన 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలి ఓవర్లోనే గిల్ మొదటి వికెట్‌గా వెనుదిరిగాడు. లుంగి ఎంగిడి బౌలింగ్‌లో ఐదో బంతికి రీజా హెండ్రిక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక టీమిండియా తరఫున గత ఇరవై ఇన్నింగ్స్‌లో గిల్ సాధించిన స్కోర్లు వరుసగా.. 20(9), 10(7), 5(8), 47(28), 29(19), 4(3), 12(10), 37*(20), 5(10), 15(12), 46(40), 29(16), 4(2), 0(1).
ఈ స్థాయిలో గిల్ విఫలమవుతున్నా.. హెడ్‌కోచ్ గౌతం గంభీర్, మేనేజ్‌మెంట్ మాత్రం అతడికి వరుస అవకాశాలు ఇవ్వడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఓపెనర్‌గా గిల్‌ను ఆడించేందుకు సంజూను బలిచేయడాన్ని మాజీ క్రికెటర్లు సైతం ప్రశ్నిస్తున్నారు.
సంజూను ఎందుకు బలి చేస్తున్నారు?
టెస్టు, వన్డే జట్ల కెప్టెన్‌గా, బ్యాటర్‌గా మెరుగ్గా ఆడుతున్న గిల్‌ను రెండు ఫార్మాట్లకే పరిమితం చేయాలని.. టీ20లలో సంజూకు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. టీ20 ప్రపంచకప్-2026 నాటికి తప్పు సరిదిద్దుకోకపోతే భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. గిల్ కోసం సంజూను ఎందుకు బలి చేస్తున్నారని అతడి అభిమానులు మండిపడుతున్నారు.
ఇదిలా ఉంటే.. ముల్లన్‌పూర్ మ్యాచ్‌లో టీమిండియా పవర్ ప్లేలో ఏకంగా మూడు వికెట్లు కోల్పోయి 51 పరుగులే చేసింది. గిల్‌తో పాటు.. అభిషేక్ శర్మ (17), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5) విఫలమయ్యారు. అన్నట్లు ఈ మ్యాచ్‌లో టీమిండియా మరో ప్రయోగం చేసింది. వన్‌డౌన్‌లో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను పంపింది.
చదవండి: విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం!


