టీమిండియాతో రెండో టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో.. నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏకంగా 213 పరుగులు చేసింది.
ఆతిథ్య జట్టు ఆహ్వానం మేరకు సౌతాఫ్రికా బ్యాటింగ్‌కు దిగగా.. ఆదిలోనే రీజా హెండ్రిక్స్ (8) అవుటయ్యాడు. వరుణ్ చక్రవర్తి తన తొలి ఓవర్ తొలి బంతికే అతడిని బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ బాధ్యతాయుతంగా ఆడాడు. కేవలం 26 బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్.
అయితే, 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ కావడంతో డికాక్ సెంచరీ మిస్సయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో లేని పరుగుకు యత్నించి మూల్యం చెల్లించాడు. వికెట్ కీపర్ జితేశ్ శర్మ వేగంగా స్పందించి డికాక్‌ను రనౌట్ చేశాడు. ఈ క్రమంలో మొత్తంగా 46 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 90 పరుగులు సాధించాడు.
ఇక డికాక్‌కు తోడుగా కెప్టెన్, వన్‌డౌన్ బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్ (26 బంతుల్లో 29) ఓ మోస్తరుగా రాణించాడు. రెండో వికెట్‌కు డికాక్‌తో కలిసి 83 పరుగులు జోడించాడు. చిచ్చరపిడుగు డెవాల్డ్ బ్రెవిస్ (14)విఫలం కాగా.. ఆఖర్లో డొనోవాన్ ఫెరీరా (16 బంతుల్లో 30), డేవిడ్ మిల్లర్ (12 బంతుల్లో 20) ధనాధన్ దంచికొట్టి అజేయంగా నిలిచారు.
ఫలితంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో సౌతాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 213 పరుగులు సాధించింది. భారత్‌కు 214 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇదిలా ఉంటే.. భారత బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నారు. డికాక్‌ను వికెట్ కీపర్ జితేశ్ శర్మ రనౌట్ చేశాడు. ఎక్స్‌ట్రాల రూపంలో సౌతాఫ్రికాకు భారత్ 22 పరుగులు సమర్పించుకుంది.
ఇక భారత పేసర్లలో అర్ష్‌దీప్ సింగ్ అత్యధికంగా నాలుగు ఓవర్ల కోటాలో 54 పరుగులు ఇచ్చుకోగా.. పేస్‌దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా 45 పరుగులు సమర్పించుకున్నాడు. హార్దిక్ పాండ్యా మూడు ఓవర్లలో 34, శివం దూబే రెండు ఓవర్లలో 18 పరుగులు ఇవ్వగా.. వరుణ్ పూర్తి కోటాలో 29 రన్స్ మాత్రమే ఇచ్చి రెండు.. అక్షర్ మూడు ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టారు.


