సౌతాఫ్రికాతో రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచింది. భారత జట్టు ముల్లన్‌పూర్‌లో తొలుత బౌలింగ్ చేయనుంది. కాగా చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లో గల మహరాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పురుషుల ఇంటర్నేషనల్ ఫార్మాట్లో జరుగుతున్న తొలి మ్యాచ్ ఇది. ఇంతకు ముందు ఈ వేదికపై ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి.
ఎలాంటి మార్పులూ లేవు
టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) మాట్లాడుతూ.. ‘‘ఈ మైదానం అద్భుతమైనది. ఇక్కడ మేము ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడాము. పురుషుల క్రికెట్‌లో ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న తొలి మ్యాచ్ ఇదేనని తెలిసి సంతోషంగా ఉంది.
ప్రేక్షకులు కూడా ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఇక్కడ మేము తొలుత బౌలింగ్ చేస్తాం. వికెట్ బాగుంది. తొలి టీ20లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం. మా తుదిజట్టులో ఎలాంటి మార్పులూ లేవు’’ అని తెలిపాడు.
సంజూకు మరోసారి మొండిచేయి
కాగా సౌతాఫ్రికాతో తొలి టీ20లో ఓపెనర్‌గా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (4) విఫలమైనా యాజమాన్యం అతడికి మరో అవకాశం ఇచ్చింది. గిల్ రాకతో ఓపెనింగ్ స్థానం కోల్పోయిన సంజూ శాంసన్ (Sanju Samson).. వికెట్ కీపర్‌గానూ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రాలేకపోయాడు. అతడి స్థానంలో తొలి టీ20లో ఆడిన జితేశ్ శర్మ (Jitesh Sharma)నే మేనేజ్‌మెంట్ కొనసాగింది. దీంతో సంజూకు మరోసారి మొండిచేయి ఎదురైంది.
మూడు మార్పులతో బరిలోకి
మరోవైపు.. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తుదిజట్టులో మూడు మార్పులు చోటు చేసుకున్నట్లు కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ తెలిపాడు. ట్రిస్టన్ స్టబ్స్, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్జే స్థానాల్లో రీజా హెండ్రిక్స్, జార్జ్ లిండే, బార్ట్‌మన్‌లను ఆడిస్తున్నట్లు వెల్లడించాడు. మరోసారి తేమ ప్రభావం చూపనుందని.. ఒకవేళ తాము టాస్ గెలిచినా తొలుత బౌలింగే చేసేవాళ్లమని పేర్కొన్నాడు.
ఆల్ ఫార్మాట్ సిరీస్‌లు
కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు సౌతాఫ్రికా భారత పర్యటనకు వచ్చింది. ఈ ఆల్ ఫార్మాట్ సిరీస్‌లలో భాగంగా తొలుత టెస్టు సిరీస్‌లో సఫారీలు దుమ్ములేపారు.
అనూహ్య రీతిలో పాతికేళ్ల తర్వాత టీమిండియాను సొంతగడ్డపై 2-0తో వైట్‌వాష్ చేశారు. అయితే, వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచి భారత్ ఇందుకు ధీటుగా బదులిచ్చింది. ఇక కటక్ వేదికగా సౌతాఫ్రికాతో తొలి టీ20 గెలుపొందిన టీమిండియా.. 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టీ20 తుదిజట్లు
భారత్
అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.
సౌతాఫ్రికా
రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డొనోవన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో యాన్సెన్, లూథో సిపమ్లా, లుంగి ఎంగిడి, ఒట్నీల్ బార్ట్‌మాన్.
చదవండి: వరల్డ్‌కప్ టోర్నీకి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. భారత సంతతి ఆటగాళ్లకు చోటు


