చరిత్ర సృష్టించిన బుమ్రా.. అంపైర్‌ తప్పు చేశాడా? | Bumrah Scripts History Is Third umpire blunder gifts Him 100th T20I wicket | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన బుమ్రా.. అంపైర్‌ తప్పు చేశాడా?

Dec 10 2025 11:57 AM | Updated on Dec 10 2025 12:07 PM

Bumrah Scripts History Is Third umpire blunder gifts Him 100th T20I wicket

టీమిండియా పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికాతో తొలి టీ20 సందర్భంగా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో వంద వికెట్ల క్లబ్‌లో చేరాడు. తద్వారా భారత్‌ తరఫున మూడు ఫార్మాట్లలోనూ వంద వికెట్లు పూర్తి చేసుకున్న తొలి బౌలర్‌గా రికార్డు సాధించాడు.

175 పరుగులు
కటక్‌ వేదికగా సౌతాఫ్రికా (IND vs SA T20Is)తో మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసింది. టాపార్డర్‌ కుప్పకూలినా హార్దిక్‌ పాండ్యా (28 బంతుల్లో 59 నాటౌట్‌)కు తోడు తిలక్‌ వర్మ (26), అక్షర్‌ పటేల్‌ (23) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు స్కోరు చేయగలిగింది.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 74 పరుగులకే ఆలౌట్‌ అయింది. దీంతో టీమిండియా 101 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. 

రాణించిన బౌలర్లు
భారత బౌలర్లలో పేసర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌ (Arshdeep Singh), జస్‌ప్రీత్‌ బుమ్రా చెరో రెండు.. పేస్‌బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు హార్దిక్‌ పాండ్యా, శివం దూబే తలా ఒక వికెట్‌ పడగొట్టారు. స్పిన్నర్లలో వరుణ్‌ చక్రవర్తి.. ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ (Axar Patel) చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.

ఈ మ్యాచ్‌లో సఫారీ స్టార్‌, టాప్ రన్‌ స్కోరర్‌ డెవాల్డ్‌ బ్రెవిస్‌ (22)ను అవుట్‌ చేయడం ద్వారా.. బుమ్రా వంద వికెట్ల క్లబ్‌లో చేరాడు. అదే విధంగా.. కేశవ్‌ మహరాజ్‌ (0)ను కూడా పెవిలియన్‌కు పంపాడు.

అంపైర్‌ తప్పు చేశాడా?
సఫారీ జట్టు ఇన్నింగ్స్‌లో బుమ్రా పదకొండో ఓవర్‌లో బరిలోకి దిగగా.. రెండో బంతిని బ్రెవిస్‌ ఎదుర్కొన్నాడు. ఫుల్‌ స్వింగ్‌తో బంతిని వేసే క్రమంలో బుమ్రా క్రీజు లైన్‌ దాటేసినట్లుగా కనిపించింది.  దీంతో ఫ్రంట్‌-ఫుట్‌ నోబాల్‌ కోసం చెక్‌ చేయగా.. బుమ్రా షూ భాగం క్రీజు లోపలే ఉన్నందున దానిని ఫెయిర్‌ డెలివరీగా ప్రకటించాడు. 

అయితే, ఈ విషయంలో సోషల్‌ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అన్ని కోణాల్లో పరిశీలించకుండానే బ్రెవిస్‌ను థర్డ్‌ అంపైర్‌ పెవిలియన్‌కు పంపి తప్పు చేశాడంటూ సౌతాఫ్రికా జట్టు అభిమానులు నెట్టింట కామెంట్లు చేశారు. ఇదిలా ఉంటే.. బుమ్రా కంటే ముందుగా.. అర్ష్‌దీప్‌ టీమిండియా తరఫున టీ20లలో వంద వికెట్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.

టెస్టు, వన్డే, అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన బౌలర్లు వీరే
లసిత్‌ మలింగ (శ్రీలంక)
టిమ్‌ సౌతీ (న్యూజిలాండ్‌)
షకీబ్‌ అల్‌ హసన్‌ (బంగ్లాదేశ్‌)
షాహిన్‌ ఆఫ్రిది (పాకిస్తాన్‌)
జస్‌ప్రీత్‌ బుమ్రా (ఇండియా).

చదవండి: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్‌.. నమ్మశక్యంగా లేదు: సూర్యకుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement