సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా వార్షిక లీగ్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో కీ స్టోన్ బాస్కెట్‌బాల్ అకాడమీ... మహిళల విభాగంలో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ జట్టు విజేతలుగా నిలిచాయి. ఫైనల్స్‌లో కీ స్టోన్ జట్టు 75–66తో టైటాన్స్‌పై గెలుపొందింది. మ్యాచ్ మరో ఆరు నిమిషాల్లో ముగుస్తుందనే వరకు ఇరు జట్లు హోరాహోరీగా పోరాడగా... ఆఖర్లో జోరు పెంచిన కీ స్టోన్ జట్టు... కీలక పాయింట్లు ఖాతాలో వేసుకొని విజేతగా అవతరించింది. మ్యాచ్ ఆరంభంలో టైటాన్స్ చక్కటి ప్రదర్శన కనబర్చింది. ఒకదశలో 12–3తో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత తేరుకున్న కీ స్టోన్ ప్లేయర్లు సత్తాచాటి జట్టును పోటీలోకి తెచ్చారు. కీ స్టోన్ అకాడమీ తరఫున సహర్ష్ 21 పాయింట్లతో విజృంభించగా... సుభాశ్ 17, ప్రీతమ్ 10 పాయింట్లు సాధించారు.
క్రిష్య, ఆర్యన్ చెరో 8 పాయింట్లు సాధించగా... ప్రతీక్ 5, కార్తీక్ 4 పాయింట్లు ఖాతాలో వేసుకున్నారు. టైటాన్స్ తరఫున సల్మాన్ 16 పాయింట్లతో టాప్‌లో నిలవగా... నందిత్ 12, సూర్య 111, క్రిస్ 11, విక్కీ 10 పాయింట్లు సాధించారు. మహిళల విభాగంలో సెయింట్ ఫ్రాన్సిస్ జట్టు 57–55 పాయింట్లతో నిజాం బాస్కెట్‌బాల్ జట్టుపై గెలిచింది. సెయింట్ ఫ్రాన్సిస్ తరఫున పరీ 17 పాయింట్లతో విజయంలో కీలకపాత్ర పోషించింది. సంహిత 14, సానియా 11, హిబా 6, రేఖ 5 పాయింట్లు సాధించారు. నిజాంబాస్కెట్‌బాల్ జట్టు తరఫున అమిత 16, జాహ్నవి 14, శ్రుతి 10, లాస్య 9, ఖుష్బూ 6 పాయింట్లు సాధించారు.


