స్వారెజ్, రోడ్రిగోలు సైతం జతగా
14న ముంబైలో సెలబ్రిటీలతో ఫ్యాషన్ షో
15న ప్రధానితోనూ భేటీ
కోల్‌కతా: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లయోనల్ మెస్సీ భారత్ పర్యటనకు సంబంధించిన కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. ఇన్నాళ్లు ఫుట్‌బాల్ మైదానంలో అతని కిక్‌లు, పాస్‌లు చూసిన అభిమానులు ముంబైలో మాత్రం కొత్త మెస్సీని చూడబోతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆటలో అలరించిన అతను ఓ ప్రత్యేక ఫ్యాషన్ షోలో ర్యాంప్‌పై నడకతో ఆకట్టుకునే ప్రయత్నం చేయబోతున్నాడు.
‘జీఓఏటీ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) ఇండియా టూర్’లో భాగంగా మెస్సీ ఈ వారాంతంలో భారత్‌లో పర్యటించనున్నాడు. దీనికి సంబంధిన ఏర్పాట్లన్నీ ఇది వరకే పూర్తయ్యాయి. ఈ మూడు రోజుల పర్యటనలో నాలుగు ప్రధాన నగరాల్లో సెలబ్రిటీలతో కలిసి భారత అభిమానుల్ని అలరించనున్నాడు.
పర్యటనలో తొలిరోజు 13న ముందుగా కోల్‌కతాలో అడుగుపెట్టే మెస్సీ అక్కడి నుంచి అదే రోజు హైదరాబాద్‌కు విచ్చేస్తాడు. ఆ మరుసటి రోజు ఆదివారం ముంబై చేరుకుంటాడు. సోమవారం ఢిల్లీలో జరిగే కార్యక్రమాలతో అతని పర్యటన ముగుస్తుంది. ఆఖరి రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకుంటాడని నిర్వాహకులు షెడ్యూల్‌ను విడుదల చేశారు.
కోల్‌కతాలో వర్చువల్‌గా...
కోల్‌కతాలో క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్ అంటే చెవికోసుకుంటారు. విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అర్జెంటీనా దివంగత దిగ్గజం మారడోనా అంటే పడిచచ్చేంత అభిమానం కోల్‌కతా వాసులది. ఇప్పుడు మెస్సీ అంటే కూడా అదే స్థాయిలో ప్రాణమిస్తారు. కాబట్టి కోల్‌కతా పోలీసులు కోల్‌కతాలో మెస్సీ 70 అడుగుల భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వర్చువల్‌గా ఏర్పాటు చేశారు. భద్రతా కారణాలరీత్యానే హోటల్ నుంచే ఈ ఆవిష్కరణ ఉంటుందని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. అనంతరం బిజిబిజీగా ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటాడు.
హైదరాబాద్‌లో....
‘గోట్’ పాన్ ఇండియా టూర్‌ను దేశం నలువైపులా కవర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తూర్పున కోల్‌కతా నుంచి దక్షిణాన హైదరాబాద్, పశి్చమాన ముంబై, ఉత్తరాన ఢిల్లీ నగరాలకు వస్తాడు. హైదరాబాద్‌లో సెలబ్రిటీ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడతాడు. ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియంలో ‘గోట్ కప్’లో పాల్గొంటాడు. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మెస్సీతో కలిసి కిక్‌లు కొట్టనున్నారు.
ప్రధానితో ఢిల్లీలో...
హైదరాబాద్ నుంచి నేరుగా ఆదివారం ముంబైకి వెళ్లి అక్కడ క్లబ్ సహచరుడు స్వారెజ్, అర్జెంటీనా సహచరుడు రోడ్రిగోలతో కలిసి ఫ్యాషన్ షోలో పాల్గొంటాడు. చివరగా ఢిల్లీ చేరుకొని ప్రధాని మోదీతో భేటీ అవుతాడు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాలు పూర్తయ్యాక అదే రోజు రాత్రి స్వదేశానికి బయలుదేరతాడు.


