గ్లోబల్ ఫుట్‌బాల్ ఐకాన్.. లియోనెల్ మెస్సీ 'అనంత్ అంబానీ' స్థాపించిన వన్యప్రాణుల రక్షణ, పునరావాసం & పరిరక్షణ కేంద్రం వంతారాను సందర్శించారు. వంతారాలో కార్యక్రమాలు సాధారణంగా సనాతన ధర్మ సంప్రదాయాల ప్రకారం, ప్రకృతి & సమస్త జీవుల పట్ల గౌరవాన్ని చాటే విధంగా ప్రారంభమవుతాయి. ఈ సంప్రదాయాలను గౌరవిస్తూ మెస్సీ కూడా హిందూ ఆచారాల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇక్కడ చూడవచ్చు.
మెస్సీతో పాటు ఆయన సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డీ పాల్‌కు సంప్రదాయ జానపద సంగీతం, పూల వర్షం కురిపించి స్వాగతం పలికారు. ఆ తరువాత అంబే పూజ, గణేష్ పూజ, హనుమాన్ పూజ, శివాభిషేకంతో కూడిన మహా ఆరతిలో పాల్గొని, ప్రపంచ శాంతి & ఐక్యత కోసం ప్రార్థించారు.

వంతారాలో మెస్సీ .. సింహాలు, పులులు, ఏనుగులు, శాకాహార జంతువులు, సరీసృపాలు, జంతు పిల్లలను చూశారు. జంతువులకు అందిస్తున్న ఆధునిక వైద్య సదుపాయాలు, పోషణ, సంరక్షణ పద్ధతులు చూసి ఆయన ఎంతో సంతోషించారు. ప్రత్యేక వన్యప్రాణి ఆసుపత్రిలో జరుగుతున్న చికిత్సలు, శస్త్రచికిత్సలను ప్రత్యక్షంగా వీక్షించారు. అలాగే జిరాఫీలు, ఖడ్గమృగాలు, ఒకాపీలు, ఏనుగులకు ఆహారం కూడా పెట్టారు.
అనాథ & బలహీన జంతు పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఫోస్టర్ కేర్ సెంటర్‌లో, వాటి జీవన ప్రయాణాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీ & రాధిక అంబానీ కలిసి ఒక సింహపు పిల్లకు మెస్సీ గౌరవార్థంగా “లియోనెల్” అని పేరు పెట్టారు. ఈ పర్యటనలో అత్యంత గుర్తుండిపోయే సంఘటన ఏనుగుల సంరక్షణ కేంద్రంలో జరిగింది. అక్కడ ఏనుగు పిల్ల 'మణిక్లాల్'తో మెస్సీ సరదాగా ఫుట్‌బాల్ ఆడారు. ఆట ద్వారా జంతువులతో అనుబంధాన్ని చూపిస్తూ, ఆట అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ అర్థమయ్యే భాష అని నిరూపించారు. ఆ దృశ్యం అక్కడున్న అందరి మనసులను ఆకట్టుకుంది.


