మెస్సీ పాదానికి బీమా విలువ
అందుకే అసలు ఆటకు దూరం
న్యూఢిల్లీ: ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడైన లయోనల్ మెస్సీ గత మూడు రోజులుగా భారత్‌లో పర్యటిస్తున్నాడు. నాలుగు నగరాలు కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలలో అతని ఈవెంట్‌లు జరిగాయి. అయితే ఒక్క చోట కూడా అతను అభిమానుల కోసం ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడలేదు కదా... కనీసం సెమీ సీరియస్ తరహా ఆటను కూడా చూపించలేదు.
టీ షర్ట్, ట్రాక్‌తో ఏదో పార్క్‌లో జాగింగ్‌కు వెళుతూ తన వద్దకు వచ్చిన బంతిని అవతలి వారికి ఇచి్చనట్లుగా పాస్‌లు మాత్రమే అందించాడు! కొద్దిగానైనా అతను మైదానంలో చురుగ్గా పరుగెత్తుతూ ఆడినట్లుగా కనిపించలేదు. ఫోటో సెషన్‌లు, మైదానంలో అభిమానులకు చేతులు ఊపడం, కొన్ని కిక్‌లకు మాత్రమే మెస్సీ పరిమితయ్యాడు. దీనికి బలమైన కారణం ఉంది. తన ఆటకు ఆయువుపట్టులాంటి ఎడమ పాదానికి అతను బీమా చేయించుకున్నాడు.
ఈ బీమా విలువ అక్షరాలా 900 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 8 వేల కోట్లు)! మ్యాచ్ ఆడుతూ మైదానంలో అతని పాదానికి గాయమైతే బీమా సంస్థ బాధ్యత తీసుకుంటుంది. అయితే ఈ బీమాలో ఉన్న షరతుల ప్రకారం ఇది జాతీయ జట్టు (అర్జెంటీనా) లేదా తన క్లబ్ (ఇంటర్ మయామి) తరఫున ఆడుతున్నప్పుడు మాత్రమే ఈ బీమా సౌకర్యం వర్తిస్తుంది. సరదాగానైనా సరే... మరో చోట ఎక్కడైనా ఆడుతూ పొరపాటున గాయమైతే ఇది వర్తించకపోగా, న్యాయపరమైన చిక్కులు కూడా ఎదురవుతాయి.
భారత్‌లాంటి చోట ఏదైనా అనూహ్యం జరిగి గాయపడే ప్రమాదం ఉంటుంది కాబట్టి మెస్సీ అలాంటి సాహసం చేయలేదు! కేవలం అలా పైపై హడావిడితో అతను పర్యటన ముగించాడు. ఒకప్పుడు బాస్కెట్‌బాల్ దిగ్గజం మైకేల్ జోర్డాన్‌కు కూడా కెరీర్ ఆరంభంలో ఇలాంటి సమస్యే వచ్చింది. అయితే తర్వాతి రోజుల్లో కాంట్రాక్ట్ పునరుద్ధరణ చేసుకునే సమయానికి సూపర్ స్టార్‌గా మారిపోయిన అతను తనకు అనుకూలంగా ఒక క్లాజ్‌ను అందులో చేర్పించాడు. ‘లవ్ ఆఫ్ ద గేమ్’ అంటూ తాను ఎప్పుడైనా, ఎక్కడైనా తనకు నచి్చనట్లుగా ఆడతానని, ఎలాంటి షరతులు పెట్టరాదని, మామూలు మ్యాచ్‌లో గాయపడినా బీమా చెల్లించాల్సిందేనంటూ అతను ఒప్పందం చేసుకున్నాడు!


