అందుబాటులో మొత్తం రూ.237.55 కోట్లు
మధ్యాహ్నం గం. 2:30 నుంచి స్టార్ స్పోర్ట్స్
జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్షప్రసారం
అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–2026కు సంబంధించి మినీ వేలానికి రంగం సిద్ధమైంది. తమ జట్టులో మిగిలిన స్థానాలు పూరించుకునేందుకు లీగ్‌లో 10 జట్లు పోటీ పడనున్నాయి. అబుదాబి వేదికగా నేడు జరిగే ఈ వేలంలో మొత్తం 77 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 359 క్రికెటర్లు వేలానికి అందుబాటులో ఉండగా... ఖాళీల్లో గరిష్టంగా 31 మంది విదేశీ ఆటగాళ్ళను తీసుకునేందుకు అవకాశం ఉంది. వేలం మంగళవారం ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది.
అన్ని జట్లలోకి గరిష్టంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ వద్ద అత్యధికంగా రూ.64.30 కోట్లు ఉండగా, వారికే అందరికంటే ఎక్కువగా 13 మంది ఆటగాళ్ల అవసరం ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో 10 ఖాళీలు ఉండగా, చేతిలో మొత్తం రూ. 25.50 కోట్లు ఉన్నాయి. అత్యధిక కనీస ధర రూ.2 కోట్లతో ఏకంగా 40 మంది క్రికెటర్లు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో ఎంత మంది విలువ పైపైకి వెళుతుందనేది ఆసక్తికరం.
అయితే విదేశీ ఆటగాడికి ఎవరికైనా గరిష్టంగా రూ. 18 కోట్లు మాత్రమే దక్కుతాయి. వేలంలో అంతకంటే ఎక్కువ మొత్తానికి అతడిని సొంతం చేసుకున్నా... ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఆటగాళ్ల గరిష్ట రిటెన్షన్ విలువ (రూ.18 కోట్లు), మెగా వేలంలో ఒక ఆటగాడికి దక్కిన మొత్తం (పంత్‌కు రూ. 27 కోట్లు)కంటే ఇది ఎక్కువగా ఉండరాదు. వేలంలో అంతకంటే ఎక్కువగా వచ్చినా మిగిలిన మొత్తం బీసీసీఐకే వెళుతుంది.
గ్రీన్‌పై భారీ అంచనాలు!
మినీ వేలంలో కొందరు ఆటగాళ్లపై ప్రధానంగా అందరి దృష్టీ నిలిచింది. ఆ్రస్టేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌కు అందరికంటే ఎక్కువ విలువ పలికే అవకాశం కనిపిస్తోంది. 2023లో ముంబై ఇండియన్స్ తరఫున చక్కటి ప్రదర్శన కనబర్చిన గ్రీన్... 2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఫర్వాలేదనిపించాడు. గాయం కారణంగా గత సీజన్‌కు అతను దూరమయ్యాడు.
రసెల్ రిటైర్ రావడంతో కేకేఆర్‌కు అలాంటి ఆటగాడి అవసరం ఉండగా, మిడిలార్డర్‌లో ఆల్‌రౌండర్ కోసం చెన్నై చూస్తోంది. భారీ హిట్టర్, గత ఏడాది ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన లివింగ్‌స్టోన్ కూడా ఎక్కువ మొత్తం ఆకర్షించవచ్చు. ఇతర విదేశీ ఆటగాళ్లలో డికాక్, పతిరణ, జేమీ స్మిత్‌పై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తున్నారు.
కాన్వే, మిల్లర్, హసరంగ, ముల్డర్, నోర్జే తదితరులు కూడా వేలంలో అందుబాటులో ఉన్నారు. భారత క్రికెటర్లలో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ పెద్ద మొత్తం అందుకోవచ్చు. వెంకటేశ్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, దీపక్ హుడా, ఆకాశ్‌దీప్, రాహుల్ చహర్ తదితరులు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గత ఏడాది వరకు ఐపీఎల్‌లో తమదైన ముద్ర వేసిన మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్ ఈసారి వేలానికి అందుబాటులోకి లేకపోగా, రసెల్ ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించాడు.


