క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 వేలంపైనే కేంద్రీకృతమై ఉంది. అబుదాబి వేదికగా మంగళవారం (డిసెంబరు 16) వేలంపాట నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, అంతకంటే ముందు టీమిండియా మాజీ స్టార్లతో బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ మాక్ వేలాన్ని నిర్వహించింది.
ఆ మాక్ ఆక్షన్‌లో ముప్పై మంది ప్లేయర్లను వేలం వేయనున్నారు. ఇందులో భాగంగా పది ఫ్రాంఛైజీల తరఫున పది మంది భారత మాజీ క్రికెటర్లు మాక్ వేలంలో పాల్గొన్నారు. వీరిలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు ప్రాతినిథ్యం వహించిన రాబిన్ ఊతప్ప తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.
క్లారిటీ ఇచ్చిన గ్రీన్
వేలం నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ (Cameron Green)పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, అతడు పూర్తిస్థాయి బ్యాటర్‌గా పేరు నమోదు చేసుకోవడం గందరగోళానికి గురిచేసింది. ఈ పేస్ ఆల్‌రౌండర్ బౌలింగ్ సేవలు అందిస్తాడా? లేదా? అన్న సందేహాలు నెలకొన్నాయి.
ఈ విషయంపై గ్రీన్ ఇటీవల స్వయంగా స్పందించాడు. తాను బౌలింగ్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని.. తన మేనేజర్ తప్పిదం వల్లే అనుకోకుండా ప్యూర్ బ్యాటర్ బ్యాక్స్ టిక్ చేసినట్లు ఉన్నారని తెలిపాడు. ఈ నేపథ్యంలో మాక్ వేలంలో గ్రీన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సురేశ్ రైనా, కోల్‌కతా తరఫున రాబిన్ ఊతప్ప పోటీపడ్డారు.
రూ. 30.50 కోట్ల భారీ ధరతో
ఈ క్రమంలో గ్రీన్ ధర ఏకంగా రూ. 27 కోట్లు దాటింది. అయినప్పటికీ తగ్గేదేలే అన్నట్లు రైనా, ఊతప్ప పట్టువీడలేదు. ఏకంగా రూ. 30.50 కోట్ల భారీ ధరతో గ్రీన్‌ను కొనుగోలు చేశాడు ఊతప్ప. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే ఇది అత్యధిక ధర. గతేడాది మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ టీమిండియా స్టార్ రిషభ్ పంత్‌ను రూ. 27 కోట్ల అసలైన ధరకు కొనుక్కుంది.
ఇక ఈ మాక్ వేలంలో ఊతప్ప గ్రీన్‌కు ఈ మేర.. పర్సులో దాదాపు సగం మొత్తం గ్రీన్ కోసం కేటాయించడం విశేషంగా నిలిచింది. ఇక గ్రీన్‌తో పాటు జానీ బెయిర్ స్టో (రూ. 2.5 కోట్లు)ను కూడా కొనుగోలు చేసిన ఊతప్ప.. శ్రీలంక యువ పేసర్, చెన్నై మాజీ బౌలర్ మతీశ పతిరణ కోసం ఏకంగా రూ. 13 కోట్లు వెచ్చించాడు.
అత్యధికంగా రూ. 64.3 కోట్లు
కాగా ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు కేకేఆర్ వెంకటేశ్ అయ్యర్ (రూ. 23.75 కోట్లు), ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ (రూ. 12 కోట్లు)ల రూపంలో ఖరీదైన ఆటగాళ్లను వదిలేసింది. ఈ క్రమంలో కేకేఆర్ పర్సులో అత్యధికంగా రూ. 64.3 కోట్లు చేరింది.
అయితే, మాక్ వేలంలో ఒక్క గ్రీన్ కోసమే ఊతప్ప రూ. 30 కోట్లు వెచ్చించడం విశేషం. రసెల్ రిటైర్మెంట్‌తో ఏర్పడిన ఆల్‌రౌండర్ స్థానాన్ని భర్తీ చేసే సరైన ఆప్షన్ అని భావించే అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా కేకేఆర్‌లో మొత్తంగా 13 స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
చదవండి: Ashes: మూడో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. అతడిపై వేటు


