టీ20 ప్రపంచకప్-2024 టైటిల్ గెలిచిన తర్వాత టీమిండియాలో చోటు చేసుకున్న ప్రధాన మార్పు.. దిగ్గజాలు రోహిత్ శర్మ- విరాట్ కోహ్లిలేని జట్టు. ఈ మెగా టోర్నీలో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత వీరిద్దరు అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.
హార్దిక్ పాండ్యాకు బదులు
ఇక అప్పటి నుంచి జట్టు పునర్నిర్మాణంలో భాగంగా భిన్న పరిణామాలు చోటుచేసుకున్నాయి. హార్దిక్ పాండ్యాకు బదులు సూర్యకుమార్ యాదవ్‌కు బీసీసీఐ పగ్గాలు అప్పగించింది. అతడు సారథిగా విజయాలు సాధిస్తున్నా.. బ్యాటర్‌గా మాత్రం అప్పటి నుంచి విఫలమవుతూనే ఉన్నాడు.
మరోవైపు.. బ్యాటింగ్ ఆర్డర్‌లో కీలకమైన మూడో స్థానంలో ఎవరిని ఆడించాలన్న విషయం ఇప్పటికీ స్పష్టత రాకపోవడం విమర్శలకు తావిస్తోంది. టీ20 ఫార్మాట్లో మరో వరల్డ్‌కప్ టోర్నీకి సమయం ఆసన్నమవుతున్న వేళ.. టీమిండియాలో ఇంత వరకు ఈ కన్ఫ్యూజన్‌కు మాత్రం తెరపడటం లేదు.
మూడో స్థానంలో
ఒకప్పుడు మూడో స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ బ్యాటింగ్‌కు వచ్చేవాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకుని తిరిగి వచ్చిన తర్వాత కూడా సత్తా చాటి ప్రపంచకప్‌లో పాల్గొన్నాడు పంత్. అయితే, ఆ తర్వాత పంత్‌తో పాటు చాలా మంది సీనియర్లకు టెస్టుల్లో ప్రాధాన్యం ఇస్తూ టీ20 జట్టును యువ ఆటగాళ్లతో నింపేసింది యాజమాన్యం.
అభిషేక్ శర్మకు తోడుగా.. సంజూ శాంసన్‌ను ఓపెనర్‌గా పంపగా.. వీరు సక్సెస్‌ఫుల్ జోడీగా నిరూపించుకున్నారు. ఇక మూడో స్థానంలో యువ ఆటగాడు తిలక్ వర్మ.. కెప్టెన్ సూర్యతో పోటీపడ్డాడు. వన్‌డౌన్‌లో తాను సరైన వాడినేనని నిరూపించుకున్నాడు కూడా!
పక్కనపెట్టేశారు
అయితే, గత కొంతకాలంగా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలతో విమర్శల పాలవుతున్న విషయం తెలిసిందే. గిల్ కోసం ఓపెనర్‌గా సంజూను తప్పించి.. మిడిలార్డర్‌లో ఓసారి, వన్‌డౌన్‌లో ఓసారి ఆడించారు. ఇప్పుడిక ఏకంగా వికెట్ కీపర్ కోటాలోనూ ఆడించకుండా పక్కనపెట్టేశారు. మరోవైపు.. కీపర్‌గా, ఫినిషర్‌గా జితేశ్ శర్మ రాణిస్తుండటంతో సంజూ ప్రపంచకప్ ఆశలు దాదాపు ఆవిరిఅయ్యినట్టే!
ముచ్చటైన ‘మూడు’ కోసం ఇప్పటికే ఏడుగురు
ఇక మూడో స్థానం విషయానికొస్తే.. 2024 వరల్డ్‌కప్ తర్వాత ఇప్పటి వరకు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, శివం దూబే, అక్షర్ పటేల్.. ఇలా చాలా మంది ఆడారు. వీరిలో సూర్య 26.92 సగటుతో 157కు పైగా స్ట్రైక్‌రేటుతో 377 పరుగులు సాధించగా.. తిలక్ వర్మ 185కు పైగా స్ట్రైక్‌రేటుతో.. 161కి పైగా సగటుతో ఏకంగా 323 పరుగులు సాధించాడు.
మిగిలిన వారిలో రుతురాజ్, సంజూ, అభిషేక్, శివం, అక్షర్.. ప్రయోగాత్మకంగా వచ్చి వరుసగా 84, 58, 24, 24, 21 పరుగులు చేశారు. అయితే, ఇటీవల సౌతాఫ్రికాతో సిరీస్‌కు ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తమ జట్టులో కేవలం ఓపెనింగ్ జోడీ మాత్రమే స్థిరంగా ఉంటుందని స్పష్టం చేశాడు. మిగతా ఆటగాళ్లు బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏ స్థానంలో రావడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని.. ఉంటారనీ పేర్కొన్నాడు.
వారధి
నిజానికి టీ20 క్రికెట్‌లో నంబర్ 3 అనేది ఫిల్లర్ పొజిషన్ కానేకాదు. ఓపెనర్లు వేసిన పునాదిని బలపరుస్తూ.. మిడిలార్డర్‌కు సహకరించేలా వన్‌డౌన్ బ్యాటర్ వారధిని నిర్మించాల్సి ఉంటుంది. పరిస్థితిని బట్టి ఒక్కోసారి పవర్‌ప్లేలోనే రావాల్సి ఉంటుంది. మరికొన్నిసార్లు బాధ్యతాయుతంగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించాల్సి ఉంటుంది.
మిగతా వారితో పోలిస్తే వన్‌డౌన్‌లో ఆడే ఆటగాడికి ఫిక్స్‌డ్ పొజిషన్ ఉండటం అత్యంత ముఖ్యం. అందుకు తగ్గట్టుగా అతడు నైపుణ్యాలు కనబరచగలడు. కానీ టీమిండియా నాయకత్వ బృందం దీనిని ఒక ట్రయల్ రూమ్‌గా మార్చేసి ఇష్టారీతిన ప్రయోగాలు చేస్తోంది.
సమస్యను ఫిక్స్ చేసుకోవాలి
అయితే, ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. మన జట్టులో ప్రతిభకు కొదవలేదు. కానీ దానిని ఉపయోగించుకునే విధానంలో స్పష్టత లోపించింది. ఏదేమైనా వరల్డ్‌కప్ నాటికి టీమిండియా నంబర్ 3 సమస్యను ఫిక్స్ చేసుకోవాలి.
అనుభవజ్ఞుడైన సూర్యను లేదంటే.. మూడో స్థానంలో ఇప్పటికే నిరూపించుకున్న తిలక్ వర్మను పంపాలి. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలు గెలవాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదు. అందుకు తగ్గ ప్రణాళికలు, జట్టు కూర్పులో స్పష్టత అవసరం.
చదవండి: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. ప్రపంచంలోనే ‘బెస్ట్’ ప్లేయర్‌గా..


