సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో టీమిండియా నాయకుడు సూర్యకుమార్ యాదవ్ బ్యాటర్‌గా విఫలమవుతూనే ఉన్నాడు. ఒకప్పుడు ప్రపంచంలోనే నంబర్ వన్‌గా ఉన్న అతడు.. ఇప్పుడు కనీసం పట్టుమని పది పరుగులు చేసేందుకు కూడా శ్రమించాల్సి వస్తోంది.
కెప్టెన్, వైస్ కెప్టెన్ ఫెయిల్
సూర్య సంగతి ఇలా ఉంటే.. వైస్ కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్ (Shubman Gill) కూడా వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. దాదాపు గత ఇరవైకి పైగా ఇన్నింగ్స్‌లో అతడు కనీసం హాఫ్ సెంచరీ కూడా బాదకపోవడం ఇందుకు నిదర్శనం.
ఈ నేపథ్యంలో నాయకత్వ బృందమే ఇలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026 (T20 WC 2026) నాటికి టీమిండియా పరిస్థితి ఏమిటన్న సందేహాలు వస్తున్నాయి. కెప్టెన్‌గా విజయవంతమవుతున్నందున సూర్యకుమార్ (Suryakumar Yadav)పై విమర్శల పదును కాస్త తక్కువగా ఉండగా.. సంజూ శాంసన్‌ను బలి చేసి గిల్‌కు వరుస అవకాశాలు ఇస్తున్నారన్న అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
సూర్య, గిల్‌పై నమ్మకం ఉంది
ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో మూడో టీ20లో విజయానంతరం భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ‘‘మీడియా ముఖంగా మీ అందరికీ నేనొక మాట చెబుతా.. గుర్తుపెట్టుకోండి.
సూర్య, గిల్‌పై నాకు నమ్మకం ఉంది. వీరిద్దరు కలిసి టీ20 ప్రపంచకప్ టోర్నీలో మ్యాచ్‌లు గెలిపించబోతున్నారు. అంతకంటే ముందు ఈ సిరీస్‌లో జట్టును గెలిపిస్తారు.
వీళ్లిద్దరితో కలిసి నేను చాలా కాలంగా ఆడుతున్నా. ముఖ్యంగా.. శుబ్‌మన్‌తో ఆడిన అనుభవం నాకుంది. ఎలాంటి పరిస్థితుల్లో.. అతడు ఎలా ఆడతాడో నాకు తెలుసు. ప్రత్యర్థి ఎవరైనా తన సమయం వచ్చినపుడు అతడు చెలరేగి ఆడతాడు.
త్వరలోనే మీరు కూడా చూస్తారు
సూర్య, గిల్ గురించి నాకు తెలుసు. అందుకే వారిపై నాకు అంత నమ్మకం. త్వరలోనే మీరు కూడా ఇది చూస్తారు. ముఖ్యంగా గిల్‌ను విమర్శిస్తున్న వారు.. త్వరలోనే అతడి నైపుణ్యాలను కళ్లారా చూస్తారు’’ అని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు. అతడి వ్యాఖ్యలపై టీమిండియా అభిమానుల నుంచి సైతం మిశ్రమ స్పందన వస్తోంది.
వరుస వైఫల్యాలు
కాగా అభిషేక్ శర్మకు జోడీగా ఓపెనర్‌గా వస్తున్న గిల్.. సౌతాఫ్రికాతో ఇప్పటి వరు జరిగిన మ్యాచ్‌లలో చేసిన స్కోర్లు వరుసగా.. 4(2), 0(1), 28 (28). మరోవైపు.. సూర్య చేసిన పరుగులు 12(11), 5(4), 12(11). ఇక అభిషేక్ శర్మ తొలి టీ20లో (17), రెండో టీ20లో (17) తడబడ్డా.. మూడో టీ20లో 35(18) మెరుగ్గా రాణించాడు.
ఇదిలా ఉంటే.. కటక్‌లో తొలి టీ20లో గెలిచిన టీమిండియా.. ముల్లన్‌పూర్‌లో మాత్రం సఫారీల చేతిలో ఓడిపోయింది. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో ధర్మశాలలో జయభేరి మోగించి.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా ఫిబ్రవరి 7న టీ20 ప్రపంచకప్-2026 మొదలుకానుంది. ఈ మెగా టోర్నీకి భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తాయి.
చదవండి: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. ప్రపంచంలోనే ‘బెస్ట్’ ప్లేయర్‌గా..


