ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఆస్ట్రేలియాలో తనకు ఎదురైన భయంకరమైన అనుభవాన్ని పంచుకున్నాడు. తాను కూడా బాండీ బీచ్‌కు వెళ్లాలనుకున్నానని.. అయితే, రెస్టారెంట్ నిర్వాహకుల అప్రమత్తతే తనను కాపాడిందని పేర్కొన్నాడు. తాను, తన కుటుంబం ప్రస్తుతం సురక్షితంగా ఉన్నామని తెలిపాడు.
కాగా బాండీ బీచ్‌లో కాల్పుల మోతతో ఆస్ట్రేలియా ఆదివారం ఉలిక్కి పడింది. ఇద్దరు ముష్కరులు తుపాకీలు చేతబట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సంప్రదాయ హనుక్కా వేడుకలో పాల్గొంటున్న యూదులుపై కాల్పులకు తెగబడి దాదాపుగా పదహారు మందిని పొట్టనబెట్టుకున్నారు.
తండ్రీ-కొడుకులే
ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు సహా 38 మంది గాయపడగా.. ఇది ముమ్మాటికీ ఉగ్రవాద దాడేనని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ ఘాతుకానికి పాల్పడిన ముష్కరులు తండ్రీ-కొడుకులే కావడం గమనార్హం. వీరు పాకిస్తాన్ నుంచి వలస వచ్చి ఆస్ట్రేలియాలో ఉంటున్నారు.
పండ్ల వ్యాపారి ధైర్యం
మరోవైపు.. వీరిద్దరు ఉన్మాద చర్యకు పాల్పడుతుండగా అహ్మద్ అనే పండ్ల వ్యాపారి ధైర్యం ప్రదర్శించి ఓ ఉగ్రవాదిని చెట్టు వెనుక నుంచి పట్టుకుని.. అతడికే గన్ గురిపెట్టి తరిమేశాడు. ఇంతలో మరో ఉగ్రవాది అతడిపై కాల్పులు జరుపగా అహ్మద్ కుప్పకూలిపోయాడు. ఏదేమైనా అహ్మద్ లేకుంటే మరికొంత మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయేవారే!
ఆ శబ్దాలు విని
ఈ పరిణామాలపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ మైకేల్ వాన్ తాజాగా స్పందించాడు. బాండీ బీచ్‌లో కాల్పులు జరిపిన సమయంలో తాను అక్కడికి దగ్గర్లోనే ఉన్నానని తెలిపాడు. ‘‘తొలుత ఆ శబ్దాలు విని షార్క్ దాడి చేసిందేమో అనుకున్నాము. అయితే, కాసేపటి తర్వాత చెవులు రిక్కించి వినగా.. అది ఇంకేదో శబ్దమని అర్థమైంది.
అపుడు నేను నా కుటుంబంతో కలిసి దగ్గర్లోని ఓ రెస్టారెంట్‌లో ఉన్నాను. మేము ఆర్డర్ చేసిన పదార్థాల కోసం వేచి ఉన్నాము. ఇంతలో నాకు ఫోన్ కాల్ రావడంతో బయటకు వెళ్లి మాట్లాడుతున్నా.
అప్పుడు ఓ బౌన్సర్ తన చేతిలో తుపాకీ పట్టుకుని నా వైపు వేగంగా దూసుకువచ్చాడు. వెంటనే లోపలికి వెళ్లాలని నన్ను హెచ్చరించాడు. బయట జరుగుతున్న దాడి గురించి మాకు అప్పుడే తెలిసింది. సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. బీచ్‌లో చాలా మందిని బంధించారని కొంతమంది అన్నారు.
లోపలి నుంచి తాళం వేశారు
సిడ్నీ, ఆస్ట్రేలియా వ్యాప్తంగా ఇలాంటి దాడులు ప్లాన్ చేశారనే చర్చ నడుస్తోంది. మేమున్న రెస్టారెంట్ తలుపులన్నింటికి లోపలి నుంచి తాళం వేశారు. బయట పరిస్థితి చక్కబడిందని తెలిసిన తర్వాతే మమ్మల్ని పంపించారు. రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది వరకు మేము అక్కడే లాక్ అయిపోయాం.
నా జీవితంలో ఇంతటి భయంకర అనుభవాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదు. నాతో పాటు నా భార్య, సోదరి, నా ఇద్దరు కుమార్తెలు, వారి స్నేహితురాలు ఇలా.. అందరం అక్కడే ఉన్నాము. పిల్లలు భయపడకుండా నాలో భయాన్ని అణిచిపెట్టుకుంటూ వారికి ధైర్యం చెప్పాను. వారి గురించే నా ఆందోళన, భయం. బయట ఉన్నవారి పరిస్థితి గురించి కూడా బాధేసింది.
బీచ్‌కు వెళ్లాలని మేము అనుకున్నాము. అక్కడే నా కుమారుడు క్రికెట్ ఆడుతూ.. పరుగులు తీస్తుంటే చూశాము. పబ్, రెస్టారెంట్ కాకుండా మా తదుపరి గమ్యం అదే అయి ఉండేది’’ అని ది టెలిగ్రాఫ్‌నకు రాసిన కాలమ్‌లో మైకేల్ వాన్ పేర్కొన్నాడు.
ఆ హీరోకి మనమంతా రుణపడి ఉండాలి
ఇక ఎక్స్ వేదికగానూ ఇదే విషయంపై స్పందిస్తూ.. ‘‘బాండీ ఘటన సమయంలో మేము రెస్టారెంట్లో లాక్ అయిపోయి ఉన్నాము. ఇప్పుడు సురక్షితంగా ఇంటికి చేరుకున్నాము. ఎమర్జెన్సీ సర్వీస్ వారికి ధన్యవాదాలు.
అదే విధంగా.. ఉగ్రవాదిని అడ్డుకుని ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఆ హీరోకి మనమంతా రుణపడి ఉండాలి. ఈ ఘటనతో ప్రభావితమైన ప్రతి ఒక్కరికి నా సానుభూతి’’ అని మైకేల్ వాన్ పోస్ట్ పెట్టాడు. కాగా ఆసీస్- ఇంగ్లండ్ మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్ కామెంట్రీ కోసం వాన్ ఆస్ట్రేలియాకు వెళ్లాడు.


