పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అని సామెత. ఈయనగారి వ్యవహారం ఇంతకంటే ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే అప్పుడెప్పుడో బైబిల్‌లో చెప్పినట్టు ఈయనగారు కూడా ఒక ఆర్క్‌ను కట్టేస్తున్నాడు. ఆర్క్ అంటే ఏమిటని అనుకుంటున్నారా? ఇది బుక్ ఆఫ్ జెనిసిస్‌లోని ఓ గాథ. భూమ్మీద మనుషులందరూ స్వార్థంతో వ్యవహరిస్తున్నారని క్రీస్తు నోవా అనే భక్తుడికి ఓ నావను నిర్మించమని బాధ్యతను అప్పగిస్తాడు. నోవా, అతడి కుటుంబం కలిసికట్టుగా ఈ నావను నిర్మిస్తుంది. ప్రళయమొచ్చి భూమి మొత్తం నాశనమైపోతుంది. కానీ నోవా కుటుంబం, ఆ నౌక మాత్రం చెక్కు చెదరదు. నౌకలో దాచిన జంతువుల జంటలు, విత్తనాలతో ప్రపంచం మళ్లీ మొదలవుతుందని ‘నోవాస్ ఆర్క్’ కథ చెబుతుంది.
సరిగ్గా ఇదే కథనాన్ని పోలినట్లు.. ‘డిసెంబర్ 25 నుంచి భీకర వరదలు చుట్టుముట్టనున్నాయని.. ఇవి నాలుగేళ్లపాటు కొనసాగి ప్రపంచాన్నంతటికీ అల్లకల్లోలం చేయనున్నాయని.. ఈ విషయాన్ని దేవుడు తనకు చెప్పాడని ఆఫ్రికా దేశమైన ఘనాకు చెందిన స్వయం ప్రకటిత ప్రవక్త ఎబో నోహ్ చెబుతున్నాడు. తన భవిష్యవాణితో ఎబో జీసస్‌గా పేరొందిన ఈ ప్రవక్త ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఈ ప్రళయం నుంచి విశ్వాసులను, జంతువులను రక్షించడానికి పది భారీ చెక్క ఓడలను నిర్మించాలని దేవుడు తనకు ఆజ్ఞాపించాడని కూడా ఎబో నోహ్ తెలిపాడు. ఈ ఘనా ప్రవక్త హెచ్చరికల నేపధ్యంలో ఇప్పటివరకు, ఎనిమిది భారీ ఓడల నిర్మాణం పూర్తయినట్లు తెలుస్తోంది. అతని హెచ్చరికలు బుక్ ఆఫ్ జెనిసిస్‌లోని కథనంలో పోలివుండటంతో దీనిపై చర్చజరుగుతోంది.
ఈ నేపధ్యంలో ఎబో నోహ్ ప్రవచనాలు, ఓడ నిర్మాణానికి సంబంధించిన వీడియోలు టిక్‌టాక్, యూట్యూబల్‌లలో విరివిగా వైరల్ అవుతున్నాయి.ఎబో నోహ్ అనుచరులు ఈ హెచ్చరికలను అందరికీ చెబుతున్నారు. అయితే ఎబో నోహను విమర్శించేవారు మాత్రం ఈ హెచ్చరికలను నమ్మడం లేదు. బైబిల్‌లో వర్ణించిన వరద ఘటన ఒకేసారి మాత్రమే జరిగిందని వారు అంటున్నారు. ఎబో నోహ్ ఎప్పటి నుంచో ఇలానే చెబుతూ వస్తున్నారని విమర్శిస్తున్నారు. కాగా ఘనా మత పెద్ద బిషప్ అబేద్ క్వాబెనా బోకియే అసియామా తదితరులు ఈ హెచ్చరికకు మద్దతు పలుకుతూ, వరద రాబోతోందనే భయంతో ఉన్న ప్రజలను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కాగా ఎబో నోహ్ హెచ్చరికలకు శాస్త్రీయంగా ఎటువంటి ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: పీకే యూ టర్న్? ప్రియాంకను కలిసి..


