ఆత్మీయం
ఈ ప్రపంచంలో తప్పుడు పనులు, హింస, వంచనలతో కావాల్సినంత సంపదను పొంది సుఖంగా ఉన్నవారు ఒక వైపు ఉంటే, సదా సత్యాన్నే చెబుతూ ధర్మ కార్యాలలో ఆసక్తులై కూడా దుఃఖంతోనే జీవితాన్ని గడిపే ప్రజలు మరోవైపు ఉన్నారు. కొంతమందికి ఎన్ని మందులు స్వీకరించినా కూడా రోగం పరిహారం అవ్వట్లేదు. అయితే ఈ ఔషధాలను స్వీకరించకుండా ఆరోగ్యవంతులై బతుకుతున్నారెంతోమంది.
కొంతమందికి సంపదల వాన కురుస్తుంది. అయితే డబ్బులు అవసరం ఉన్నవారికి మాత్రం ఒక చిల్లిగవ్వ కూడా లభించదు. భగవంతుడిని సర్వసమర్థుడు అంటున్నారు. అలా అయితే అతడు అందరికీ సుఖాన్ని కలిగించాలి కదా! ఎందుకు ఈ పక్షపాతం? ఇలా లోకంలో జనసామాన్యానికి కలిగే ప్రశ్నలను తీసుకొని ధర్మవ్యాధుడు ఇలా సమాధానం చెబుతున్నాడు.
మన జీవితంలో ఈ లోటుపాట్లకు బాధ్యులం మనమే. భగవంతుడు కాదు. మనిషి జీవితం కేవలం ఒక జన్మ కే పరిమితం కాదు. నూరు జన్మలలో చేసిన కర్మలను ఈ జన్మలో కాని ముందు జన్మలో గాని అనుభవించాల్సిందే. అలా అని మన కష్టాలన్నింటికీ దేవుడే కారణం అని అతడిని దూషించకూడదు.
లోకంలో కొందరు దుష్కర్మలను చేసి వాటిని దేవుడిపై వేస్తుంటారు. అన్నింటినీ చేయించేవాడు దేవుడే అయినప్పుడు నేను చేసే తప్పులలో నా పాత్ర ఏముంటుంది? ఇలా అహంకారంతో చేసిన చెడ్డ పనుల గురించి పశ్చాత్తాపం లేకుండా తిరుగుతుంటారు. వర్షం అన్ని ప్రదేశాలో సమానంగా కురుస్తున్నట్లు, భగవంతుడు కూడా అనాథలైన జీవులను భూమిపైకి తెస్తాడు. తర్వాత వారి వారి స్వభావానికి అనుగుణంగా వారు పెరుగుతారు. భగవంతుడు ఎదుగుదలకు కావలసిన అనుకూలతలను మాత్రం ఏర్పాటు చేస్తాడు.


