నాకు మొదటినుంచి దేవుడంటే విపరీతమైన భయభక్తులు. తరచు గుళ్లకు వెళుతుంటాను. రోజూ పూజ చేస్తుంటాను. అయితే గత రెండేళ్లుగా దేవుళ్లపైన విపరీతమైన చెడు ఆలోచనలు వస్తున్నాయి. దేవుడిని బూతుమాటలు తిట్టినట్లు, దేవుడి పటాలను అగౌరవపరచినట్టు... ఇలా రాయడానికి వీలులేని చెడ్డ తలంపులు వస్తున్నాయి. దాంతోటే ‘ఇది చాలా తప్పు, నాలాంటి భక్తుడికి ఇలాంటి చెడు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి...’ అని మాన సికంగా చాలా మధన పడుతున్నాను. ఈ ఆలోచనల మూలాన దేవుడు నన్ను శపిస్తాడేమోననే భయంతో సరైన తిండి, నిద్రలతోపాటు మనశ్శాంతికి కూడా దూరం అయియాను. ఏ పనిమీదా ధ్యాస పెట్టలేకపోతున్నాను. నాకీ బాధనుంచి విముక్తి కలిగే మార్గం చెప్పగలరు.
– రఘురామ్, నల్గొండ
ఎంత వద్దనుకున్నా మనసులో ఇలా మాటిమాటికీ చెడు తలంపులు వచ్చి, మనసును బాధించే ఇలాంటి ఆలోచనలను అబ్‌సెషన్స్ అంటారు. ఆ చెడు తలంపులనుంచి బయటపడేందుకు మాటిమాటికీ లెంపలేసుకోవడం, దండాలు పెడుతూ ఉండటాన్ని కంపల్షన్స్ అంటారు. ఇది ఒక ప్రత్యేకమైన మానసిక రుగ్మత. దీనిని ఓసీడీ అంటారు. మన మెదడులోని సెరటోనిన్ అనే ఒక ప్రత్యేకమైన రసాయన పదార్థం సమతుల్యతలో తేడాలొచ్చినప్పుడు కొందరిలో ఇలాంటి విపరీతమైన ఆలోచనలు, ధోరణులు కలుగుతాయి.
ఇవి రాకూడదని ప్రయత్నించినకొద్దీ మరింత ఎక్కువగా మనసులోకి చొచ్చుకొచ్చి విపరీతమైన మానసిక సంఘర్షణకు గురిచేస్తాయి. ఈ ఆలోచనలకు మూలకారణమైన మీ మెదడులోని రసాయన చర్యను సరిచేయడం ద్వారా ఈ అబ్‌సెషన్స్‌ను పూర్తిగా అదుపు చేయవచ్చు. ఆధునిక మానసిక వైద్యశాస్త్రంలో ఈ ఓసీడీ జబ్బును పూర్తిగా తగ్గించేందుకు మంచి మందులు, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనే మానసిక చికిత్స అద్భుతంగా పని చేస్తాయి.
మందులతోపాటు థాట్ స్టాపింగ్, ఎక్స్‌పోజర్ రెస్పాన్స్ అండ్ ప్రివెన్షన్ అనే మానసిక చికిత్స ద్వారా దేవుడిపైన మీకు కలిగే చెడు ఆలోచనలనుంచి విముక్తి కలిగించవచ్చు. ఓసీడీ జబ్బును తగ్గించేందుకు వీటికితోడు ఇటీవలే వచ్చిన ఆర్.టి.ఎం.ఎస్. అనే అత్యాధునిక పరికరాన్ని వాడుతున్నాము. మీరు వెంటనే మీకు అందుబాటులో ఉన్న సైకియాట్రిస్టును కలిసి చికిత్స తీసుకోండి. ఆల్ ది బెస్ట్!
డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
(మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.co)


